రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం... ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పుపెట్టిన స్థానికులు

Ankita Bhandari Murder Case Locals set Vanatara Resort in Rishikesh
x

రిసెప్షనిస్ట్‌ హత్యోదంతం... ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పుపెట్టిన స్థానికులు

Highlights

Ankita Bhandari: ఉత్తరాఖండ్‌లో అంకితా బంఢారి అదృశ్యం రోజుకో మలుపు తిరుగుతోంది.

Ankita Bhandari: ఉత్తరాఖండ్‌లో అంకితా బంఢారి అదృశ్యం రోజుకో మలుపు తిరుగుతోంది. పౌరీ గర్వాల్‌ జిల్లాలో అయిదురోజుల క్రితం అదృశ్యమైన అంకిత హత్యకు గురయ్యిందని పోలీసులు తేల్చారు. హంతకులు అంకితను కొండపైనుంచి నదిలోకి తోసేసినట్లు పోలీసులు గుర్తించారు. SDRF బృందాల సాయంతో నదిలో గాలించిన పోలీసులు అంకిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్‌ యజమానితో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంకిత భండారి హత్య కేసును ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ థామి సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమంగా నడుస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో హత్యకేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ ఆర్యాకు చెందిన రిసార్ట్‌పై అధికారులు దాడులు చేశారు. బుల్డోజర్స్‌తో రిసార్ట్‌ బిల్డింగ్‌ను కూల్చివేశారు. రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న రిసార్టులన్నింటిపై విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు.

అంకితా భండారీ హత్యపై బంధువులు, స్థానికులు భగ్గుమన్నారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రిసార్ట్‌కు నిప్పు పెట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో రిసార్ట్‌లోని ఫర్నీచర్‌ ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. రిషికేష్‌ లక్ష్మణ్ ఝులా ప్రాంతంలోని పుల్కిత్ రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత ఈనెల 18వ తేదీ నుంచి కనిపించడం లేదు. అదేరోజు పులకిత్‌ ఆర్యా, రిసార్ట్‌ మేనేజర్‌ సౌరభ్‌, మరో వ్యక్తి అంకిత్‌ గుప్తాతో కలిసి చిలా రోడ్డులోని కెనాల్‌ దగ్గరకు వెళ్లి మద్యం తాగారు. ఆ సమయంలో తనతో గొడవ పడ్డ యువకులను అంకిత బెదిరించింది.. రిసార్ట్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను బయటపెడతానని హెచ్చరించింది. దీంతో భయపడ్డ నిందితులు అంకితను కెనాల్‌ తోసి చంపినట్లు సమాచారం. అంకిత హత్య కేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ ఆర్య ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి వినోద్‌ ఆర్య కుమారుడు కావడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories