పెను తుఫాన్‌గా మారుతోన్న నివర్ సైక్లోన్

పెను తుఫాన్‌గా మారుతోన్న నివర్ సైక్లోన్
x
Highlights

నివర్ తుఫాన్ తమిళనాడును కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్ ఈరాత్రికి...

నివర్ తుఫాన్ తమిళనాడును కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్ ఈరాత్రికి కరైకల్-మామల్లాపురం దగ్గర తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే, తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కడలూరు, మహాబలిపురం, పెరలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తీర ప్రాంతంలో గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

నివర్ తుఫాన్ ప్రభావంతో ఇఫ్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా ఏపీ, కర్నాటక, పుదుచ్చేరిలోనూ అక్కడక్కడా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం కడలూరుకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నివర్ తుఫాన్ తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ హెచ్చరికలతో ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 34 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ మరో 13 రైళ్లను దారి మళ్లించింది.

నివర్ తుఫాన్ ఏపీని నేరుగా తాకకపోయినా దాని ప్రభావం ఉథృతంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు. రేపటి వరకు రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం ఉండొచ్చని అన్నారు. తుఫాన్ హెచ్చరికలతో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారు. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమకు తుఫాను ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుతోపాటు భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇక ఇప్పటికే నెల్లూరు జిల్లా, రాయలసీమలో చెదురుమదురు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు. అటు తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఏపీలోని ఓడరేవుల్లో రెండవ నెంబర్ ప్రమాద సూచిక ఎగురవేశారు. తీవ్ర తుఫాను తీరానికి సమీపంగా వచ్చే క్రమంలో సృష్టించే విధ్వంసం తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ఐఎండీ తమిళనాడుతోపాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు రెడ్ మెసేజ్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి రెండురోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికార యాంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎమర్జెన్సీ సెంటర్లతోపాటు అన్ని డివిజిన్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

నివర్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న తమిళనాడులో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాన్ దృష్ట్యా సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని తమిళనాడు సర్కార్ చెబుతోంది. తుఫాన్ సహాయ చర్యలపై తమిళనాడు సీఎంతో మాట్లాడిన ప్రధాని మోడీ అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

నివర్ తుఫానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు 22 సహాయక బృందాలను పంపినట్టు తెలిపింది. తుఫాను తర్వాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories