Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్ రివ్యూ.. ఊహకందని కథనం.. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే!

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్ రివ్యూ.. ఊహకందని కథనం.. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే!
x
Highlights

Tribanadhari Barbarik: కొన్ని సినిమాలు కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా.. థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, పౌరాణిక అంశాలను కలిపి ఒక వినూత్నమైన కథతో...

Tribanadhari Barbarik: కొన్ని సినిమాలు కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా.. థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, పౌరాణిక అంశాలను కలిపి ఒక వినూత్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, విజయ్ పాల్ రెడ్డి వనర సెల్యులాయిడ్ బ్యానర్‌పై నిర్మించిన త్రిబాణధారి బార్బరిక్ అలాంటి కోవకే చెందుతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట సింహ, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచి రాయ్, మేఘన వంటి నటీనటులు నటించారు. ఆగస్టు 29న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథా నేపథ్యం

ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కథు (సత్యరాజ్) తన మనవరాలు నిధి (మేఘన) అదృశ్యం కావడంతో ఆ కేసును పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు. మరోవైపు, రామ్ (వశిష్ట సింహ) అనే యువకుడు విదేశాలకు వెళ్లడానికి రూ.30 లక్షలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అతనికి సత్య (సాంచి రాయ్) అనే యువతి పరిచయమవుతుంది. అదే సమయంలో లేడీ డాన్ పద్మ (ఉదయభాను) అల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్) జూదానికి బానిసగా మారి, దాసన్న (మొట్ట రాజేంద్రన్) దగ్గర రూ.15 లక్షలు అప్పు చేస్తాడు. బాల్య స్నేహితులైన రామ్, దేవ్.. వారి సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? వారికి కావాల్సిన డబ్బును ఎలా సంపాదించారు? ఈ క్రమంలో నిధి కేసుతో వారికి సంబంధం ఏంటి? చివరకు నిధి కేసు ఏమైంది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ

త్రిబాణధారి బార్బరిక్ చిత్రం నేటి సమాజంలో జరుగుతున్న నేరాలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా, మాదక ద్రవ్యాలకు బానిసలు అయిన వారు ఎలా క్రూరమైన మృగాలుగా మారుతారో, అలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలి అనే మెసేజ్ ను ఈ సినిమా ఇస్తుంది. సినిమా ప్రారంభం నుంచే కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేపుతూ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది.

సెకండాఫ్ మరింత వేగంగా సాగుతుంది. నిధి మిస్సింగ్ కేసు, అది చివరికి హత్య కేసుగా ఎలా మారుతుంది, ఆ కేసును తాతయ్య ఎలా ఛేదిస్తారు అనే సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ఊహకు అందని రీతిలో ఉంటాయి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందరినీ ఆకట్టుకుంటుంది. చివరగా, ఒక మంచి ఎమోషనల్ ముగింపుతో సినిమా ప్రేక్షకులకు సంతృప్తిని ఇస్తుంది.

నటీనటులు

ఈ సినిమాకు ప్రధాన బలం సత్యరాజ్ నటన. సైకాలజిస్ట్‌గా ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, కొన్ని చోట్ల కేవలం చూపులతోనే అదరగొట్టారు. రామ్ పాత్రలో వశిష్ట అద్భుతంగా నటించాడు. తన పాత్రలో వైవిధ్యాన్ని చూపిస్తూ మెప్పించాడు. ఉదయభానుకు చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. లేడీ డాన్‌గా ఆమె నటన ఆకట్టుకుంటుంది. కొత్త నటుడు అయినప్పటికీ క్రాంతి కిరణ్ అన్ని రకాల భావోద్వేగాలను పండించి చక్కగా నటించాడు. సత్యం రాజేష్, సాంచి రాయ్, మేఘన తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది.

టెక్నికల్ అంశాలు: కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు గొప్ప అందాన్ని తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను మరింత పెంచాయి. ఇది మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ, వనర సెల్యులాయిడ్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఆదితాల ఈ చిత్రాన్ని చాలా బాగా నిర్మించారు.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories