Ameesha Patel: నటి అమీషా పటేల్‌కు మొరాదాబాద్ కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. అసలేం జరిగింది?

Ameesha Patel: నటి అమీషా పటేల్‌కు మొరాదాబాద్ కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. అసలేం జరిగింది?
x
Highlights

Ameesha Patel: 'బద్రి' ఫేమ్, బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కు చట్టపరమైన చిక్కులు ముదిరాయి.

Ameesha Patel: 'బద్రి' ఫేమ్, బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కు చట్టపరమైన చిక్కులు ముదిరాయి. చెక్ బౌన్స్ మరియు మోసం కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. కోర్టు విచారణలకు వరుసగా గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ గొడవ 2017లో ప్రారంభమైంది. ఆ ఏడాది జరిగిన ఒక వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు అమీషా పటేల్ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు గానూ ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ నుంచి ఆమె రూ. 14.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అయితే, సదరు కార్యక్రమానికి అమీషా హాజరు కాలేదని, తీరా డబ్బులు తిరిగి అడిగితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని పవన్ వర్మ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణలో భాగంగా మార్చి 27న స్వయంగా హాజరు కావాలని కోర్టు అమీషాను ఆదేశించింది. కానీ, ఆమె విచారణకు రాలేదు. గతంలో కూడా పలుమార్లు సమన్లు జారీ చేసినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి చర్యలకు ఆదేశించింది.

ఈ వ్యవహారంపై అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. "ఇది చాలా పాత విషయం, ఇప్పటికే ఈ కేసు సెటిల్ అయిపోయింది. సెటిల్‌మెంట్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసి పవన్ వర్మకు అడిగిన మొత్తం చెల్లించాము. కేవలం ప్రచారం కోసం, డబ్బుల కోసమే ఆయన ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారు. మా లాయర్లు ఆయనపై చీటింగ్ కేసు పెట్టబోతున్నారు" అని అమీషా పేర్కొన్నారు.

అమీషా పటేల్‌కు ఇలాంటి కేసులు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాంచీ మరియు ఇతర నగరాల్లో కూడా ఆమెపై చెక్ బౌన్స్ కేసులు నమోదై వార్తల్లో నిలిచారు. తాజా వారెంట్‌తో అమీషా తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories