పరిశ్రమను మెగా ఫ్యామిలీ లీడ్‌ చేయబోతోందా?

పరిశ్రమను మెగా ఫ్యామిలీ లీడ్‌ చేయబోతోందా?
x
Highlights

సీఎం జగన్‌-మెగాస్టార్‌ చిరంజీవి లంచ్‌ మీటింగ్‌లో, కేవలం సైరా గురించే చర్చ జరిగిందా సైరాను మించిన డిస్కషన్‌ సాగిందా తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న ఒక...

సీఎం జగన్‌-మెగాస్టార్‌ చిరంజీవి లంచ్‌ మీటింగ్‌లో, కేవలం సైరా గురించే చర్చ జరిగిందా సైరాను మించిన డిస్కషన్‌ సాగిందా తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న ఒక సామాజికవర్గంపై, ప్రధానంగా మాట్లాడుకున్నారా ఇప్పుడు ఆ వర్గం ఆధిపత్యానికి గండికొట్టాలని ఆలోచనలు చేశారా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తున్న మెగా ఫ్యామిలీతోనే, ఆ వర్గం డామినేషన్‌ను సైతం బద్దలుకొట్టించాలని వైసీపీ పాలకులు భావిస్తున్నారా ఇక నుంచి మెగా కుటుంబం, ఇండస్ట్రీని లీడ్‌ చేయబోతోందా? జగన్‌-చిరు లంచ్‌ మీటింగ్‌ సారాంశం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సైరా సినిమా ఊపులో వున్న మెగాస్టార్‌ చిరంజీవి సమావేశంపై, మొదటి నుంచి అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ సాగింది. ఇద్దరు మహామహుల అరుదైన కలయిక గురించి అందరూ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూశారు. అమరావతిలోని తన నివాసానికి వచ్చిన చిరంజీవి, సురేఖా దంపతులను జగన్‌ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరాను, చూడాల్సిందిగా, జగన్‌ను కోరేందుకే, చిరంజీవి అమరావతి వెళ్లినా, సైరాను మించిన డిస్కషన్‌ వీరిమధ్య జరిగినట్టు చర్చ సాగుతోంది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో వున్నప్పటికీ, అందులో అగ్రదర్శకులు, నిర్మాతలు, హీరోలందరూ ఏపీకి చెందినవారే. 99 శాతం ఇండస్ట్రీని లీడ్‌ చేస్తోంది ఏపీకి చెందినవారే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతోనూ వీరికి అవినాభావ సంబంధంవుంది. పాలిటిక్స్‌లో చక్రంతిప్పారు కూడా. అయితే, ఇటు రాజకీయాలు, అటు సినిమా రంగంలోనూ ఒకే బలమైన సామాజికవర్గం ఆధిపత్యం అప్రతిహతంగా సాగింది. సీఎం జగన్‌, చిరంజీవి భేటిలో ఇలాంటి ఆధిపత్యంపైనే చర్చ సాగినట్టు తెలుస్తోంది.

అయితే, రాజకీయాల్లో కనిపించే సామాజికవర్గాల డామినేషన్, సినిమావర్గంలోనూ సాగుతోందన్నది బహిరంగ రహస్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో, మొదటి నుంచి ఒకవర్గం చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా నడుస్తోంది. సాధారణంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, సినిమా పరిశ్రమ పెద్దలు, పాలకులను కలిసి, అభినందించాలనుకుంటారు. కానీ జగన్‌ సీఎం అయి, నాలుగు నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు మాత్రం, సినిమా పరిశ్రమ పెద్దలు జగన్‌ను కలవడానికి రాలేదన్న విమర్శ వుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్దలు, సినిమా పరిశ్రమ అనగానే గుర్తొచ్చే సురేష్‌ బాబు, రాఘవేంద్ర రావు, రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజలాంటివారు, కొత్త ప్రభుత్వాధినేతను అభినందించడానికి అమరావతికి రాలేదని, మొదటి నుంచి వాడివేడిగా చర్చ సాగింది. అయితే, జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా, ఇప్పటి వరకూ ఇవ్వలేదని, అందుకే కలవలేకపోతున్నామని సురేష్‌ బాబు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

సినిమా పెద్దలు నిజంగా జగన్‌ను కలిసే ప్రయత్నమే చేయలేదా?

లేదంటే వారు ప్రయత్నించినా కలవడానికి జగనే ఇష్టపడలేదా?

ఇండస్ట్రీలో సామాజికవర్గ ఆధిపత్యమే ఇందుక్కారణమా?

ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని చిరుకు అందించడమే లక్ష్యమా?

అమరావతిలో మొన్నటి వరకు ఒక సామాజికవర్గం డామినేషన్ ‌సాగింది. వైసీపీ అధికారంలోకి రావడంతో, ఆ ఆధిపత్యానికి గండిపడింది. ఇదే నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ ఏకంగా, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పడు సినిమా పరిశ్రమలోనూ ఆ సామాజికవర్గం ఆధిపత్యానికి గండికొట్టాలన్నది, జగన్‌ వ్యూహంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి లాంటి, బిగ్‌ స్టార్‌తో ఆధిపత్యాన్ని సవాల్‌ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ బాధ్యతను మెగా ఫ్యామిలీ తీసుకున్నట్టేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరకూ, కొత్త పాలకులను కలవకపోవడానికి కారణం, చంద్రబాబు కనుసన్నల్లోనే ఇండస్ట్రీ నడుస్తోందని వైసీపీ బలమైన అనుమానం. అందుకే ఇండస్ట్రీలో ఒకవర్గం ఆధిపత్యాన్ని తగ్గిస్తే, ఆటోమేటిక్‌గా చంద్రబాబు బలాన్ని కూడా తగ్గించినట్టు అవుతుందని వైసీపీ నేతల భావనగా అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన ఆ గ్యాప్‌ను చిరంజీవితో భర్తీ చేయాలని జగన్‌ ఆలోచనగా సమాచారం. జగన్‌-చిరుల భేటిలో, దాదాపు ఇలాంటి అంశాల చుట్టే చర్చ జరిగినట్టుగా కొందరు విశ్లేషిస్తున్నారు.

చిరంజీవికి, జగన్‌ను కలవడానికి సైరా రూపంలో ఒక అవకాశం వచ్చినా, గ్యాప్‌ను ఫిలప్‌ చేసే బాధ్యతపై ప్రధానంగా డిస్కషన్‌ జరిగినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన అంశాలన్నింటిలో, అంటే ప్రత్యేక షోలు, ప్రత్యేక ధరలు, పన్నుల రాయితీలు ఇలాంటి ముఖ్యమైన వాటి విషయంలో, చిరంజీవి ద్వారానే పరిష్కరించే అవకాశముంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు వుండరు. గతంలో వీరి మధ్య పొరపచ్చాలున్నప్పటికీ, చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా రాజకీయ విముక్తుడయ్యారు. పాలిటిక్స్‌ అనే పదం వినడానికి కూడా ఆ‍యనకు ఇష్టంలేదని తెలుస్తోంది. రాజకీయంగా పవన్‌తో ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా చాలాసార్లు చెప్పారు. ఆ విషయం జగన్‌కు తెలుసు కాబట్టి, చిరంజీవితో సమావేశానికి ఒప్పుకోవడం, ఇండస్ట్రీ పరిణామాలపై చర్చించడం జరిగిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఇప్పుడు మొత్తం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టినా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో చిరంజీవికి రాజకీయ దన్ను అవసరం. అలాగే రాజకీయాల్లో వున్న నాయకులకు, సినిమా ఇండస్ట్రీ సహకారం, అందులోనూ మెగాస్టార్‌ లాంటి అగ్రతారల సపోర్ట్‌ కూడా అవసరం పడుతుండొచ్చు. అలా ఉభయులకూ ప్రయోజనం కలిగేలా, ఏపీకి, ఇండస్ట్రీకి మధ్య అగాథాన్ని పూడ్చేలా, ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని చిరును, జగన్‌ కోరినట్టు తెలుస్తోంది. అంటే సినిమా పరిశ్రమను మెగా ఫ్యామిలీ చేయబోతోందా అన్న చర్చ జరుగుతోంది. సొంతంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టి, సైరా వంటి భారీ సినిమాను తెరకెక్కించిన కొణిదెల కుటుంబం, ఇండస్ట్రీకి కూడా నాయకత్వం వహించే అవకాశముందా చిరును ముందుపెడితే, మొత్తం ఇండస్ట్రీ తన మాట వింటుందని వైసీపీ పాలకులు భావిస్తున్నారా ఈ ప్రశ్నలకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి. మొత్తానికి ఇలా సీఎం జగన్‌, చిరంజీవిల భేటి, అన్ని వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. చూడాలి, సినిమా ఇండస్ట్రీలో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలో చోటు చేసుకుంటాయో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories