Superstar Krishna: ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

Superstar Krishna: మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Jyothi
Published on: 16 Nov 2022 6:50 AM IST
Superstar Krishna Funeral Live Updates
X

Superstar Krishna: ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

Superstar Krishna: తెలుగు లెజెండరీ యాక్టర్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కృష్ణ భౌతికకాయానికి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ భౌతికకాయాన్ని మొదట గచ్చిబౌలిలోని ఆస్పత్రి నుంచి నానక్ రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. కృష్ణ పార్థివదేహానికి.. పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీపి గుర్తులను నెమరువేసుకుంటూ.. కన్నీటిపర్యంతమయ్యారు. మహేశ్ బాబు కుటుంబాన్ని, నరేశ్ కుటుంబాన్ని ఓదార్చారు.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేశ్, మోహన్ బాబు, రామ్ చరణ్ .. సినీ రంగానికి చెందిన ఇతర హీరోలు, హీరోయిన్లు సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. అలాగే కేసీఆర్, వెంకయ్యనాయడు, తెలంగాణ మంత్రులు.. ఇతర రాజకీయ ప్రముఖులు కూడా కృష్ణ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని కాసేపట్లో పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇవాళ బంద్ పాటించనుంది. బుధవారం సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినీ అభిమానులు అందుకు సహకరించాలని కోరింది. కృష్ణ మృతికి సంతాపంగా ఇవాళ సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

Jyothi

Jyothi

Next Story