ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్‌

Congress Stages Protest in Delhi
x

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్‌

Highlights

Congress: కాంగ్రెస్‌ మళ్లీ చతికిల పడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేతులెత్తేసింది.

Congress: కాంగ్రెస్‌ మళ్లీ చతికిల పడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేతులెత్తేసింది. పంజాబ్‌ నుంచి మణిపూర్‌ వరకు అదే పరిస్థితి కనిపించింది. యూపీలో ప్రియాంక గాంధీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం కరుణించలేదు. చివరికి అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ బొక్కబోర్లా పడింది. ఓవైపు పీసీసీ చీఫ్‌ సిద్ధూ అలజడి.. మరోవైపు పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఓటమిని మూటగట్టుకుంది. ఎస్పీ పాచిక విసిరి అభాసుపాలైంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024కు సెమీ ఫైనల్‌గా భావించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి నియోజకర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రచారం చేసినా.. ఓటర్లు కాంగ్రెస్‌పై కరుణ చూపలేదు. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్‌ ప్రచారం కూడా అదే స్థాయిలోకి నిర్వహించింది. కానీ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైంది. ఫలితాల్లో కాంగ్రెస్‌ కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది.

అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌ చేదు అనుభవమే ఎదురయింది. 2017 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. అప్పటి సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. కెప్టెన్‌పై సిద్దూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. చివరికి కెప్టెన్‌ను సీఎం నుంచి తప్పించారు. ఆ తరువాత ఎస్సీలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీని ప్రకటించింది.. మరోసారి రాంగ్‌ డెసిసన్‌ తీసుకుని ఓటమిని కోరి తెచ్చుకుంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో 10 ప్లస్‌కే పరిమితమైంది.

ఉత్తరాఖండ్‌ ప్రజలు రెండోసారి ఏ పార్టీకి అధికారం కట్టబెట్టరు. ఈ సెంటిమెంట్‌ కలిసికొస్తుందని భావించిన కాంగ్రెస్‌ పార్టీ కమలం జోరును తట్టుకోలేకపోయింది. ప్రజలు సెంటిమెంట్‌కు స్వస్తీపలికి.. రెండోసారి బీజేపీకి ఓటేశారు. రాష్ట్రంలో ప్రచారం జోరుగా నిర్వహించినప్పుటికీ పార్టీలో అంతర్గత విభేధాలు, అధిష్ఠానం తీరుపై మాజీ సీఎం హరీశ్‌రావత్‌ అసంతృప్తి వంటి అంశాలు పార్టీనికి అధికారానికి దూరం చేశాయి. బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో రెండో స్థానానికే పరిమితమైంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లోనూ 10 ప్లస్‌కే పరిమితమైంది.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో పోటి పడిన హస్తం మెజార్టీ స్థానాలను సాధించలేకపోయింది. 2017 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక్కడ పొత్తుకు టీఎంసీ, ఆప్‌ సిద్ధమని ప్రకటించినా కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం ఓంటరి పోరాటానికే మొగ్గుచూపింది. ఫలితంగా ఇక్కడ కూడా మరోసారి ఓటమి పాలయ్యింది. ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈవీఎం ట్యాంపరింగ్​ ఆరోపణలు చేస్తూ ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories