ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురు దెబ్బ.. మిగిలింది కేవలం ఒక కార్పొరేటరే..

ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురు దెబ్బ.. మిగిలింది కేవలం ఒక కార్పొరేటరే..
x
Highlights

Shiv Sena: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Shiv Sena: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌-బీఎంసీ తరువాత అత్యంత కీలకమైన ఠాణే కార్పొరేషన్‌ కార్పొరేట్లు షిండే గూటికి చేరారు. 66 మంది శివసేన రెబల్‌ కార్పొరేటర్లు సీఎం ఏక్‌నాథ్‌ షిండేను గత రాత్రి కలిసి పూర్తిగా మద్దతు ప్రకటించారు. ఠాణే కార్పొరేషన్‌లో మొత్తం 67 మంది శివసేన కార్పొటర్లలో కేవలం ఒక్కరు మాత్రమే ఉద్దవ్‌ థాక్రే వైపు ఉన్నారు. దీంతో ఠాణేలోనూ ఉద్దవ్‌ థాక్రే పట్టు కోల్పోయారు. ఇక ఆశలన్నీ బృహ‍న్‌ ముంబై కార్పొరేషన్‌పైనే ఉద్దవ్‌ పెట్టుకున్నారు. బీఎంసీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఉద్దవ్‌ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి.

అయితే 2017లోనే శివసేన తరఫున ఠాణే మున్సిపల్‌ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది. అయితే థానే మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్దవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండేకు కూడా బీఎంసీ ఎన్నికలు ఎంతో కీలకం. అసలైన బాలాసాహెబ్‌ శివసేన తమదేనని సీఎం షిండే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎంసీలో గెలిచి పార్టీ తమదేనని నిరూపించుకోవాల్సిన అవసరం సీఎం షిండేకు ఉంది.

శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు షిండేకు తోడుగా నిలవడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం తేలికయ్యింది. అయితే ఇప్పుడు శివసేన తమదంటే తమదని పార్టీ గుర్తు తమదేనంటూ ఇరువర్గాలు ప్రకటిస్తున్నాయి. మరో మూడు నెలల్లో మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్దవ్‌కు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మహారాష్ట్రలోని మొత్తం మున్సిపాలిటీల్లో ఉద్దవ్‌ వర్గం గెలవకపోయినా ఎలాంటి నష్టం లేదు కానీ బీఎంసీలో మాత్రం ఉద్దవ్‌ కాపాడుకోవాల్సిందే. లేదంటే శివసేనకు థాక్రే కుటుంబం దూరంగా ఉండాల్సి వస్తుంది.

మరోవైపు మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 45 మందితో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. షిండే వర్గంలోని 13 మందికి, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలకు 25 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తప్ప బీజేపీలో ఈసారి కొత్త ముఖాలకు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలనే దానిపై ఇప్పటికే బీజేపీ-షిండే మధ్య అవగాహన కుదిరినట్టు తెలిసింది. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం జులై 11 తరువాత చేపట్టే అవకాశం ఉంది. షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాక్రే వర్గం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జులై 11న సుప్రీంకోర్టు చేపట్టనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories