Coronavirus: కరోనా జాగ్రత్తలపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

Central Home Ministry Letter to States on Corona Precautions
x

కేంద్ర హోమ్ శాఖా (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపట్టండి * నిర్లక్ష్యానికి చోటివ్వొద్దు: కేంద్ర హోంశాఖ లేఖ

Coronavirus: భారత్‌లోని అనేక ప్రాంతాల్లో కరోనా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని.. ఆయా చోట్ల సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఎక్కడ కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించాలని ఆదేశించింది. కొవిడ్‌ విస్తరణకు కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఇప్పటివరకూ ముగియలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేంద్రం హెచ్చరించింది. ప్రతిచోటా కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు కొనసాగించాలని ఆదేశించింది. పరీక్షలు ఇప్పటిలాగానే కొనసాగించాలని 5 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది. మార్కెట్‌ ప్రాంతాల్లో భారీగా గుమిగూడుతున్న ప్రజలు భౌతికదూరం నిబంధనలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాల్లో ఎక్కడా రద్దీ ఏర్పడకుండా నియంత్రణ చర్యలు తీసుకొనేలా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు.

భారత్‌కు కొవిడ్‌-19 మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని విదేశీ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా హెచ్చరించింది. దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదించడమే ఇందుకు కారణమని పేర్కొంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల కూడా మూడోదశ ముప్పునకు సంకేతమని తెలిపింది. డెల్టా వేరియంట్‌ వైరస్‌లో కొత్తగా వస్తున్న ఉత్పరివర్తనాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, అయితే ఆర్థిక సూచీలు సాధారణ స్థాయిలకు చేరుకున్నా.. పరిస్థితిని పూర్తిగా అంచనా వేయలేని స్థితి నెలకొందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories