Taraka Ratna: తారకరత్న మృతితో టాలీవుడ్‌లో విషాదం

Tragedy In Tollywood With The Death Of Tarakaratna
x

Taraka Ratna: తారకరత్న మృతితో టాలీవుడ్‌లో విషాదం 

Highlights

Taraka Ratna: దిగ్భ్రాంతికి గురైన ప్రముఖ హీరో మహేశ్ బాబు

Taraka Ratna: నందమూరి తారకరత్న మరణం శివరాత్రి నాడు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తారకరత్న మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మరణించారన్న వార్త తనను తీవ్ర విచారం కలిగిందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నట్టు హరీశ్ వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

తారకరత్న మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వెలిబుచ్చారు. తారకరత్న కన్నుమూయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న అకాలమరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.

తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారని వెల్లడించింది. కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఈ పరిణామంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నందమూరి తారకరత్న మరణవార్త ఎంతో బాధను కలిగించిందని వెల్లడించారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని తీవ్ర విచారన్ని వ్యక్తం చేశారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

నందమూరి తారకరత్న మృతి పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు. తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నామని విజయసాయి వెల్లడించారు. కానీ విధి మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

తారకరత్న మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించానని పవన్ వెల్లడించారు. నటుడిగా రాణిస్తూనే, ప్రజా జీవితంలో ఉండాలని తారకరత్న కోరుకున్నారని, కానీ ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తారకరత్న భార్యాబిడ్డలకు, తండ్రి మోహనకృష్ణ గారికి, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వివరించారు.

నందమూరి తారకరత్న అకాల మరణం గురించి తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని అగ్రహీరో చిరంజీవి వెల్లడించారు. ఎంతో ప్రతిభ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న, అనురాగశీలి అయిన యువకుడు తారకరత్న ఇంత త్వరగా వెళ్లిపోవడం కలచివేస్తోందని చిరంజీవి తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, తారకరత్న ఇక లేరన్న వార్త తెలిసి గుండె పగిలినంత పనైందని తెలిపారు. తారకరత్న చిన్న వయసులోనే లోకాన్ని వీడారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

తారకరత్న మరణవార్త తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని మరో అగ్ర హీరో మహేశ్ బాబు వెల్లడించారు. తారకరత్న అకాలమరణం తీవ్ర వేదన కలిగించిందని తెలిపారు. చాలా త్వరగా వెళ్లిపోయావు బ్రదర్. ఈ కష్టకాలంలో తారకరత్న కుటుంబానికి ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నాగచైతన్య, అఖిల్ అక్కినేని, సుశాంత్, అల్లరి నరేశ్, శ్రీ విష్ణు వంటి నటులు, గీతా ఆర్ట్స్, డీవీవీ ఎంటర్టెయిన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తదితర చిత్ర నిర్మాణ సంస్థలు కూడా తారకరత్న మృతికి సంతాపం తెలియజేశాయి. కాగా తెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం నాడు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాదులో జరగనున్నాయి. తారకరత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలించనున్నారు.

తారకరత్న నివాసం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఉంది. తొలుత మోకిల గ్రామంలోని నివాసానికి తరలించి, ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌కు తీసుకురానున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories