Threat Mail: బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు.. ఆందోళనలో స్టార్స్‌

Kapil Sharma Rajpal Yadav and 2 Other Celebrities Get Death Threats
x

Threat Mail: బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు.. ఆందోళనలో స్టార్స్‌

Highlights

వరుస బెదిరింపులతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ వరుస బెదిరింపులు ఎదుర్కొన్నారు.

Threat Mail: వరుస బెదిరింపులతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ వరుస బెదిరింపులు ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాకు హత్య బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. విష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

"మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కాదు. మీరు ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోండి" అంటూ ఈ మెయిల్‌లో ఉన్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

తన డిమాండ్లను 8 గంటల్లోగా నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి హెచ్చరించినట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రముఖుల ఫిర్యాదు మేరకు అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు అతన్ని ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు.. సైఫ్ శరీరం నుంచి 2 అంగుళాల కత్తి ముక్కను బయటకు తీశారు. ఇటీవల డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటన బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ముంబై లాంటి ప్రాంతంలో ప్రముఖ నటుడిపై దాడి జరగడం ఆందోళనకరం. గతంలో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిగాయి. ఆ తరువాత మరో ఘటనలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని హత్య చేశారు. ముంబై నగరం సురక్షితం కాదని.. సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. వారి వ్యాఖ్యలను ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories