Top
logo

కశ్మీర్ లో ఉగ్రవాదం పై ఇక ఉక్కుపాదం

కశ్మీర్ లో ఉగ్రవాదం పై ఇక ఉక్కుపాదం
X
Highlights

కశ్మీర్ విషయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు...

కశ్మీర్ విషయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అంతేగాకుండా రిజర్వేషన్ సవరణ బిల్లును కూడా లోక్ సభ ఆమోదించింది. కశ్మీరీ పండిట్లకు అందించే నగదు సాయాన్ని కేంద్రం అధికం చేసింది. ఇవన్నీ కూడా కశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వం కనబరుస్తున్న ఆసక్తికి నిదర్శనాలుగా నిలిచాయి. ఇవన్నీ రొటీన్ గా జరిగినవేవీ కాదు అన్ని ఒక వ్యూహం ప్రకారం జరిగినవే. మరి ఆ వ్యూహం ఫలిస్తుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

కశ్మీర్ లో మూడో వంతు నేడు భారతదేశంలో లేదు. పాకిస్థాన్ ఆక్రమణకు గురైంది. అందులోనూ కొంత భాగాన్ని పాకిస్థాన్, చైనాకు ధారాదత్తం చేసింది. ఇక కొన్నేళ్ళ పాటు కశ్మీర్ లో జాతీయ పతాకం ఎగురవేసే పరిస్థితి లేకుండింది. కశ్మీర్ కు ఒకరు మిగిలిన దేశానికి ఒకరుగా ఏక కాలంలో ఇద్దరు ప్రధానులు రాజ్యం చేసిన రోజులున్నాయి. కశ్మీర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డుల్లో ఇండియా పదాన్ని కప్పి ఉంచిన రోజులున్నాయి. ఉగ్రవాదం విరుచుకుపడిన రోజులున్నాయి. దేశ ప్రధాని లేదా హోం మంత్రి కశ్మీర్ పర్యటనకు వెళ్తే షట్ డౌన్ తో నిరసన తెలిపిన రోజులున్నాయి. ఇలాంటి సంఘటనలన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత మాత్రం కశ్మీర్ సమస్య పరిష్కారం దిశలో క్రమంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త రోడ్ మ్యాప్ రూపుదిద్దుకుంటోంది.

కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమిత్ షా ఇటీవలే రెండు రోజుల పాటు కశ్మీర్ లో పర్యటించారు. పర్యటన ముగించుకున్న మరుసటి రోజే కశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు పొడిగించే బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లను లోక్ సభ ఆమోదించింది. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగం ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు కశ్మీర్ విషయంలో కొత్త వెలుగులు ప్రసరింపజేశాయి. కశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హతమారుస్తోందని కాంగ్రెస్ చేసిన విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. దేశంలో ఇప్పటి వరకూ 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు ఉండగా ఒక్క కాంగ్రెస్ హయాంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో 93 సార్లు రాష్ట్రపతి పాలన విధించిన అంశాన్ని అమిత్ షా గుర్తు చేశారు. కశ్మీర్ గత ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలోనే ఉన్నది. కశ్మీర్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగానే అక్కడ రాష్ట్రపతి పాలన పొడిగించాల్సి వచ్చిందన్నారు. కశ్మీర్ లో ఏ పార్టీకి కూడా మెజారిటీ లేదన్నారు. మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వాలను కూడా తొలగించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని విమర్శించారు. కశ్మీర్ లో నేటి దుస్థితికి నెహ్రూనే కారణమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద లోక్ సభలో అమిత్ షా చేసిన ప్రసంగం కశ్మీరీ అంశాన్ని మరోసారి ప్రముఖంగా వెలుగులోకి తీసుకువచ్చింది. కశ్మీర్ కు ప్రత్యేక హోదాను ప్రసాదించే ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, అది శాశ్వతమైంది కాదని కూడా హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేయడం విశేషం. కాంగ్రెస్ తో సహా ఎన్నో విపక్షాలు ఆర్టికల్ 370కి అండగా నిలుస్తుండగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో కూడా కేంద్రం త్వరలోనే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన చర్య రిజర్వేషన్ సవరణ బిల్లును తీసుకురావడం. దీన్ని లోక్ సభ ఆమోదించింది. దీని ప్రకారం జమ్మూ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుకు 10 కి.మీ. లోపుగా నివసించే వారికి కూడా కశ్మీర్ వాస్తవాధీన రేఖ ప్రాంతంలో ఉండేవారి మాదిరిగానే విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కుతాయి. సరిహద్దుల్లో ఉండే విద్యార్థులు ఎన్నో రోజుల పాటు బంకర్లలోనే ఉండిపోవాల్సి వస్తోందని అందుకే వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా అమిత్ షా చెప్పారు. గతంలో కశ్మీర్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రక్తపాతం చోటుచేసుకునేదని ఇటీవలి లోక్ సభ ఎన్నికలు మాత్రం అక్కడ ప్రశాంతంగా జరిగాయన్నారు. రంజాన్, అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయనీ అన్నారు. అమర్ నాథ్ యాత్ర సందర్భంగా యాత్రికుల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి పాలనలోనే వీలవుతుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా రాష్ట్రపతిపాలనలోనే సాధ్యమవుతుంది. అక్కడ ప్రజా ప్రభుత్వం ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలకు సహకరించని దాఖలాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నట్లు అమిత్ షా ఈ సందర్భంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఉగ్రవాదులపై సైనిక బలగాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారంలో కశ్మీరీ పండిట్లు కూడా కీలకపాత్ర వహిస్తారు. వారిని భాగస్వాములుగా చేయకుండా కశ్మీరీ సమస్యను పరిష్కరించలేం. ఉగ్రవాదం బారిన పడిన కశ్మీర్ పండిట్ల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. వారికి అందించే ఆర్థిక సాయాన్ని పెంచిది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల కశ్మీరీ పర్యటన వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచే వివిధ పార్టీల్లోని సానుభూతిపరులకు స్పష్టమైన హెచ్చరిక సంకేతాలు పంపింది. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలోనూ సహించవద్దని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమిత్ షా భద్రతాదళాలను ఆదేశించారు. ప్రధాని లేదా హోం శాఖ మంత్రి కశ్మీర్ లో పర్యటించినప్పుడు రకరకాల నిరసనలు వ్యక్తమవుతుంటాయి. గత పాతికేళ్లుగా అలానే జరుగుతోంది. ఈసారి అమిత్ షా పర్యటన సందర్భంగా మాత్రం అలాంటివేవీ చోటు చేసుకోలేదు. మరో వైపున ఆయన పర్యటన సమయంలోనే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లకు చెందిన ఇద్దరు నాయకుల సంస్థలపై ఆదాయపన్ను అధికారుల దాడులు కూడా జరిగాయి. అయినా కూడా నిరసనలు వ్యక్తం కాకపోవడం విశేషం. ట్విట్టర్ లో ట్వీట్ల దాడులు కూడా జరుగలేదు. మరో వైపున అమిత్ షా తన పర్యటనలో స్థానిక పార్టీల నాయకులెవరినీ కలుసుకోలేదు. దాన్ని బట్టి చూస్తే కశ్మీర్ లో ప్రస్తుతం శాంతి భద్రతలను కాపాడేందుకు రాజకీయ ప్రక్రియ కన్నా సైనికపరమైన చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

అమిత్ షా కశ్మీరీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో మరో వ్యూహం కూడా ఉంది. ఇటీవలి కాలంలో కశ్మీర్ లో విదేశీ ఉగ్రవాదుల ప్రాబల్యం కూడా పెరుగుతోంది. పాకిస్థాన్ అనుకూల, స్వతంత్రదేశ అనుకూల ఉగ్రవాదులే గాకుండా తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కూడా రంగప్రవేశం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని మొదట్లోనే అరికట్టకపోతే రేపటి నాడు అగ్రదేశాల మధ్య ఉగ్రవాద పోరులో భారత్ బలి అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో జరిగింది ఇప్పుడు సిరియాలో జరుగుతున్నది అదే. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కశ్మీర్ లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో ఎదురుదెబ్బలు తిన్న ఇస్లామిక్ స్టేట్ తనకు ఆశ్రయం లభించగల దేశాల కోసం గాలిస్తోంది. భారత్ తో పాటుగా తూర్పు ఆసియా దేశాల పై అది కన్నేసింది. అందులో భాగంగానే కశ్మీర్ లో పట్టు పెంచుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి కశ్మీర్ వినాశనానికి దారి తీస్తుందని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఉగ్రవాద ముఠాల మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణలు జరగడం అధికమైపోయింది. అందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

భౌగోళికంగా కశ్మీర్ అత్యంత ప్రాధాన్య ప్రాంతంలో ఉండడంతో పాకిస్థాన్, చైనా కశ్మీర్ పై కన్నేశాయి. ఇప్పటికే కశ్మీర్ లో మూడో వంతు భూభాగాన్ని కోల్పోయిన భారత్, మిగిలిన భూభాగం విషయంలో పట్టుదలతో ఉంది. అదే సమయంలో అక్కడి ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ముస్లింలు మాత్రమే గాకుండా హిందువులు, బౌద్ధులు కూడా గణనీయసంఖ్యలో ఉన్నారు. మరో వైపున వేలాది కశ్మీరీ పండిట్లు దేశవ్యాప్తంగా శరణార్థులుగా జీవితం గడుపుతున్నారు. కశ్మీర్ సమస్యను సైనికశక్తితో మాత్రమే పరిష్కరించడం సాధ్యం కాదు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మరో వైపున సరిహద్దులకు వెలుపలి నుంచి ఉగ్రవాదానికి అందే మద్దతును అడ్డుకోడానికి అవసరమైతే మరిన్ని సర్జికల్ దాడులు నిర్వహించాలి. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు పొరుగుదేశం భయపడే పరిస్థితి కల్పించాలి. అదే సమయంలో వీలైనంత త్వరలో కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలి. రాజకీయ ప్రక్రియను ముమ్మరం చేయాలి. ప్రజాస్వామిక ప్రభుత్వంలో అక్కడి యువత అధికంగా భాగస్వామ్యం పొందేలా చర్యలు తీసుకోవాలి.

Next Story