Top
logo

MAA Elections 2021: మెగా ఫ్యామిలీ నరేష్‌పై ఎందుకు గురిపెట్టింది.. మెగాస్టార్‌ను తక్కువ చేసి..

What are the Differences Between Mega Family and Naresh?
X

MAA Elections 2021: మెగా ఫ్యామిలీ నరేష్‌పై ఎందుకు గురిపెట్టింది.. మెగాస్టార్‌ను తక్కువ చేసి..

Highlights

MAA Elections 2021: సార్వత్రిక ఎన్నికలకు ధీటుగా జరిగిన మా ఎన్నికల సెగ ఇంకా తగ్గలేదు.

MAA Elections 2021: సార్వత్రిక ఎన్నికలకు ధీటుగా జరిగిన మా ఎన్నికల సెగ ఇంకా తగ్గలేదు. ఎన్నికల రోజు రక్తికట్టించే డ్రామాలు ఆపై ప్రకాష్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు వెరసి సినిమావాళ్లు తెలుగు ప్రేక్షకులకు టికెట్ కొనకుండానే థ్రిల్లర్ సినిమా చూపించేశారు. ఈ గోలంతా ఈగోల వల్లే వచ్చిందని క్లియర్‌ కట్‌గా తెలుస్తున్నా అసలు సమస్యంతా ఆ ఒక్కడి వల్లే వచ్చిందట. ఇంతకీ ఎవరా ఒక్కడు? ఏంటతనితో వచ్చిన సమస్య?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక పెద్ద కష్టాల గాథే ఉంటుంది. సక్సెస్ అయిన నటుల చుట్టూ ఈగోలు వైఫైలా తిరుగుతూ ఉంటాయి. తోటి నటుల సినిమాలు విడుదలైతే బహిరంగంగా వాటేసుకుని శుభాకాంక్షలు చెప్పి, వారి సినిమాలు ఫ్లాప్ అయితే రాత్రుళ్లు ఫంక్షన్లు చేసుకునే సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. సక్సెస్‌నూ, ఫెయిల్యూర్స్‌నూ సమానంగా చూసే వారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చేమో. ఇలాంటి ఇండస్ట్రీలో వెయ్యి మంది సభ్యులు కూడా లేని మా అసోసియేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికలు వెండితెరపై ఎన్నో నీతులు చెప్పే వ్యక్తులు సగటు జీవితంలో సామాన్యుల కన్నా అథమస్థాయిలోనే ఆలోచిస్తారనీ, వారి ఇళ్లంత విశాలంగా వారి మనసులు ఉండవనీ తమ మాటలతోనూ, చేతలతోనూ మరోసారి నిరూపించారు.

దీంతో, ఇన్నేళ్లూ అసలు సినిమాల్లో మా అసోసియేషన్ అనేది ఒకటుందో లేదో కూడా తెలియని వాళ్లందరికీ చివరకు అదొకటి ఉందని తెలిసింది. అటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు, ఇటు ప్రకాష్‌రాజ్ సవాళ్లు మధ్యలో నరేష్, మోహన్‌బాబు, నాగబాబుల స్పెషల్ ఎంట్రీల మధ్య జరిగిన మా ఎన్నికలు జనాన్ని బాగానే ఎంటర్‌టైన్ చేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే ప్రెసిడెంటు మంచు విష్ణుకు ప్రకాష్ఫరాజ్ ప్యానెల్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనీ, బూత్‌ల వద్ద తమను బూతులతో తిట్టారని ఆరోపించింది. సీనియర్‌ నటుడు మంచు విష్ణు వెనుక ఉండి మాను నడిపిస్తారని విమర్శిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి దుమారానికి తెరలేపింది ప్రకాష్‌రాజ్ ప్యానెల్.

దీంతో అటు ప్రకాష్‌రాజ్ ప్యానెల్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ సైతం నరేష్‌పైనే గురిపెట్టిందట. గతంలో మా అసోసియేషన్ ప్రెసిడెంటుగా పని చేసిన సమయంలోనే మెగా ఫ్యామిలీకి, నరేష్‌కూ మధ్య విభేదాలు తలెత్తాయట. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. దానివల్ల పెద్ద మొత్తంలో అసోసియేషన్‌కు ఫండింగ్ వచ్చింది. అలా వచ్చిందన్న ఆనందం ఎవరికైనా ఉంటుంది కానీ నరేష్ మాత్రం ఆ కార్యక్రమానికి అయిన ఖర్చులపైన అభ్యంతరాలు లేవనెత్తారట. బిజినెస్ క్లాస్‌లో ఫ్లయిట్ టికెట్లు కొంటారా అన్నట్లు మాట్లాడి పరోక్షంగా మెగా స్టార్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేశారట. దీంతో శివాజీరాజా కూడా నరేష్‌ను టార్గెట్‌ చేస్తూ గత హయాంలో జరిగిన లావాదేవీల వివరాల సంగతి తేల్చండని లేఖాస్త్రం సంధించారు. దీంతో మెగా ఫ్యామిలీ తెర వెనుకుండి తనపై కత్తులు దూస్తోందని నరేష్ భావిస్తున్నారట. గన్ నావైపే ఉంది, నాకు తెలుసు అని మంచు విష్ణు గెలిచాక మాట్లాడిన మాటలు కూడా మెగా కాంపౌండ్‌ను ఉద్దేశించి చేసినవేనట.

అలాగే, అదేరోజు పెళ్లిసందడి సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నరేష్‌ను ఉద్దేశించినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటోంది టాలీవుడ్‌. కేవలం ఒక్కరి ఈగో వల్ల ఇండస్ట్రీలో అందరి మధ్య వివాదాలు, గొడవలు రావటం సరికాదన్న కామెంట్స్ నరేష్ కోసం వదిలినవేనన్నది ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. ఇక మోహన్‌బాబుతో మెగా ఫ్యామిలీకి టామ్ అండ్ జెర్రీ రిలేషన్స్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో మోహన్‌బాబు, నరేష్ ట్రాప్‌లో పడ్డారనీ, దీనివల్ల భవిష్యత్తులో మంచు విష్ణును ప్రభావితం చేసి మాను నరేష్ భ్రష్టు పట్టించబోతున్నారన్నది ప్రకాష్‌రాజ్ ప్యానెల్ భగ్గుమంటోంది. అఫ్‌కోర్స్‌ మెగా ఫ్యామిలీ నమ్మకం కూడా అదేనట.

మొత్తంగా మంచు ఫ్యామిలీకి, ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్‌ను నరేష్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారా అంటే సమాధానం అవుననే వినిపిస్తోంది. ఎన్ని వివాదాలున్నా, తెరవెనుక కత్తులు దూసుకున్నా కలిసినపుడు మాత్రం కావలించుకునే నటుల మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తను మా ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చిరంజీవి నేతృత్వంలో జరిగిన మీటింగులకు తనను పిలవకపోవటంతో హర్టయిన నరేష్ మెగా ఫ్యామిలీపై యుద్ధం ప్రకటించి మొన్నటి విష్ణు విజయం వెనుక ప్రధాన వ్యూహకర్తగా మారిపోయాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్.

మా అసోసియేషన్‌ బలోపేతానికి నరేష్ సేవలను వినియోగించుకుంటామంటే నాకు కూడా బుర్ర ఉంది కదా, నాకంటూ ఆలోచనలు కూడా ఉంటాయి కదా అన్న మంచు విష్ణు వ్యాఖ్యల్లో కూడా లోతైన అర్ధమే కనిపిస్తూ ఉందట. అటు మెగా ఫ్యామిలీతో శత్రుత్వం ఉన్న నరేష్ ఇటు మంచు ఫ్యామిలీకి కూడా తన వైఖరితో దూరం అవుతాడా? లేదా తనపై ఇన్ని విమర్శలు వస్తోన్న టైమ్‌లో వాటిని సరిదిద్దుకుని అందరితో కలిసిపోతాడా? ఏమో ఎప్పుడైనా ఏమైనా జరుగొచ్చట. సినిమాల్లో పైకి జరిగేది ఒకటి, తెరవెనుక ఉండేది మరొకటంటారు. మరి ఇప్పుడు సినిమాలకు రాజకీయం పాకిన క్రమంలో ఈ వివాదాలు ఇప్పట్లో కొలిక్కి రావటం కష్టంగానే కనిపిస్తోందట. అప్పటివరకూ మనకు వినోదం వారి ఇమేజ్‌కు ప్రమాదం. అంతేగా అంతేగా అంటోంది సిని... మాలోకం!!

Web TitleWhat are the Differences Between Mega Family and Naresh
Next Story