SSMB29: రికార్డు క్రియేట్ చేయబోతున్న మహేష్.. ఈ సారి ఏకంగా 120దేశాల్లో రిలీజ్ కానున్న మూవీ

SSMB29: రికార్డు క్రియేట్ చేయబోతున్న మహేష్.. ఈ సారి ఏకంగా 120దేశాల్లో రిలీజ్ కానున్న మూవీ
x
Highlights

SSMB29: బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‎తో రణబీర్ కపూర్ రామాయణ్ సినిమా తెరకెక్కుతోంది.

SSMB29: బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‎తో రణబీర్ కపూర్ రామాయణ్ సినిమా తెరకెక్కుతోంది. అదే సమయంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి మరో భారీ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి ఉంది. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఒక భారీ ప్లాన్ వేశారు. దానితో షారుఖ్ ఖాన్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. అందుకే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క చిన్న సమాచారాన్ని కూడా బయటపెట్టడం లేదు. అయితే, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. నవంబర్‌లో ఈ సినిమా గురించి ఒక పెద్ద ప్రకటన రాబోతుంది. ఈ సినిమా కథాంశంపై చాలా రహస్యాలు ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన విషయాలు లీక్ అయ్యాయి.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా 100కు పైగా దేశాల్లో విడుదలైంది. అత్యధిక దేశాల్లో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా పఠాన్ ఒక రికార్డు సృష్టించింది. అయితే, రాజమౌళి ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. SSMB29 సినిమాను ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిలీజ్ అయిన మొదటి భారతీయ సినిమాగా SSMB29 నిలవనుంది.

SSMB29 సినిమా కోసం లొకేషన్ల ఎంపికలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇటీవలే ఆయన తన టీంతో కలిసి కెన్యా దేశానికి వెళ్లారు. అక్కడ కెన్యా క్యాబినెట్ కార్యదర్శి ముసాలియా ముదావాడిని కలిశారు. ఈ సినిమాను కెన్యాలో కూడా చిత్రీకరించినందుకు ముదావాడి రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ కీలక సమాచారాన్ని బయటపెట్టారు.

"రాజమౌళి 120 మంది సభ్యుల టీం తూర్పు ఆఫ్రికాలో పర్యటించి, కెన్యా లొకేషన్‌ను ఫైనల్ చేశారు. మా దేశాన్ని ప్రధాన షూటింగ్ లొకేషన్‌గా ఎంచుకున్నారు. ఆఫ్రికాకు సంబంధించిన 95% సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కానుంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే అవకాశం ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సినిమా కథ ఒక గ్లోబల్ అడ్వెంచర్ అని, ఆఫ్రికాలో చాలా షూటింగ్ ఉంటుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు ఈ ట్వీట్‌తో అది నిజమని తేలింది.

SSMB29 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి రాజమౌళి, ఆయన బృందం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది నిజమైతే, సినిమాపై గ్లోబల్ క్రేజ్ మరింత పెరుగుతుంది. మొత్తానికి, రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories