Vishnu Manchu Movie: వివాదంలో మంచు విష్ణు మూవీ

*జిన్నా టైటిల్‌ ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్

Rama Rao
Updated on: 12 Jun 2022 8:30 PM IST
Vishnu Manchu Movie in Controversy | Tollywood News
X

Vishnu Manchu Movie: వివాదంలో మంచు విష్ణు మూవీ

Vishnu Manchu Movie: మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'గాలి నాగేశ్వరరావు' హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఊవిళ్లూరుతున్నాడు. సినిమా ప్రారంభం‌ నాటి నుంచే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో బజ్ ను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో తన సినిమాకు కావాలనే కాంట్రవర్సీని విష్ణు క్రియేట్ చేశాడని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

గతేడాది మోసగాళ్ళు లాంటి డిజాస్టర్.. అనంతరం‌ విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లను సినిమాలో హీరోయిన్‌లుగా తీసుకోవటంతో పాటు, వారితో అప్పుడప్పుడూ కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ గాలి నాగేశ్వర రావు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండ్రోజుల క్రితం చిత్ర యూనిట్ టైటిల్ లోగో రిలీజ్ చేసింది. అది రివీల్ చేయడం కోసం కూడా ఒక చిన్న ప్రమోషనల్ వీడియోను విష్ణు తయారు చేశారు.

ఈ చిత్ర టైటిల్ గాలి నాగేశ్వరరావును చిన్నగా చేసి ఆసక్తికరంగా "జిన్నా" అనే పేరు పెట్టారు. దీనిపై విష్ణు, సునీల్, కోనవెంకట్ లతో వీడియోలో మాట్లాడుతూ.. ఈ సినిమాకి టైటిల్ అడగగా.. కోన వెంకట్ 'జిన్నా' అని సమాధానం ఇస్తారు. విష్ణు వెంటనే జిన్నా ఏంటండీ.. పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా గుర్తుకు వస్తున్నాయి. కాంట్రవర్సీ అవుతుంది అంటే.. కోన వెంకట్ బదులిస్తూ.. కథలో హీరో పేరు గాలి నాగేశ్వరరావు. అతని పేరు అతనికి నచ్చదు. దీంతో జి.నాగేశ్వరరావుని 'జిన్నా'గా షార్ట్ ఫామ్ లోకి మార్చేస్తాడని అంటాడు.

అయితే విష్ణు చెప్పినట్లు ఇప్పుడు జిన్నా టైటిల్ నిజంగానే కాంట్రవర్సీ అయ్యింది. గాలి నాగేశ్వరరావు సినిమా టైటిల్‌ జిన్నాగా ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదంటున్నారు నెటిజన్లు. తెలుగులో రాస్తే 'గా.నా' అవుతుంది. ఇంగ్లీష్ లో రాస్తే 'G.N' అవుతుంది. మధ్యలో జిన్నా ఎక్కడ నుండి వచ్చింది. పైగా తిరుమల కొండల వెనుక నుండి సూర్యుడిలా ఆ పేరు పైకి రావడం ఏంటంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు జిన్నా పేరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిత్రయూనిట్‌ వెంటనే జిన్నా టైటిల్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి టైటిల్‌ కాంట్రవర్సీపై జిన్నా టీమ్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story