వివాదాలకు కేరాఫ్‌గా నాగబాబు.. మెగా బ్రదర్స్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్నారనే కామెంట్స్..?

Nagababu: సెన్షేషన్ ఏదైనా.. వేలు పెడతాడు. సిచువేషన్‌ ఎలాంటిదైనా.. ఓన్ చేసుకుంటాడు.

Arun Chilukuri
Updated on: 8 Oct 2022 9:00 PM IST
Nagababu, the Real Culprit Damaging Mega Family Image
X

వివాదాలకు కేరాఫ్‌గా నాగబాబు.. మెగా బ్రదర్స్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్నారనే కామెంట్స్..?

Nagababu: సెన్షేషన్ ఏదైనా.. వేలు పెడతాడు. సిచువేషన్‌ ఎలాంటిదైనా.. ఓన్ చేసుకుంటాడు. చివరకు దాన్ని వివాదాస్పదంగా మారుస్తాడు. రచ్చ రచ్చ చేస్తాడు. అన్నదమ్ముల పంచాయితీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు.. ఎవరూ అడగకపోయినా.. అన్నింటిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. అది కాస్తా ఇష్యూగా మారాక.. వివరణ ఇచ్చుకుంటాడు. అప్పుడు కానీ ఆ గొడవను ముగించడు. మెగా బ్రదర్ నాగబాబుకు ఇది కామన్‌గా మారింది. తాజాగా గరికపాటి, మెగాస్టార్ ఇష్యూలో కూడా సేమ్‌ పరిస్థితి. చిన్న విషయాన్ని.. తన ట్వీట్‌తో పెద్దదిగా చేశాడు. చివరకు వివాదాస్పదం చేశాడు. చిరు, గరికపాటి గొడవలో.. నాగబాబు రోల్ ఏంటి..? ఆయన వల్ల మెగా ఫ్యామిలీకి ఒరిగిందేంటి..?

అటు అన్నయ్య సినిమాల్లో.. ఇటు తమ్ముడు రాజకీయాల్లో.. ఇద్దరూ సక్సెస్‌ ఫుల్‌ జర్నీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న మిడిల్ బ్రదర్ నాగబాబు మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా స్మాల్ స్క్రీన్‌పై మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్‌లో ఆయన నవ్వులకు ఫిదా కాని వారెవ్వరు. అలాంటి నాగబాబు మాత్రం ఎప్పుడూ ఏదో వివాదంపై స్పందిస్తూ ఉంటాడు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి మధ్య జరిగిన చిన్న విషయంలో తాను ఎంటరై ఇష్యూగా మార్చేశాడు. రచ్చ రచ్చ చేశాడు. ఎప్పట్లాగే మళ్లీ తానే వివరణ ఇచ్చుకున్నాడు.

విషయానికి వస్తే దసరా సందర్భంగా బీజేపీ సీనియర్ లీడర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వేంచేసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి తన అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. దీనిపై తన సహజశైలిలో మాట్లాడిన గరికపాటి ఫోటో సెషన్‌ను ఆపితేనే తాను ప్రసంగిస్తానని లేకపోతే స్టేజ్‌ నుంచి వెళ్లేందుకు కూడా మొహమాటం లేదని తేల్చిచెప్పారు. ఆయన మాటలు విన్న చిరంజీవి వెంటనే డయాస్ ఎక్కి.. గరికపాటి స్పీచ్‌ను శ్రద్ధగా విన్నారు. తర్వాత ఇద్దరూ సరదగా మాట్లాడుకున్నారు కూడా. చెప్పుకోడానికి ఇక్కడ పెద్ద గొడవ జరిగినట్లు ఏం లేదు. కానీ దీన్ని మీడియా హైలెట్ చేయడంతో సీన్‌లోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు.

ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ.. ఓ ట్వీట్ వదిలాడు నాగబాబు. ఇది గరికపాటి, చిరంజీవి మధ్య జరిగిన విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తేలిపోయింది. అంతే అది కాస్తా పెద్ద దుమారంగా మారింది. ఇటు గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సహస్రావధాని అని కూడా చూడకుండా దారుణమైన సంభాషణలతో రెచ్చిపోయారు. విపరీతంగా ట్రోల్ చేశారు. వాస్తవానికి అటు గరికపాటి కానీ, ఇటు చిరంజీవి కానీ ఇద్దరు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నవారే. గరికపాటి మాటలతో చిరంజీవి స్టేజ్‌పైకి రావడంతో ఆయన తన హుందాతనాన్ని ప్రదర్శించారు. అయితే తనకు ఇబ్బందిగా ఉన్న సమయంలో గరికపాటి అలా అనకుండా ఇతరులతో చెప్పిస్తే సరిపోతుందనే వాదన కూడా వచ్చింది. అయితే జరిగింది మాత్రం టీ కప్పులో తుఫాన్ లాంటిదే. కానీ మిడిల్ బ్రదర్ ఎంట్రీతోనే వచ్చింది చిక్కంతా.

నాగబాబు ట్వీట్‌ను కొందరు సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. అసలు అక్కడున్న చిరంజీవే ఏం మాట్లాడకుండా.. మౌనంగా.. హుందాగా ప్రవర్తించగా.. సీన్‌లో లేని నాగబాబు మాత్రం మెగాస్టార్ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నారంటూ ట్వీట్స్‌ వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే మరో ట్వీట్ వదిలాడు. గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఉండి అలా అని ఉంటారని ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలని అన్నాం తప్ప ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. గరికపాటిని ఎవరూ ఏమీ అనవద్దని మెగా ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. అయితే ఇలా అనవసర విషయాల్లోకి వచ్చి అన్నదమ్ముల ఇమేజ్‌లను దిగజార్చడంలో నాగబాబు దిట్ట అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. గతంలో నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్‌ ఎంతలా దుమారం రేపిందో తెలిసిందే.

గతంలో నాధురాం గాడ్సే నిజమైన దేశ భక్తుడంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశాడు. గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందనేదానిపై గాడ్సే ఆర్గ్యుమెంట్‌ను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని.. గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా.. తాను అనుకున్నది చేశాడని, నాథూరాం దేశభక్తిని శంకించలేమంటూ ట్వీట్ చేశాడు. ఇది మామూలు ట్రోలింగ్‌కు గురికాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొద్ది మంది నాగబాబుకు పాజిటివ్‌గా రెస్పాన్స్‌ ఇచ్చినా చాలామంది మాత్రం ఆయన ట్వీట్‌పై మండిపోయారు. గాడ్సేపై నాగబాబు ట్వీట్ పక్కా రాజకీయ ప్రయోజనాలను ఆశించే చేశారని.. ఆరోపణలు వచ్చాయి. ఇటు కాంగ్రెస్‌ వాదులు, అటు కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాల్సి వచ్చింది. జనసేన నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పవన్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖను విడుదల చేయాల్సి వచ్చింది.

అయితే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవడంతో మరో ట్వీట్ చేశాడు. తాను నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదని నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నానన్నారు. తనకు గాంధీ అంటే చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. ఇదే కాదు.. భారతీయ కరెన్సీ నోట్లపై స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కూడా చూడాలని ఉందంటూ మరో ట్వీట్ చేశాడు. సుభాష్ చంద్ర బోస్, అంబేడ్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రీ, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయి లాంటి మహానుభావుల చిత్రాలను నోట్లపై చూడాలని అనుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. ఇది తన ఆశ అని అన్నారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదని కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

ఇక మరోసారి.. అహింస, శాంతి కంటే కూడా హింసతో కూడిన దేశభక్తి మంచిదే అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో, చల్లబడి పోయిందని తిరిగి రక్తం వేడెక్కాలంటే.. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు, రాజ రాజ చోళుడు, సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే.. వచ్చే తరం అయినా సాహసం, పౌరుషం, మరిగే రక్తంతో పెరుగుతుందన్నారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయిందని వాళ్ళనైనా దేశానికి ఉపయోగపడే వీరులుగా తయారు చేద్దామన్నారు. భారతదేశానికి, దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి కానీ.. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదన్నారు. ప్రతి నేరాన్ని పోలీస్, మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇది కూడా తీవ్ర దుమారం రేపింది. ఇవే కాదు.. ఇటీవల మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతోనే ప్రకాశ్‌రాజ్ ఓటమి చెందారని తద్వారా మెగాస్టార్‌ పరువు పోయిందనే ప్రచారం బాగా జరిగింది. ఇటు గత ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న నాగబాబు మళ్లీ ఎన్నికల వేళ పవన్‌ పక్కనే కూర్చుంటున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇలా రకరకాల కాంట్రావర్సీల్లో కావాలనే ఇరుక్కుని మెగా బ్రదర్స్‌కు ఇబ్బందులు కలగజేస్తున్నాడంటూ నాగబాబుపై విమర్శలు వస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story