జక్కన్న బాటలోనే పయనిస్తున్నారా.. ప్రశాంత్ నీల్ ఎమోషనల్ హిస్టరీ ఏంటి?

Rajamouli is an Inspiration for All of us Says Prashanth Neel
x

జక్కన్న బాటలోనే పయనిస్తున్నారా.. ప్రశాంత్ నీల్ ఎమోషనల్ హిస్టరీ ఏంటి?

Highlights

Pan India Movies: రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ రెండు పేర్లే ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసేస్తున్నాయి.

Pan India Movies: రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ రెండు పేర్లే ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసేస్తున్నాయి. జక్కన్న ఎప్పుడో భారత సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసేశారు. అయితే, ఇప్పుడు మరో సౌత్‌ ఇండియన్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ సైతం అదేబాటలో ఇండియన్ సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళుతున్నారు. ఈ ఇద్దరి పంథా ఒక్కటే.. ఈ ఇద్దరి వర్కింగ్‌ స్టైల్ కూడా ఒకేలా ఉంటుంది. తొందరగా మూవీ కంప్లీట్ చేయాలని తప్పటడుగులు వేయరు. లేటుగా అయినా లేటెస్ట్‌గా బంపర్ విక్టరీని ఖాయం చేసుకునే బరిలో నిలుస్తారు. ఇంతకూ పాన్ ఇండియా ఫిల్మ్‌ వైపు ప్రశాంత్‌ను ఇన్‌స్పైర్ చేసింది ఎవరు..? ఈ ఇద్దరి దర్శకుల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి..?

ఇదీ మాస్ అంటే.. ఇదే మాస్ పల్స్ పట్టుకోవడం అంటే.. ప్రస్తుతం ఈ మాస్ పల్స్ తెలిసింది ఇద్దరే ఇద్దరికి. ఒకరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న అయితే.. మరొకళ్లు శాండిల్ వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరికీ తెలిసినంతగా మాస్ పల్స్ ఇంకొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదు. రీసెంట్‌గా రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ మాస్‌ ఆడియన్స్‌ను టచ్ చేసినా రాజమౌళి, ప్రశాంత్ నీల్ చూపించిన హీరోయిజం, మాస్ ఎలివేషన్స్‌ అంతకుమించి ఉంటాయనడంలో సందేహం లేదు. కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లే విధానం దగ్గర నుంచి తెరపై పాత్రలు నిజమే అనే ట్రాన్స్‌లోకి ఆడియన్‌ను కనెక్ట్ చేయడం ఈ ఇద్దరికీ తెలిసినంతగా మరో డైరెక్టర్‌కు తెలీదు. ఈ విషయాన్ని వాళ్లు చేసిన సినిమాలే చెబుతాయి.

కేజీఎఫ్ చాప్టర్-2.. ప్రస్తుతం ఇండియన్ సినిమాను షేక్ చేసేస్తున్న పేరు ఇదే. కేజీఎఫ్‌ చాప్టర్-1తోనే మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్.. ఆ సక్సెస్‌కు సీక్వెల్‌ను అంతకుమించి మాస్ హిట్ చేశారు. హీరో ఎంట్రీ దగ్గర నుంచి మదర్ సెంటిమెంట్ వరకూ.. యాక్షన్ సీక్వెల్స్‌ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ థియేటర్లు ఆడియన్స్ విజిల్స్‌తో దద్దరిల్లిపోతున్నాయంటే అందుకు కారణం కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రశాంత్ నీల్. అయితే, ప్రశాంత్‌ నీల్‌ను పాన్ ఇండియా సినిమా వైపు నడిపించింది మాత్రం రాజమౌళీనే. ఈ మాట సాక్షాత్తూ ప్రశాంత్ నోటి నుంచే వచ్చింది. చిన్న గల్లీ లాంటి పాన్ ఇండియా సినిమాని ఎనిమిది రోడ్ల హైవేగా మార్చేసిన ఘనత రాజమౌళీదే అని, సౌత్ సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి జక్కన్నే కారణమన్నారు. ఒక్కమాటలో జక్కన్నే తన పాన్ ఇండియాకు స్ఫూర్తి అని చెప్పారు.

చాలా సినిమాల్లో మాదిరిగానే జక్కన్న, ప్రశాంత్ నీల్ సినిమాల్లోనూ స్టార్లు ఉంటారు. కానీ సిల్వర్ స్క్రీన్లపై మాత్రం ఆయా పాత్రలే కనిపిస్తాయి తప్ప స్టార్లు కాదు. ఈ మాట ఈ ఇద్దరి దర్శకుల నుంచి చాలాసార్లే విని ఉంటాం. నిజానికి వీళ్లు చెప్పేది అక్షరాలా నిజం. కేజీఎఫ్‌తో పోల్చితే చాప్టర్-2లో భారీ స్టార్లనే ప్రశాంత్ వాడుకున్నారు. సంజయ్ ద‌త్‌, ర‌వీనా టాంట‌డ‌న్‌, ప్ర‌కాష్ రాజ్‌, రావు ర‌మేష్ లాంటి వాళ్ల‌ని నింపేశారు. అయితే, వీళ్లంతా స్టార్లే కావచ్చని తనకు మాత్రం పాత్రలే కనిపిస్తాయన్నారు. పాత్రలకు అనుగుణంగానే పెద్ద నటులను ఎంచుకున్నట్టు చెప్పారు. డైరెక్టర్ రాజమౌళి సైతం తన ప్రతి సినిమా సమయంలో ఇదే చెబుతారు. ఎంత గొప్ప ఆర్టిస్ట్‌ను తీసుకున్నా స్క్రీన్‌పై మాత్రం పాత్ర ఒక్కటే కనిపిస్తుందని, అక్కడ స్టార్ కనిపిస్తే తాము విఫలం అయినట్టే అని భావిస్తారు. సరిగ్గా కేజీఎఫ్‌ డైరెక్టర్ సైతం ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.

'పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్‌ఫుల్' కేజీఎఫ్‌లోని ఈ ఫేమస్ డైలాగ్ ఈ ఇద్దరి దర్శకులకు అతికినట్టు సరిపోతుంది. ఒకరు టాలీవుడ్ నుంచి ఇంటర్‌ నేషనల్ స్థాయికి ఎదిగితే.. మరొకళ్లు కన్నడ సీమ నుంచి బాలీవుడ్ కోటగోడల్ని బద్దలు కొట్టేశారు. తాజా కేజీఎఫ్‌ చాప్టర్-2తో అంతర్జాతీయ స్క్రీన్‌లనూ షేక్ చేసేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఉండే మరో కామన్ పాయింట్ బలమైన ఎమోషన్స్‌ని పండిచడం. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ జక్కన్నకు ఏమాత్రం తక్కువ కాదని కేజీఎఫ్‌తోనే ప్రూవ్ చేసుకున్నారు. పార్ట్-1లో హీరో చిన్నప్పుడే ఏంకావాలన్న ప్రశ్నకు దునియా అంటూ చెప్పే డైలాగ్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. నిజానికి అక్కడ కుర్రాడి పాత్రే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. సరిగ్గా ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సన్నివేశాల ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించే భారీ విజయం సొంతం చేసుకున్నారు.

24 క్రాఫ్ట్స్‌పై పట్టు... డైరెక్టర్ అవ్వడం, ప్రపంచస్థాయి సినీ ప్రియులను మెప్పించడం మెగా ఫోన్ పట్టినంత ఈజీ కాదు. సినిమాలోని 24 విభాగాల్లోనూ పూర్తిగా పట్టుండాల్సిందే. ఈ విషయంలో జక్కన్న, ప్రశాంత్ నీల్‌కు ఫుల్ మార్క్స్‌ వేయొచ్చు. సినిమాకి అత్యంత ముఖ్యమైన కథ, కథనం, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప సరైన ఔట్‌పుట్ రాదు. అలాంటిది పాన్ ఇండియా సినిమా అయితే ఇంకెంత కష్టపడాలి..? ఇదే సమయంలో ఏళ్లకు ఏళ్లు ఒకే ప్రాజెక్ట్ చేయడం కూడా కత్తి మీద సామే. బాహుబలి, RRR విషయంలో రాజమౌళి, కేజీఎఫ్ రెండు భాగాల విషయంలో ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరూ సుదీర్గంగా ఒకే సినిమా కోసం కష్టపడి సక్సెస్ సాధించిన వారే. అన్నింటికీ మించి ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశానికి ఏం కావాలో, ఎంత పరిధిలో పండించాలో వీళ్లకి తెలిసినంతగా మరొకరికి తెలీదు.

ఒకప్పుడు సౌత్ సినిమాలను చిన్న చూపు చూసిన బీటౌన్‌కు ప్రస్తుతం జక్కన్న, ప్రశాంత్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సౌత్‌ మూవీస్ భారీ విజయం సాధిస్తే హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. డైరెక్ట్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తేనే బాలీవుడ్ ఖాన్స్‌, ప్రొడ్యూసర్స్ ఎగతాళి చేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలాంటిది, ఇప్పుడు సౌత్ మూవీస్‌ కోసం రిలీజ్‌లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితికి బీటౌన్ దిగజారిపోయింది. రొటీన్, కమర్షియల్ మూస ధోరణిలో సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు. ఒకప్పుడు సౌత్‌లోనూ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని రొటీన్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే, కమర్షియల్ లెక్కలు తప్పకుండా హిట్ ఎలా కొట్టాలో చేసి చూపించింది మాత్రం సౌత్ దర్శకులే. ఆ జాబితాలో జక్కన్న, ప్రశాంత నీల్ ముందే ఉంటారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ కాకుండా విజయం సాధించడానికి బాటలు వేసింది దర్శక ధీరుడు రాజమౌళి అయితే, ఆ సక్సెస్‌కు కొనసాగించడంలో ప్రశాంత్ సక్సెస్ అయ్యారు. ఇక్కడే బాలీవుడ్ కడుపుమంట మొదలైంది. రీసెంట్‌గా RRR రిలీజ్ టైమ్‌లోనూ బాలీవుడ్ తన కుళ్లుమోతు తనం ప్రదర్శించింది. RRRకు పోటీగా బరిలోకి దిగిన జాన్ అబ్రహం అటాక్ మూవీ జక్కన్న, చరణ్, ఎన్టీఆర్ మేనియా ముందు బొక్కబోర్లా పడింది. రికార్డు కలెక్షన్లు కాదు కదా సినిమాకు పెట్టిన ఖర్చయినా వచ్చిందో లేదోఅన్నది అనుమానమే. ఇలాంటి సమయంలోనే తెలుగు సినిమాలో నటిస్తారా అన్న ప్రశ్నకు తాను బాలీవుడ్ హీరోను అనీ, ప్రాంతీయ సినిమాల్లో నటించే ఛాన్సే లేదని గొప్పలుపోయి అభాసుపాలయ్యాడు. బాలీవుడ్ రాత మారాలంటే సౌత్ డైరెక్టర్లే దిక్కని, ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూనే ఉన్నాడు.

మొత్తంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ దెబ్బకు ఇండియన్ స్క్రీన్‌లు షేక్ అయిపోతున్నాయి. మాస్ పల్స్‌ పట్టుకోవడంలో తమకు తిరుగే లేదని ఈ ఇద్దరు డైరెక్టర్లు మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇండియన్ సినిమాను జక్కన్న అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తే.. అదే స్థాయి సత్తా ఉన్న మరో డైరెక్టర్ అంతకుమించిన విజయాలు సాధిస్తాడన్న నమ్మకం ఇస్తున్నాడు. ఒక్కమాటలో సౌత్ సినిమా గురించి కామెంట్ చేసే ధైర్యం బాలీవుడ్ ఖాన్‌లే కాదు.. మరే ఇతర టెక్నీషియన్లు చేయబోరనే చెప్పాలి. ఇదే సమయంలో కోవిడ్ పాండమిక్‌తో కుదేలైన ఇండియన్ సినీమాను మళ్లీ నిలబెట్టడంలో ఈ ఇద్దరు దర్శకులు వందకు వందశాతం సక్సెస్ అయ్యారు. ఇక కేజీఎఫ్ చాప్టర్-2తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ ప్రభాస్‌తో చేస్తున్న సలార్‌ను ఇంకెంత భారీగా తెరకెక్కిస్తాడన్న అంచనాలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories