ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన శునకం.. ఆక్సెల్.. కశ్మీర్‌లో ప్రాణాలకు తెగించి ఆపరేషన్‌లో పాల్గొన్న జూమ్..

Army dog Zoom Attacked Terrorists & Received 2 Gunshot Injuries
x

ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన శునకం.. ఆక్సెల్.. కశ్మీర్‌లో ప్రాణాలకు తెగించి ఆపరేషన్‌లో పాల్గొన్న జూమ్..

Highlights

Army Dog: పోలీసే కాదు.. అతడు వేసుకున్న యూనిఫామ్, ఆఖరికి అతడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుందంటాడు ఓ సినిమాలో హీరో.

Army Dog: పోలీసే కాదు.. అతడు వేసుకున్న యూనిఫామ్, ఆఖరికి అతడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుందంటాడు ఓ సినిమాలో హీరో. ఈ డైలాగ్‌ ఎప్పుడు విన్నా.. గూస్ బంప్స్ గ్యారెంటీ. నిజమే దేశభక్తి, యుద్ధం.. ఇలాంటి వాటిని విన్నప్పుడల్లా అలాంటి ఫీలింగ్ సాధారణమే. సైనికులే కాదు.. వారికి సహకరించే జంతువుల విరోచిత పోరాటాలు కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తాయి. అలా సైన్యానికి సహకరించే కుక్కల సాహసాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న ఓ శునకం కూడా అలాంటి ఘనతను సొంతం చేసుకుంది. ఓ వైపు బుల్లెట్‌ వర్షం కురుస్తున్నా మరోవైపు సైనికులకు సాయం చేస్తూనే శత్రువులను ఎదుర్కొంది. నేషనల్‌ లెవెల్లో సెలబ్రిటీ అయిపోయింది.

దేశ సేవలో సైన్యానికి సహకరించే శునకాల పాత్ర వెలకట్టలేనిది. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు సైనికులకు సహాయకారిగా ఎన్నో రకాల ఆపరేషన్‌లో పాల్గొంటాయి. శత్రువుల జాడ తెలుసుకోవడం వారిని వెంబడించి పట్టుకోవడం మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లోకి వెళ్లి మరీ ఆపరేషన్‌లను సులభతరం చేయడం ఇలా రకరకాలుగా శునకాలు సైన్యానికి సహాయకారిగా ఉంటున్నాయి. అలా తమ సేవలు ఈ దేశానికి అందిస్తున్నాయి. కానీ కొన్ని కుక్కలు మాత్రం చరిత్రకెక్కుతాయి. ప్రాణాలు పోతున్నా కర్తవ్యాన్ని మాత్రం వదలకుండా ఎదురొడ్డుతాయి. ఆర్మీలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటివే శునకాల విశ్వాసాలకు పరాకాష్టగా నిలుస్తాయి.

కశ్మీర్‌లో ఎప్పుడూ ఎన్‌కౌంటర్లు, ఎదురుకాల్పులు జరుగుతాయో చెప్పలేం. ఏ వైపు నుంచి ఉగ్రవాదులు తెగబడుతారో గుర్తించలేం. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కొన్ని సార్లు ముష్కరుల జాడ తెలుసుకోలేం. మరికొన్ని సార్లు టెర్రరిస్టులు తిష్టవేసిన ప్రాంతాలను గుర్తించినా వారి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కుక్కలే సైన్యానికి ఉపయోగపడతాయి. టెర్రరిస్టుల సెర్చ్ ఆపరేషన్‌లో శునకాల పాత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు. కొన్నిసార్లు శునకాలకు కెమెరాలు అమర్చి అనుమానిత ప్రదేశాలకు పంపుతారు. జీపీఎస్ ద్వారా ఉగ్రవాదుల లొకేషన్‌ను ట్రాక్ చేస్తారు. వారి దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయో తెలుసుకుంటారు. దాని ద్వారా ఏ లెవెల్లో అప్రమత్తత అవసరమో ముందే ప్రణాళిక రచిస్తారు.

అలాంటి శునకాలు ఆర్మీ ఆపరేషన్‌లో చాలానే పాల్గొన్నాయి. తాజాగా దక్షిణ కాశ్మీర్‌లోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపైకి దాడి చేయాలని అనుకున్నారు సైనికాధికారులు. అయితే ముందుగా ఆ ఇంటిలోపలికి జూమ్‌ అనే కుక్కను పంపించారు. అది లోపలికెళ్లగానే టెర్రరిస్టులు దానిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినా లెక్కచేయని జూమ్‌ వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఇద్దరు లష్కరే తొయిబా టెర్రరిస్టులను మట్టికరిచారు. ఈ క్రమంలో పలువురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలైన జూమ్‌ను హుటాహుటిన సైనిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ శునకం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. జూమ్‌ కొన్నేళ్లుగా ఇండియ‌న్ ఆర్మీలో సేవ‌లు అందిస్తోంది. సైనికులకు స‌హాయంగా ఉంటోంది. ఎన్నో ఉగ్రవాద క్రియాశీల కార్యకలాపాల ఏరివేత‌లో భాగం అయ్యింది. శ‌త్రువులను పసిగట్టి, వారి ఉనికిని తెలియజేసే విధంగా శిక్షణ పొందింది. చాలాకాలంగా అది భ‌ద్రత బ‌ల‌గాల‌కు విశ్వాస పాత్రుడిగా ఉంటూ వస్తుంది. జూమ్‌.. అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని సైనికాధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రెండు నెలల క్రితం మరణించిన ఆక్సెల్‌ శునకం పోరాటాన్ని గుర్తు చేసుకుంటోంది సైన్యం.


ఆక్సెల్ ఈ కుక్క గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే. శత్రువులను ఏరివేయటంలో ప్రత్కేక తర్ఫీదు పొందిన ఇది గత జూలైలో జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ప్రాణత్యాగం చేసింది. అది ప్రదర్శించిన సాహసాలను, ప్రాణత్యాగాన్ని ఈ దేశం గుర్తించింది. మరణించిన కుక్కను మెన్షన్‌ ఇన్‌ డిస్పాచెస్‌ అవార్డుతో సత్కరించింది. రెండేళ్ల వయస్సున్న ఆక్సెల్.. కశ్మీర్‌లో ఉగ్రవాదిని పట్టుకునే ఆపరేషన్‌లో కీ రోల్ పోషించింది. దాదాపు 8 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగిన బిల్డింగ్‌ దగ్గర హోల్డ్‌ అప్ టెర్రరిస్టు స్థానాన్ని గుర్తించడంలో ఆక్సెల్‌ ఆర్మీ దళాలకు సహకరించింది. వాసన చూస్తూ ఉగ్రవాది దగ్గరకు వెళ్లింది. అయితే ఆ వెంటనే టెర్రరిస్టు దానిపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు బుల్లెట్లు దాని శరీరంలోకి వెళ్లడంతో కొన్ని సెకన్ల పాటు కదలికలు చేయగలిగినప్పటికీ చివరకు అది కుప్పకూలిపోయింది. ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం ఆక్సెల్‌ డెడ్‌బాడీని కనుగొంది.

కాల్పుల్లో జైషే మొహమ్మద్‌ కు చెందిన టెర్రరిస్టు హతమవగా ఆక్సెల్‌ను ఆర్మీ కోల్పోయిందని సీనియర్‌ అధికారులు వెల్లడించారు. ఆక్సెల్‌ అంత్యక్రియలు కూడా అధికారికంగా నిర్వహించారు. సీనియర్ అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆక్సెల్‌ విరోచిత పోరాటానికి గానూ మెన్షన్‌ ఇన్ డిస్పాచ్‌గా గుర్తించారు. ఇలా అవార్డు అందుకున్న ఏకైక ఆర్మీ డాగ్‌గా ఆక్సెల్‌ కావడం గమనార్హం. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ జాబితాను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సైనిక సిబ్బందికి 40 మెన్షన్-ఇన్-డిస్పాచ్‌లను ఆమోదించారని.. జాబితాలో ఆక్సెల్ ఉందని తెలిపింది. విరోచిత పోరాటం, ప్రతిభావంతమైన సేవను గుర్తించేందుకే.. ఇవ్వబడిందని.. వివరించింది. ఆక్సెల్‌ గతంలో ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ స్నో లెపార్డ్, ఆపరేషన్ రినో, ఆపరేషన్ ఆర్చిడ్, ఆపరేషన్ ఫాల్కన్, ఆపరేషన్ హిఫాజాత్, ఆపరేషన్‌ త్రికూట్ తో సహా వివిధ సైనిక కార్యకలాపాలలో గణనీయమైన సహకారాన్ని అందించినందుకు రాష్ట్రపతి మెన్షన్-ఇన్-డిస్పాచ్‌లను ఆమోదించారని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. జూమ్ కావచ్చు ఆక్సెల్‌ కావచ్చు శునకాల విశ్వాసం, వాటి ప్రాణత్యాగం చరిత్రలో నిలిచిపోయేవే. అలాంటి కుక్కలను స్మరించుకుని సెల్యూట్ చేయడమే మన విధి.


Show Full Article
Print Article
Next Story
More Stories