Kannappa Review : ప్రభాస్ ఎంట్రీతో పూనకాలు, విష్ణు నటనకు క్లైమాక్స్‌లో కంటతడి.. డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరిందా?

Kannappa Review : ప్రభాస్ ఎంట్రీతో పూనకాలు, విష్ణు నటనకు క్లైమాక్స్‌లో కంటతడి.. డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరిందా?
x

Kannappa Review : ప్రభాస్ ఎంట్రీతో పూనకాలు, విష్ణు నటనకు క్లైమాక్స్‌లో కంటతడి.. డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరిందా?

Highlights

మంచు విష్ణు ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

Kannappa Review : మంచు విష్ణు ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్రతారలు ముఖ్య పాత్రల్లో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ 'కన్నప్ప' అందుకున్నాడా? సినిమా ఎలా ఉంది? ఒకసారి వివరంగా చూద్దాం.

కథ: వేటగాడి నుంచి భక్తుడిగా మారిన ప్రయాణం

సినిమా కథ వేటగాడు తిన్నడు(విష్ణు మంచు) చుట్టూ తిరుగుతుంది. తిన్నడు చిన్నతనం నుంచీ కూడా భక్తి, దేవుడు, మూఢ నమ్మకాలు వంటి వాటిని పెద్దగా పట్టించుకోడు. కానీ తన తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) మాటను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తాడు. అలాంటి తిన్నడు నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో పడతాడు. నెమలితో వివాహం తర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కథలో వాయు లింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ వాయు లింగం కోసం జరిగే పోరులో చివరికి ఏం జరుగుతుంది? ఈ కథలో రుద్ర (ప్రభాస్) పాత్ర, కిరాత (మోహన్ లాల్) పాత్ర ప్రాముఖ్యత ఏంటి? చివరికి తిన్నడు ఆ శివ (అక్షయ్ కుమార్) భక్తిలో ఎలా లీనమవుతాడు? అనేదే సినిమా కథాంశం.

విశ్లేషణ:సెకండాఫ్‌లో ప్రభాస్ సునామీ!

ఫస్ట్ హాఫ్ అంతా చాలా సాఫీగా, ఒక ఫ్లోలో సాగుతుంది. తిన్నడి పరిచయం, వాయు లింగం నేపథ్యం, తిన్నడు నెమలి ప్రేమ కథ, వారి పెళ్లి... ఇలా అన్నీ ప్రేక్షకులకు హాయిగా అనిపిస్తాయి. కంటికి ఇంపుగా కనిపించే దృశ్యాలు, వినసొంపైన పాటలతో మొదటి భాగం ఆహ్లాదకరంగా ముందుకు వెళ్తుంది. అయితే, అసలు కథను ప్రారంభించడానికి, కథలో సంఘర్షణను తీసుకురావడానికి కాస్త సమయం పడుతుంది. ఇంటర్వెల్‌కి అసలు సిసలు కథ ప్రారంభం అవుతుంది. తిన్నడు కాస్తా భక్త కన్నప్పగా మారేందుకు మొదటి అడుగు అక్కడ పడుతుంది.

సాఫీగా, హాయిగా సాగిన మొదటి భాగానికి, రెండో హాఫ్ మరింత జోష్‌ను అందిస్తుంది. ఈ ద్వితీయార్థంలో వచ్చే ఉద్వేగభరిత సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. అరుపులతో థియేటర్ టాప్ లేచిపోతుందేమో అనిపిస్తుంది. ప్రభాస్ పాత్ర ఉన్నంత సేపు ఈ సినిమా మరో స్థాయికి వెళ్లిందనిపిస్తుంది. ఆ దాదాపు ఇరవై నిమిషాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా సాగుతుంది.

నటన: విష్ణుకు మరుపురాని పెర్ఫార్మెన్స్

నటీనటుల విషయానికి వస్తే, ముందుగా మంచు విష్ణు గురించే చెప్పుకోవాలి. తిన్నడుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత భక్త కన్నప్పగా మారినప్పుడు విష్ణు నటనలో చూపిన వేరియేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. తిన్నడు, భక్త కన్నప్ప పాత్రలకు తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్‌లో కూడా విష్ణు తేడా చూపించాడు. విష్ణు ఈ సినిమాను తన నటనతో నిలబెట్టేశాడని చెప్పుకోవచ్చు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే, రుద్ర పాత్రలో ప్రభాస్ ఉన్నంతసేపు ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటుంది. ప్రభాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రభాస్ సీన్లు, ప్రభాస్ - విష్ణు మధ్య సీన్లు, ప్రభాస్ - మోహన్ బాబు మధ్య సీన్లు.. అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్ బాబు అయితే మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, అర్పిత్ రంకా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు.

టెక్నికల్ అంశాలు: విజువల్ వండర్

టెక్నికల్‌గా 'కన్నప్ప' సినిమా ఉన్నత ప్రమాణాలను అందుకుంది. విజువల్స్ ఈ చిత్రానికి అతి పెద్ద బలం. న్యూజిలాండ్ అందాలను మరింత అందంగా చూపించారు. నిజంగానే మనం రెండో శతాబ్దానికి వెళ్ళామా అన్నంత సహజంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతీ పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. సంగీతం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పాటలు సినిమాకు ఒక పాజిటివ్ అంశంగా నిలుస్తాయి. డైలాగ్స్ గుండెల్ని తాకుతాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ వంటి మిగిలిన సాంకేతిక అంశాలు కూడా మెప్పిస్తాయి.

క్లైమాక్స్:

ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్ అద్భుతంగా అనిపిస్తాయి. అక్కడ విష్ణు నటన చూస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేరు. థియేటర్ నుంచి బయటకు వెళ్లే ప్రేక్షకులను విష్ణు తన నటనతో ఏడిపిస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్.

చివరి మాట, రేటింగ్:

మొత్తంగా, 'కన్నప్ప' విజువల్‌గా చాలా రిచ్‌గా, సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న సినిమా. విష్ణు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రభాస్ ఎంట్రీ సినిమాకు భారీ బూస్ట్ ఇచ్చి, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కథనం నెమ్మదిగా మొదలైనా, తర్వాత వేగం పుంజుకొని క్లైమాక్స్ వరకు లాక్కెళ్తుంది. భక్తి, డ్రామా, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories