కరోనా వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతోన్న బిహార్ రాజకీయం

కరోనా వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతోన్న బిహార్ రాజకీయం
x
Highlights

ఎన్డీఏను గెలిపిస్తే 19లక్షల ఉద్యోగాలతో పాటు ఉచిత కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బిహార్ మేనిఫెస్టోలో బీజేపీ తెలిపింది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయ్....

ఎన్డీఏను గెలిపిస్తే 19లక్షల ఉద్యోగాలతో పాటు ఉచిత కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బిహార్ మేనిఫెస్టోలో బీజేపీ తెలిపింది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయ్. ఓటు వేయకుంటే టీకా ఇవ్వరా అని కొందరు.. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ఇంకొందరు బీజేపీ మేనిఫెస్టోపై భగ్గుమంటున్నారు.

బిహార్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. ఒకెత్తు మీదైతే.. పది మావి అన్నట్లుగా సాగుతున్నాయ్ పార్టీల తీరు ! ఓటర్లను ఆకర్షించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయ్. తాము అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ ఇలా ప్రకటించిందో లేదో దానికి దీటుగా బీజేపీ వరాలు గుప్పించింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఎన్డీఏ హయాంలో గత 15ఏళ్లలో బిహార్‌లో జీడీపీ 3 నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మోసపూరితమైన హామీలను నమ్మకుండా ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఐదేళ్లపాటు నితీశ్‌కుమార్‌ సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 3లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీతో పాటు బిహార్‌ను ఐటీ హబ్‌గా తయారుచేసి 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది బీజేపీ. 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని ఆరోగ్య రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేర్చింది. 30లక్షల కుటుంబాలకు పక్కా గృహాల మంజూరుతో పాటు 9తరగతి నుంచి పై తరగతుల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్‌ అందిస్తామని ప్రకటించింది.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయ్. ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హామీపై విమర్శలు గుప్పిస్తున్నాయ్. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్‌ను వాడుకుంటారా అని రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? బీజేపీకి ఓటు వేయని భారతీయులకు టీకా లభించదా అని ఆప్ ట్వీట్ చేసింది. ఎన్నికలు వస్తే తప్ప టీకా రాదా.. అయితే అదెప్పుడో చెప్పండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ హామీని ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా తప్పుపట్టారు. అటు కాంగ్రెస్ నేత శశి థరూర్‌ సైతం ఉచిత వ్యాక్సిన్‌ హామీని ఎద్దేవా చేశారు. ఓట్లు వేస్తే వ్యాక్సిన్ ఇస్తామనడం సిగ్గుచేటు అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories