సారథులు లేకుండా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం.. 135 ఏళ్ళ కాంగ్రెస్ ఇక సత్తా కోల్పోతున్నదా ?

సారథులు లేకుండా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం.. 135 ఏళ్ళ కాంగ్రెస్ ఇక సత్తా కోల్పోతున్నదా ?
x
Highlights

దేశంలోని పాత తరం పార్టీల్లో ముఖ్యమైంది కాంగ్రెస్. 135 ఏళ్లు పూర్తి చేసుకుంది. 136వ వ్యవస్థాపక దినం సందర్భంగా జెండా ఊంఛా రహే హమారా అంటూ గీతం కూడా...

దేశంలోని పాత తరం పార్టీల్లో ముఖ్యమైంది కాంగ్రెస్. 135 ఏళ్లు పూర్తి చేసుకుంది. 136వ వ్యవస్థాపక దినం సందర్భంగా జెండా ఊంఛా రహే హమారా అంటూ గీతం కూడా ఆలపించారు. యాభై కాదు...వంద కాదు....135 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ వ్యవస్థాపక దినం అంటే ధూం ధాంగా జరగాలి. ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో పార్టీ నినాదాలు మారుమోగాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అలాంటి సందడి కానరావడం లేదు. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ లేని పార్టీలో ఒక విధమైన నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి.

ఒక పార్టీ పురోగమనాన్ని సమీక్షించుకునేందుకు దాని ఆవిర్భావ దినోత్సవాన్ని మించిన సందర్భం మరొకటి ఉండదు. డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సందర్భాల్లో ముక్కచెక్కలైంది ఎన్ని చీలికలు వచ్చినా ఒక వర్గం మాత్రం నేటికీ కాంగ్రెస్ పార్టీగానే కొనసాగుతోంది. అందులోనూ తప్పుపట్టేందుకు ఏమీ లేదు. కాకపోతే దేశ రాజకీయాల్లో దాని ప్రభావం ఏంటి ప్రజలతో అది ఎలా మమేకమవుతోంది లాంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకోవాల్సిన సందర్భం ఇది. 135 ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన కాంగ్రెస్ ఎందరో మహానేతల సారథ్యంలో పని చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మాత్రం కాంగ్రెస్ లో ఆనాటి దిగ్గజ నాయకులు క్రమంగా కనుమరుగైపోయారు. కాంగ్రెస్ క్రమంగా గాంధీ- నెహ్రూ - వాధ్రా కుటుంబ సారథ్య పార్టీగా మారిపోయింది.

జాతీయవాదం పునాదులపై కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుకుంది. ఆ పునాదులే ఇప్పుడు కదిలిపోయాయి. ప్రస్తుతం దేశ రాజకీయాలను బీజేపీ ఆవిర్భావనికి ముందు ఆవిర్భావం తరువాత అని విభజించి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ ఆవిర్భావం దాకా కాంగ్రెస్ పటిష్ఠంగానే ఉండింది. ఆ తరువాత ఓట్లపరంగా సీట్ల పరంగా దాని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. విధానాల పరంగా భావజాలపరంగా కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్ నమ్ముకున్న జాతీయవాదాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. అలా పడిన మొదటి దెబ్బ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. 136వ వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా జాతీయవాదాన్ని మరోసారి తలపై మోసేందుకు కాంగ్రెస్ సిద్ధపడింది. నాయకులు కార్యకర్తలు త్రివర్ణపతాకంతో సెల్ఫీలు దిగారు. దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించారు. స్వాతంత్ర్యం రావడానికి ముందున్న జాతీయవాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చేందుకు నేతలు ప్రయత్నించారు. బీజేపీ పాలనను బ్రిటిష్ రాజ్ తో పోల్చారు. అన్నీ బాగున్నాయి కానీ బ్రిటిష్ వారిని ఎదరించిన ధీరుల వంటి నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ లో కరువయ్యారు. నాయకుల్లో నాడు ఉన్న ఐకమత్యమే నేడు కరువైపోయింది. యావత్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చే నాయకత్వమే లేకుండా పోయింది. ప్రజాపోరాటాలు చేయడం అటుంచి పార్టీలోని అసంతృప్తిని చల్లార్చడమే ప్రధాన పనిగా మారిపోయింది.

బీజేపీ హిందూత్వ వాదనను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ గతంలో ప్రయత్నించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా వాధ్రా స్వయంగా ఎన్నో గుళ్లు, గోపురాలు సందర్శించారు. అవేవీ కూడా హిందూత్వ భావనను కాంగ్రెస్ సొంతం చేసుకునేలా చేయలేకపోయాయి. మా హిందూత్వ వేరు మీ హిందూత్వ వేరు అని బీజేపీ చేసిన దాడితో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరైంది. అది మాత్రమే కాదు మరెన్నో విధానాల్లోనూ వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలు, సాగు చట్టాల ప్రతిపాదనలనే బీజేపీ మరింత ముందుకు తీసుకెళ్తోంది. దాంతో ఆయా అంశాలపై పోరాటం చేయడంలోనూ కాంగ్రెస్ వెనుకంజ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉనికి కోసం ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పై విమర్శల జడివానకు దారి తీసింది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు అలాంటిదే. శివసేన నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నా గట్టిగా జవాబు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ చిక్కుకుపోయింది.

పార్టీ సారథులు లేకుండానే కాంగ్రెస్ వ్యవస్థాపక దినం పతాకావిష్కరణ జరిగింది. మరి 2024లో జరిగే అరడజను రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సరైన సారథ్యం లేకుండానే బరిలోకి దిగనుందా అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇప్పుడు నాయకత్వమే ఓ పెద్ద సమస్యగా మారింది. పార్టీలో పలువురు కోరుకున్నట్లుగా రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్షబాధ్యతలు స్వీకరిస్తారా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారా లాంటివి ప్రస్తుతానికి శేషప్రశ్నలుగానే ఉన్నాయి.

ఏటా పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైంది పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం మాత్రం సారథులు ఎవరూ లేకుండానే జరిగింది. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. సోనియా గాంధీ హాజరు కాలేకపోయారు. దీంతో ఏకే ఆంటోనీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీతో పాటుగా గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, రాజీవ్ శుక్లా, మల్లికార్జన్ ఖర్గే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తుకొచ్చేది రాహుల్ గాంధీ మాత్రమే. 2013 జనవరి 19న ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అధికారికంగా చేపట్టారు. ఆ తరువాత ఒక రెండేళ్ల పాటు పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆ తరువాత అస్త్ర సన్యాసం చేశారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకూ సిద్ధపడ్డారు. నిజానికి రాహుల్ గాంధీ మొదట్లో ఎంతో ఉత్సాహంగానే పార్టీ పగ్గాలు చేపట్టారు. కొన్ని ఆశయాలు, ఆకాంక్షలతో పార్టీని నడిపించేందుకు ప్రయత్నించారు. ఒక దశలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే తప్పుబట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్ నే నాన్సెన్స్ అంటూ తోసిపుచ్చారు. అలాంటి రాహుల్ గాంధీ ఆ తరువాత మారిపోయారు. మెజారిటీ ప్రజలు కోరుకున్న నిర్ణయాలను, చర్యలను వ్యతిరేకించి వివాదాల పాలయ్యారు.

కాలక్రమంలో రాహుల్ చుట్టూరా మరో కోటరీ తయారైంది. అదే సమయంలో సీనియర్లలో కొందరి ధోరణి రాహుల్ కు నచ్చకుండా పోయింది. ఇదే సందర్భంలో సర్జికల్ దాడులు, చైనాతో ఘర్షణలు లాంటి అంశాల్లో రాహుల్ అనుసరించిన ధోరణిని కొందరు నాయకులు మెచ్చలేకపోయారు. మరో వైపున పార్టీ నాయకుల మధ్య కీచులాటలను రాహుల్ గాంధీ పరిష్కరించలేకపోయారు. ఇవన్నీ చివరకు ఆయన అస్త్రసన్యాసం చేసేందుకు దారి తీశాయి. చివరకు సోనియా తాత్కాలికంగా అధ్యక్షపదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇటీవలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్దగా రాణించలేకపోయింది. జాతీయ పార్టీ స్థాయి నుంచి ఓ పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. కూటమిలో మిత్రపక్షాలు సైతం కాంగ్రెస్ ను పెద్దన్నగా గుర్తించడం ఎన్నడో మానేశాయి. వివిధ అంశాలపై కాంగ్రెస్ అనుసరించిన ధోరణి కూడా దాన్ని ప్రజలకు మరింత దూరం చేసిందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి.

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుతం రాహుల్ గాంధీ సుముఖంగానే ఉన్నట్లుగా ఉంది. కాకపోతే ఆ విషయంలో యావత్ పార్టీ నుంచి ఏకాభిప్రాయం రావాలని వేచి చూస్తున్నట్లుగా ఉంది. ఇందిరాగాంధీ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వారంతా కూడా కాస్తంత అయిష్టంగానే ఆ బాధ్యతలు చేపట్టారు. దాంతో సంస్థాగతంగా పార్టీ బలహీనమైపోయింది. నేటికీ పార్టీలో అదే ధోరణి కొనసాగుతోంది. పార్టీని కొనసాగించడం అది అధికారంలోకి వచ్చేలా దూసుకెళ్ళడం రెండూ వేర్వేరు అంశాలుగా మారిపోయాయి. పార్టీని కొనసాగించడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారిపోయింది. దాంతో పార్టీలో ఉద్యమస్ఫూర్తి లోపించింది. మరి దాన్ని పార్టీ ఎలా సరిదిద్దుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories