విరుచుకుపడనున్న 'నిసర్గ' తుపాను : అప్రమత్తమైన అధికార యంత్రాంగం

విరుచుకుపడనున్న నిసర్గ తుపాను : అప్రమత్తమైన అధికార యంత్రాంగం
x
Highlights

ఇప్పటికే కరోనా మహమ్మారి విలయ తాండవంతో వణికిపోతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుఫాను రూపంలోమరో పెను ముప్పు పొంచివుంది.

ఇప్పటికే కరోనా మహమ్మారి విలయ తాండవంతో వణికిపోతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుఫాను రూపంలోమరో పెను ముప్పు పొంచివుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాను వేగంగా ముంబై తీరంవైపు దూసుకువస్తోంది.

ఈ రోజు మధ్యాహ్నం తీరందాటే అవకాశం

రానున్న 12 గంటల్లో నిసర్గ అతి తీవ్ర తీఫానుగా మారనుందని భారత వాతారణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య హరిహరేశ్వర్, డామన్ మధ్య బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు

తుఫాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అంతేగాక, 120 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరించింది. రాయగఢ్ జిల్లాలో ఉన్న హరహరేశ్వర్ ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉండగా, డామన్ ముంబైకి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..

కాగా, నిసర్గ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు. అలాగే డామన్, డయ్యూ, దాద్రానగర్ హవేలీ అధికారులతోనూ ప్రధాని మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా కూడా తుఫాను ప్రభావం పట్ల ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తీరంలో 144 సెక్షన్..

తీవ్ర తుఫాను నేపథ్యంలో ముంబై తీరంలో 144 సెక్షన్ విధించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. ఒకరి కంటే ఎక్కువ మంది బీచ్, పార్కుల వద్ద, పబ్లిక్ ప్రాంతాల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను, ఆస్పత్రుల నుంచి రోగులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.

ఇక మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు మోహరించాయి. మొత్తం 16 బృందాలు రంగంలోకి దిగినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. తుఫాను నేపథ్యంలో ముంబైతోపాటు తీర ప్రాంతం కలిగివున్న థానే, పాల్ఘర్, రాయగఢ్, రత్నగిరి, సింద్‌దుర్ఘ్ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక గుజరాత్ తీర ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కాగా, తుఫాను ప్రభావంతో ఇప్పటికే ముంబైతోపాటు ఇతర తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories