Top
logo

SP Balasubrahmanyam no more: జాబిల్లమ్మ నీకు అంత కోపమా..తరలిరాని లోకానికి మా గాన వసంతాన్ని తీసుకుపోయావా?

SP Balasubrahmanyam no more: జాబిల్లమ్మ నీకు అంత కోపమా..తరలిరాని లోకానికి మా గాన వసంతాన్ని తీసుకుపోయావా?
X
Highlights

SP Balasubrahmanyam no more: స్వర స్మరణీయుడు.. తెలుగు జాతి కీర్తి శిఖరం సుస్వర నివాళి!

జాబిల్లమ్మ నీకు అంత కోపమా.. జాజి పూల మీద జాలి చూపుమా.. అంటూ జాబిలమ్మకే జాలిపుట్టేలా పాడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం. సంగీత ప్రపంచపు స్వర చక్రవర్తిగా పాటల జలపాతంలో రాగాల ఝరిగా ఆయన చేసిన స్వరాభిషేకం అద్భుతం అద్వితీయం. కానీ ఇప్పుడా ఆ గళం ఊపిరి పీల్చుకునేందుకు అవస్థలు పడుతోంది. బాలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సంగీత ప్రపంచం ఆయన కోలుకోవాలంటూ ప్రార్థించింది. బాలు కోలుకో అంటూ సంగీత లోకం నినదించింది. కానీ, దేవునికి ఆయన పక్కన కూచోపెట్టుకుని అన్నమయ్య పాటలు పాదించు కోవాలని అనిపించిందేమో.. మన మొర వినలేదు.

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాము నీరాకకై అంటూ సంగీత ప్రపంచం బాలు కోసం పరితపిస్తోంది. నువ్వు అక్కడ మేము ఇక్కడ. పాట అక్కడ మాట ఇక్కడ. అంటూ బాలు గానామృతాన్ని గుర్తు చేసుకుంటోంది. మళ్లీ బాలు క్షేమంగా తిరిగి వచ్చి స్వరాభిషేకం చేయాలని ప్రతి హృదయం పల్లవిస్తోంది. పరితపిస్తోంది. బాలు నీపేరొక జపమైనది. నీ పాటొక తపమైనది. నీ గానం వినడం వరమైనది ఎన్నాళ్లైనా.. అంటూ బాలు అభిమానులు తన గాత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ ఆ గాన గాంధర్వుడి గానాలకు పల్లవి జోడిస్తున్నది.

నీ స్వరం వినకుండా.. నీ గానంతో మంత్రముగ్ధులైన ఈ మనసులు, ఈ మనుషులు ఏమైపోవాలి.. కానరాని ప్రేమలకు సైతం నీ పాటలతో ఓనమాలు నేర్పిన ఓ ప్రేమ గురువా.. కనిపించని కరోనాను కట్టడి చేసి, స్వర ప్రయాణానికి కదిలిరావా అంటూ సినీ సెలబ్రెటీలంతా బరువెక్కిన గుండెతో కోరుకుంటున్నారు. మాటే రాని చిన్నదాని కళ్లు పలికే చెప్పలేని ఊసులంటూ మాతో ప్రేమ పల్లవిని పాడించావు. ఇప్పుడు మౌన గీతాన్ని ఆలపిస్తున్నావు. ఆగష్టు 14న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి దక్షిణాది సంగీత అభిమానులు నీ కోసమే జపిస్తున్నారు. నీ రాక కోసమే తపిస్తున్నారు.

సంగీతానికి చింతకాయలు రాలుతాయో లేదో కానీ.. బాలు గొంతు విప్పితే మాత్రం చప్పట్లు లక్షల్లో వినిపిస్తాయి. ఆఫీసులో పని ఒత్తిడికి, ఇంట్లో చిరాకులకు, ప్రేమ బాధలకు ఏకైక ఔషధం బాలు గాత్రం. ఇది తైలం పెట్టి, తాళం పట్టి, తలాంగుతో తలంటితే మోత అంటూ బాలు మన హృదయాలకు లాల పోశాడు. అలాంటి గొంతు ఇప్పుడు ఆస్పత్రిలో ఉంటే ఏ శ్రోత గుండె బాధ పడదూ? కరోనా కాదు కదా.. దాని తాతమ్మ అయినా తోక ముడిచి పారిపోవాల్సిందే .. బాలు రావాల్సిందే.. రాగం తీయాల్సిందే.. అంటూ సంగీత అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొంతువిప్పి కోరుతున్నారు.

చిలకల పలుకులు, అలకలు ఉలుకులు, పువ్వుల సొగసులు, బాలు పాటలు ఎప్పటికీ పరిమళిస్తాయి. అనునిత్యం పల్లవిస్తాయి. ఆ గొంతు వినే అవకాశం, ఆ గాత్రం అనుభవించే అదృష్టాన్ని ఆ దేవుడు మనకు మళ్లీ దరి చేస్తాడు. బాలు అనారోగ్యాన్ని సరి చేస్తాడు. సిందూరా పువ్వా తేనే చిందించ రావా.. చిన్నారి గాలి సిరులే అందించ రావా అంటూ బాలుని సినీ ఇండస్ట్రీ పెద్దలు పిలుస్తున్నారు. కలలే విరిసేలా.. కథలే పాడేలా ఒక నది వోలె ఆనందాన్ని పంచడానికి బాలు రావా అంటూ బాలుని ఆహ్వానిస్తున్నారు.

తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసమంటూ పాడిన బాలు.. అత్యాశ అయినా.. ఇది జరగని పని అని తెలిసినా సరే యావద్భారతమూ ముక్త కంఠంతో కోరుకుంటోంది మళ్లీ గళం విప్పాలి.. మళ్ళీ తిరిగి రావాలి.. తన గొంతును సవరించుకుంటూ మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారనీ బాధాతప్త హృదయంతో ప్రార్థనలు చేస్తోంది ప్రజ.

బాలూ.. మళ్ళీ ఒక్కసారి మాకోసం తిరిగి రావూ.. నీ పాటల జోలలో మమ్ము నిద్రపుచ్చవూ..

Web TitleSP Balasubrahmanyam no more: people remembering the legendary singer beautiful songs on his disappearance behind their tears
Next Story