హుబీ ప్రావిన్స్‌ నుండి కేరళ చేరుకున్న 15 మంది విద్యార్థులు

హుబీ ప్రావిన్స్‌ నుండి కేరళ చేరుకున్న 15 మంది విద్యార్థులు
x
Highlights

చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో హుబీ ప్రావిన్స్‌లో చిక్కుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన పదిహేను మంది విద్యార్థులు ఎట్టకేలకు కొచ్చిన్...

చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో హుబీ ప్రావిన్స్‌లో చిక్కుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన పదిహేను మంది విద్యార్థులు ఎట్టకేలకు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో దిగారు. ఇన్‌ఫెక్షన్ పరీక్షల కోసం వారికి థర్మల్ స్క్రీనింగ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు శనివారం తెలిపారు. విద్యార్థులు చైనాలోని కున్మింగ్ విమానాశ్రయం నుండి బ్యాంకాక్ వెళ్లి.. ఆ తరువాత ఎయిర్ ఆసియా విమానంలో ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపారు. వీరిని రాత్రి 11 గంటలకు కొచ్చి నుండి ఐదు అంబులెన్స్‌లలో కలమసేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థుల బంధువులు విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ వారిని కలవడానికి అనుమతించలేదు. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ మాట్లాడుతూ.. కరోనావైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన 'రాష్ట్ర విపత్తు' స్టేటస్ ను కేరళ ఉపసంహరించుకుందని.. అయితే హెచ్చరికలు కొనసాగుతాయని.. అందరూ ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

ఇక కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. చైనాలోని వుహాన్ నగరంలో 80 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని వారిని కూడా భారత్ కు రప్పించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 600 మంది దాకా వుహాన్ నుండి వచ్చిన వారు వైద్యుల నిర్బంధంలో ఉన్నారు. ఇప్పటికే వారికి వారం రోజులు గడిచిపోయాయి. మరో వారం రోజుల పాటు వారిని ఐసోలేషన్ వార్డులోనే ఉంచుతారు. ఆరోగ్య స్థితిని బట్టి వారిని తమ స్వస్థలాలకు తరలిస్తారు.

ఇదిలావుంటే కరోనా మహమ్మారికి ఇప్పటివరకు 724 మంది మృతి చెందారు. వీరిలో రెండు మరణాలు మినహా అన్ని చైనాలో సంభవించాయి. ఎక్కువగా హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్ లో చోటుచేసుకున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి వుహాన్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 34,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు, వీరిలో ఎక్కువ మంది చైనాలో ఉన్నారు. శుక్రవారం ఉదయం నాటికి, యు.ఎస్. లో 12 వైరస్ కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories