"సుప్రీంకోర్టులో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం.. లాయర్ లేకుండానే వాదించి 'నీట్' సీటు కొట్టాడు!"

Atharva Chaturvedi: అత్యున్నత న్యాయస్థానంలో ఒక అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 14 Feb 2026 2:07 PM IST
సుప్రీంకోర్టులో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం.. లాయర్ లేకుండానే వాదించి నీట్ సీటు కొట్టాడు!
X

Atharva Chaturvedi: అత్యున్నత న్యాయస్థానంలో ఒక అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఎటువంటి లాయర్ సహాయం లేకుండా, స్వయంగా పిటిషన్ దాఖలు చేసి, కేవలం 10 నిమిషాల వాదనలతో న్యాయమూర్తులను మెప్పించి తనకు జరిగిన అన్యాయంపై విజయం సాధించాడు 19 ఏళ్ల అథర్వ చతుర్వేది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన అథర్వ చతుర్వేది రెండుసార్లు 'నీట్' (NEET) పరీక్షలో ఉత్తీర్ణుడై 530 మార్కులు సాధించాడు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల (EWS) కోటా కింద ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని ఆశించిన అథర్వకు నిరాశ ఎదురైంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల్లో EWS కోటాను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే తనలాంటి ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని గుర్తించిన అథర్వ, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

న్యాయస్థానంలో ఏం జరిగింది?

తన కేసు కోసం లాయర్‌ను పెట్టుకోకుండా, అథర్వ స్వయంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టాడు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను 10 నిమిషాల సమయం కోరిన అథర్వ.. విధానపరమైన లోపాల వల్ల విద్యార్థులు ఎలా నష్టపోతున్నారో వివరించాడు.

అథర్వ వాదనలకు ఆకట్టుకున్న ధర్మాసనం, అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రైవేటు కాలేజీల్లో EWS కోటాను నోటిఫై చేయలేదన్న నెపంతో అడ్మిషన్ తిరస్కరించకూడదని పేర్కొంటూ.. 2025-26 విద్యా సంవత్సరంలో అథర్వకు సీటు కేటాయించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మరియు ఎంపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి కోర్టు గడప తొక్కిన ఈ విద్యార్థి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story