తెలుగునాట రాజకీయంగా ఢీకొన్న రెండు ప్రభంజనాలు.. కృష్ణ - ఎన్టీఆర్ నాటి వివాదం ఏంటి..?

What was the Dispute Between Super Star Krishna and NTR?
x

తెలుగునాట రాజకీయంగా ఢీకొన్న రెండు ప్రభంజనాలు.. కృష్ణ - ఎన్టీఆర్ నాటి వివాదం ఏంటి..?

Highlights

Super Star Krishna: సూపర్ స్టార్ గా అభిమానుల ప్రేమ చూరగొన్న కృష్ణ.. తెలుగుసినిమా చరిత్రలో ఓ ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయారు.

Super Star Krishna: సూపర్ స్టార్ గా అభిమానుల ప్రేమ చూరగొన్న కృష్ణ.. తెలుగుసినిమా చరిత్రలో ఓ ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయారు. ప్రయోగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఆధునిక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా పలు సాహసాలు చేసి శెభాష్ అనిపించుకున్నారు. ఆయనలో ఉన్న ఆ సాహస ప్రవృత్తే.. సినిమా రంగంవైపు అడుగులు వేయించింది. తెలుగు సినిమా దేవుడిగా పేరున్న ఎన్టీఆర్ ను సైతం ఢీకొట్టించేలా చేసింది.

తెలుగు సినిమా చరిత్రలో ఓ ముఖ్యమైన అధ్యాయం సూపర్ స్టార్ కృష్ణ. అంతేకాదు తెలుగుసీమలోని రాజకీయాల్లో సైతం సాహసోపేతమైన అడుగులు వేశారు. తెలుగు ప్రేక్షకులంతా ఎన్టీఆర్ ను నడిచే దేవుడిగా భావిస్తున్న సమయంలోనే ఆయన ఎన్టీఆర్ ను ధిక్కరించి అనేక ప్రయోగాలు చేశారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అడుగులు వేయడమంటే నిండు గోదావరికి ఎదురీదినట్టే. అయినా.. తాను ఎంచుకున్న రాజకీయ ఎజెండా కోసం, ఎన్టీఆర్ ను సైతం ఎదిరించడానికే నిర్ణయించుకున్నారు కృష్ణ. నేరుగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ 1987లోనే మండలాధీశుడు అనే సినిమా తీశారు. 1983లో ఎన్టీఆర్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ ను మాటల్లో చెప్పలేం. ఆబాలగోపాలం ఎన్టీఆర్ పేరు చెబితే ఉర్రూతలూగిపోయేంత క్రేజ్ ఉండేది. అలాంటి సమయంలో కృష్ణ ఎన్టీఆర్ ను చాలెంజ్ చేస్తూ మండలాధీశుడు సినిమా తీశారు. ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయాల్లో ప్రజాకర్షణే తప్ప.. వాటిల్లో అసలైన ప్రజాసంక్షేమం లేదని కృష్ణ అభిప్రాయం. అందులో ఎన్టీఆర్ పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించారు. రామారావుకు పేరడీగా భీమారావు అంటూ పాత్రకు నామకరణం చేశారు. కోటా కూడా ఎన్టీఆర్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారనిపించుకున్నారు. కానీ ఎన్టీఆర్ కు ఎదురునిలిచి తీసిన సినిమా కాబట్టి ఊహించినట్టుగానే వివాదాలమయంగా మారింది. ఆ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ అంతగా డ్యామేజ్ అయిందని చెప్పలేకున్నా.. ఎన్టీఆర్ వ్యతిరేకుల్లో, టీడీపీ వ్యతిరేకుల్లో, కాంగ్రెస్ పార్టీ నేతల్లో కృష్ణ మాత్రం ఆరాధ్యుడిగా మారారు.

ఇక ఆ సినిమా విడుదలై వివాదాలపాలయ్యాక చాలా కాలం కోటా శ్రీనివాసరావుకు అవకాశాలు కూడా రాలేదట. ఎన్టీఆర్ కోసం పనిచేసే చాలామంది నిర్మాతలు కోటాను బ్లాక్ లిస్టులో పెట్టారట. ఆ సినిమా ప్రభావం ఇండస్ట్రీ మీద అంతగా పడింది. అయితే మండలాధీశుడులోని కంటెంట్ తన కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడిన కోటా అందులోని ప్రయోగాత్మతను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ పాత్ర చేయడానికే ముందుకొచ్చారట. ఆనాటి ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు కోటా మీద దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయంటారు ప్రత్యక్షసాక్షులు. ఇందులో మరో కోణం కూడా ఉంది. కోటా తన పాత్రలో బాగా ఒదిగిపోయారని, ఓ రకంగా పరకాయ ప్రవేశమే చేశారని స్వయంగా ఎన్టీఆరే కోటా నటన మీద ప్రశంసలు కురిపించారట. ఈ విషయాన్ని కోటా ధ్రువీకరించారు. కానీ.. మండలాధీశుడు సినిమా చేయడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారట. అది కూడా బాలకృష్ణ తన మొహం మీదనే చెప్పారని కోటా ఓ సందర్భంలో గుర్తు చేసుకోవడం విశేషం. అయితే కోటా కెరీర్ మీద ప్రభావం చూపిన ఆ సినిమా తరువాత మళ్లీ 1990లో అహ నా పెళ్లంట వరకు ఆయనకు అవకాశాలే రాలేదట. ప్రపంచమంతా ఆశ్చర్యపోయే పిసినారి పాత్రలో కోటా నటించి మళ్లీ తన కెరీర్ ను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.

కృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకునే సమయంలో ఎన్టీఆర్ ను ప్రస్తావించకుండా ఉండలేరు. 1983లో తెలుగుదేశం పేరుతో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తే అంతకు చాలా ఏళ్ల క్రితమే కృష్ణ రాజకీయపరంగా గాఢమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం కీలకమైన అడుగు పడినప్పుడు దానికి కౌంటర్ గా జై ఆంధ్ర పేరుతో పెద్ద నినాదం వచ్చింది. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి "జై ఆంధ్రా" అంటూ నినదించిన వ్యక్తిగా కృష్ణ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉన్న ఆ సమయంలో దాన్ని పూర్తిగా హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని పెద్దలంతా భావిస్తున్న ఆ సమయంలో హీరో కృష్ణ జై ఆంధ్రా అంటూ నినదించడాన్ని సాహసంగానే పరిగణిస్తారు.

ఇక ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఇచ్చాక కృష్ణ పూర్తిగా ఎన్టీఆర్ తో అభిప్రాయ భేదాలతోనే కొనసాగారు. అయితే వారిద్దరిదీ రాజకీయపరమైన వైరమే తప్ప.. వ్యక్తిగతంగా వారి మధ్య స్నేహం చెక్కు చెదరలేదంటారు. కృష్ణ తీసిన ఈనాడు సినిమా టీడీపీ సక్సెస్ కు బాగా ఉపయోగపడిందంటారు. అందుకు కృతజ్ఞతగా ఈనాడు సినిమా వంద రోజుల వేడుక కోసం ఎన్టీఆర్ ఓ ఫుల్ పేజ్ యాడ్ విడుదల చేశారు. ఎన్టీఆర్, కృష్ణ మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీకి దాన్ని ఓ గుర్తుగా చెప్పుకోవచ్చు. అయితే నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి సీఎం అయినప్పుడు కృష్ణ దాన్ని సమర్థిస్తూ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారట. వారి మధ్య ఈ వ్యతిరేకత ఉన్నా.. ఎన్టీఆర్ పట్ల కృష్ణకు అభిమానమే ఉండేదట. తాను ముందుగా అభిమానించింది ఎన్టీఆర్ నటననే అని కృష్ణ చాలాసార్లు చెప్పుకున్నారు. ఎటొచ్చీ రాజకీయపరమైన విభేదాలతోనే ఎన్టీఆర్ తో దూరం పాటించినట్లు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు.

అయితే తెలుగునాట ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోవడానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ కు సరైన వ్యక్తి లేకుండా పోయారు. ఆనాడు ఉన్న సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కించాలంటే మళ్లీ సినీ చరిష్మా ఉన్న పెద్ద క్యారెక్టరే కావాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరాగాంధీ హత్య తరువాత పార్టీ పగ్గాలు రాజీవ్ గాంధీ చేతికి వచ్చాయి. తెలుగు రాజకీయాలపై దృష్టి సారించిన రాజీవ్ కృష్ణను పిలిపించుకొని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాదు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని, వెండితెర మాధ్యమంగా టీడీపీ వ్యతిరేక విధానాల క్యాంపెయిన్ నిర్వహించాలని కృష్ణను ప్రోత్సహించారు. దీంతో ఎన్టీఆర్ విధానాలకు వ్యతిరేకంగా మరికొన్ని సినిమాలు కూడా తీసి సంచలనం రేపారు కృష్ణ.

ఆ సమయంలో వచ్చిన సింహాసనం సినిమా సంచలనమే రేపింది. అందులో ఎన్టీఆర్ డైలాగుల్ని పెట్టారు. ఇక ఆ తరువాత నా పిలుపే ప్రభంజనం అంటూ మరో సినిమా కూడా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిందే. ఇందులో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పేలిన పలు డైలాగులను దాసరి నారాయణరావు రాయడం విశేషం. సాహసమే నా ఊపిరి కూడా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిందే. దాన్ని ప్రత్యేకంగా రాజీవ్ గాంధీకి చూపించారట కృష్ణ. అలాంటి కోవలోదే మరో వివాదాస్పదమైన సినిమా గండిపేట రహస్యం. ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలను ఎంచుకొని ప్రజలకు తెలియని సీక్రెట్స్ ను తెరకెక్కించే ప్రయత్నం చేశారు కృష్ణ. ఇలా వీరి మధ్య సినీ కెరీర్ పరంగానే కాక రాజకీయపరమైన విభేదాలు చివరివరకూ కొనసాగాయంటారు.

కాంగ్రెస్ లో చేరాక ఆయన 1989లో ఏలూరు నుంచి పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో 71వేల భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. అయితే రాజీవ్ గాంధీ హత్య అనంతరం 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన నేరుగా రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. చాలా కాలానికి వైఎస్ హయాంలో తమ కుటుంబమంతా కాంగ్రెస్ తోనే ఉంటుందని బాహాటంగా చెప్పినా వైఎస్ తో వేదిక మీద కనిపించడం మినహా కృష్ణ ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. బహిరంగ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన ఆయన సినీ ప్రయాణానికే పరిమితమవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories