తమిళనాడులో ఏపీ ఫార్ములా.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం అదిరింది

తమిళనాడులో ఏపీ ఫార్ములా.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం అదిరింది
x
Highlights

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి.

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇప్పుడు హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన విజయ్.. 2026 ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో పీకే, విజయ్‌తో భేటీ కావడం, కొన్ని కీలక సూచనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా విజయ్‌కి ప్రశాంత్ కిషోర్ కీలక సూచలను చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటేనే డీఎంకేను నిలువరించడం సాధ్యమని విజయ్‌కు పీకే సూచించినట్టు సమాచారం. అన్నాడీఎంకేకు కనీసం 25 శాతం ఓట్లు ఉండగా.. టీవీకేకు 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని.. అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీలను కలుపుకుంటే మొత్తం 50 శాతం ఓట్లు సాధించవచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని విజయ్‌తో చర్చించారని సమాచారం. అంతేకాదు. ఏపీ రాజకీయాలను ఉదాహరణగా చూపించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని విజయం సాధించిన విషయాన్ని పీకే.. విజయ్‌కు గుర్తుచేసినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థులను ఓడించడానికి పొత్తులు ఎంత ముఖ్యమో వివరించినట్టు సమాచారం.

పళని సామిని ముఖ్యమంత్రిగా, విజయ్‌ను ఉప ముఖ్యమంత్రిగా అంగీకరించే సూత్రాన్ని కూడా పీకే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిసామితో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో విజయ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, డీఎంకే తమ శత్రువులు అని.. వాటిని ఓడించేందుకు తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రశాంత్ కిషోర్ సూచనలతో టీవీకే శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ ఎన్నికల వ్యూహ రచన బాధ్యతలను ప్రశాంత్ కిషోర్, ఆదవ్ అర్జున్‌కు అప్పగించినట్టు టీవీకే నేతలు తెలిపారు. 2026లో కూటమితో ముందుకు వెళ్లినా, ఆ తర్వాత ఎన్నికల్లో పూర్తి బలమైన పార్టీగా మారాలన్నది విజయ్ లక్ష్యమని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి శత్రువును ఓడించేందుకు కొన్ని రాజీలు చేసుకోవడానికి కూడా విజయ్ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

మరోవైపు పొత్తులు మంచికే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి విజయ్ తన వ్యూహాన్ని ఖరారు చేసి.. ప్రత్యర్థిని ఓడించేందుకు అవసరమైన రాజీలు కుదుర్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ సలహాలు, విజయ్ తీసుకునే నిర్ణయాలు తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories