Top
logo

బీజేపీకి సవాల్‌గా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు పోటీగా ధీటైన అభ్యర్థి..

బీజేపీకి సవాల్‌గా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు పోటీగా ధీటైన అభ్యర్థి..బీజేపీకి సవాల్‌గా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
Highlights

వరుస పరాజయాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న బీజేపీ, ఢిల్లీ ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకోవాలని...

వరుస పరాజయాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న బీజేపీ, ఢిల్లీ ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ఈ మధ్య జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని బీజేపీ కోల్పోతూ వచ్చింది. హరియాణాలో మరో పార్టీతో జతకట్టి అధికారాన్ని నిలబెట్టుకుంది, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

దేశమంతటా గెలిచి, దేశాన్ని ఏలే ఢిల్లీలో 2015లో చవిచూసిన ఘోర పరాజయం బీజేపీకి ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకుంది. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికలు కమలనాథులకు ఆందోళన కల్గిస్తున్నాయి. భారీ మెజారిటీ మాట పక్కన పెట్టి, కనీసం బొటాబొటీ సాధించి సర్కారు నెలకొల్పినా చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలకు సవాల్ గా మారాయి.

తిరుగులేని మెజారిటీతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ కేంద్రంతో ప్రతి విషయానికీ తగవులాడుతూ పేచీకోరుగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు జనం మనసు గెలుచుకునే పథకాలను అమలుచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశారు. మొహల్లా క్లినిక్‌లు, సంచార క్లినిక్‌లతో వైద్యాన్నిబస్తీల దగ్గరకు తీసుకెళ్లారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజాకర్షణ పథకాలు చేపట్టారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, విద్యుత్తు బిల్లుల్లో 200 యూనిట్ల వరకు పూర్తి రాయితీ, నీటి బిల్లులపై రాయితీ వంటి నిర్ణయాలు కేజ్రీవాల్ జనాదరణను మరింత పెంచాయి.

ఢిల్లీలో బలమైన నేతగా పాతుకుపోతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢీ కొట్టే సీఎం అభ్యర్థి కోసం బీజేపీ నేతలు అన్వేషణ మొదలుపెట్టారు. పార్టీలు, సిద్ధాంతాలు చూసి ఓట్లు వేసే రోజులు పోయి, సీఎం అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తున్నారని ఈ మధ్య జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌కు ధీటైన నేతను బరిలో దింపితే ఎంతో కొంత ఫలితం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 2015లో కిరణ్ బేడీని నిలబెట్టి చేసిన ప్రయోగం ఫలితం రాలేదు. ఈ సారి కిరణ్ బేడి కంటే బలమైన సీఎం అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాకర్షణ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో నిరాశ కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడోస్థానం దక్కింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆప్ కు వెళ్లిపోయింది. అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ సారి కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తే ఆప్ విజయం కొద్దిగా కష్టంగా మారనుంది. మరోసారి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తమకే లభిస్తుందని కేజ్రివాల్ ధీమాగా ఉన్నారు. బీజేపీని ఎలాగైనా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పరోక్షంగా ఆప్ కు సహకరించనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను బలంగా ఢీ కొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీలో 1,731 అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం కేవలం ప్రాపర్టీ మీద యాజమాన్య హక్కులు మాత్రమే కల్పిస్తుంది తప్ప రెగ్యులరైజ్ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్రమకాలనీ వాసులు ఎంతమేర బీజేపీ వెంట నిలుస్తారన్నది బీజేపీ నేతలకు అంతుచిక్కడం లేదు. కేజ్రీవాల్ కు ధీటుగా సీఎం అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. నిజం చెప్పాలంటే అన్నీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొన్న బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.Web TitleDelhi Assembly Elections 2020 updates : Who will fight Arvind Kejriwal from BJP?
Next Story