బాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?

Boycott Bollywood Trending on Social Media
x

బాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?

Highlights

Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ ఇదే.

Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ ఇదే. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీటౌన్‌ను బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాంగ్ మరింత టెన్షన్ పెడుతోంది. ఆమీర్ లాల్‌సింగ్ చడ్డా దగ్గర నుంచి అక్షయ్ రక్షాబంధన్, షారుఖ్ పఠాన్.. ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా రోజుకో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఇంతకూ, బాలీవుడ్‌ బడా హీరోలపై ఈ రేంజ్ వ్యతిరేకత ఎందుకొస్తుంది..? సౌత్ సినిమాలను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేయడం వెనుక అసలు లెక్కలేంటి?

బాలీవుడ్‌కు అసలేమైంది..? బీటౌన్ బడా ప్రొడ్యూసర్ల నుంచి హీరోల వరకూ.. కామన్ ఆడియన్ నుంచి టాప్ రివ్యూయర్ల వరకూ అందరినీ వేధిస్తున్న ప్రశ్నే ఇది. మినిమమ్ గ్యారెంటీ హీరోలు, ఫ్లాప్ హిస్టరీనే లేని డైరెక్టర్లు, రికార్డు కలెక్షన్ల చరిత్ర ఉన్న ప్రొడ్యూసర్లు ఇలా ఒకప్పుడు విన్నింగ్ ఫార్ములాకు కేరాఫ్ అడ్రస్ అయిన బీటౌన్ బడా బాబులందరికీ కంటిమీద కునుకులేని టైం అంటూ ఉంటే అది ఇదే. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు విజయం మొహం చాటేసిన వేళ.. మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశం బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్. ఈ స్థాయి వ్యతిరేకతను హిస్టరీలోనే ఫస్ట్ టైం బాలీవుడ్ ఫేస్ చేస్తోంది. ఓ వైపు సౌత్ సినిమాలు ఇంటర్‌నేషనల్ స్థాయిలో రికార్డుల మొత మోగిస్తూ దూసుకు వెళుతుంటే.. మరోవైపు, వందల కోట్ల పెట్టుబడులు, తిరుగులేని ఇమేజ్ ఉన్న టాప్ హీరోలతో హిట్ పక్కా అనుకున్న సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బొక్కబోర్లా పడుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో అసలేం జరుగుతుందన్న ప్రశ్న కూడా ట్రెండ్ అవుతూ పోతోంది.

బాహుబలి టు త్రిబుల్ ఆర్.. బాలీవుడ్ హిట్ అండ్ ఫ్లాప్‌ల మధ్య కాలం ఇదే. బాహుబలి బిగినింగ్ నుంచి రీసెంట్ త్రిబుల్ ఆర్ వరకూ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తుక్కు రేగ్గొట్టిన సినిమాలన్నీ సౌత్‌ నుంచి వెళ్లినవే. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్, విక్రమ్, రాకెట్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఓ దశలో తమ ఇండస్ట్రీలో సౌత్ డామినేషన్‌పై బీటౌన్ టాప్ హీరోలే బహిరంగ కామెంట్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు. కంటెంట్‌లో దమ్ముంటే యాక్టింగ్ ఉండదు నటన ఉంటే కంటెంట్ ఉండదంటూ హిందీ బెల్ట్ ఆడియన్సే సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది. అయితే, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సినిమా విషయంలో సౌత్, నార్త్ అనేభావన ఆడియన్స్‌లో లేదు. కానీ, సౌత్ సినిమాలు మాత్రమే దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తరాది ఆడియన్స్‌లో అనూహ్య మార్పులొచ్చినట్టు కనిపిస్తోంది. తన మన అనే తేడానే లేకుండా బాలీవుడ్ హీరోలందరినీ టార్గెట్ చేస్తున్నారు. బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌తో రచ్చ రేపుతున్నారు. ఇంతకూ, బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌కు అసలు కారణాలేంటి..? సినిమాల ఫ్లాప్ రికార్డులపై బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌ ప్రభావం ఎంత..?

సిల్వర్ స్క్రీన్లపై పంచ్ డైలాగుల వరకూ ఓకే.. పబ్లిక్ ఈవెంట్స్‌లో నోరు జారితేనే సీన్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోలు ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు కారణం కూడా ఇదే. స్క్రీన్లపై ఇచ్చే హీరోయిజం బిల్డప్స్ అక్కడికే పరిమితం కావాలి తప్ప బయట కాదు. అలా బయట కూడా హీరోల్లా ఫీలయితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు కారణం గతంలో దేశంపై వాళ్లు చేసిన ప్రత్యక్ష, పరోక్ష కామెంట్లే. ఒకరేమో ఇండియా సేఫ్ కంట్రీ అంటారు.. ఇంకొకరేమో న్యూడ్ ఫొటోలంటూ రచ్చ రేపుతారు. ఇవి సరిపోవన్నట్టు వివాదాస్పద అంశాలను నెత్తికెత్తుకోవడం. ఇలాంటి అంశాలను ఓ స్థాయి వరకూ ఎవరూ పట్టించుకోకపోయినా.. ఇదిగో ఇలాంటి బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌‌లు ఎంటరయినప్పుడు మాత్రం తలో చేయీ వేసేలా చేస్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆమీర్ ఖాన్‌తో మొదలు సల్మాన్, షారుఖ్, అక్షయ్ కుమార్ ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్స్‌ ట్రిండింగ్‌లోకి వస్తున్నాయి.

2015లో ఇండియా నాట్ ఎ సేఫ్ కంట్రీ అన్న ఆమీర్ వ్యాఖ్యల రిజల్ట్ ఎలా ఉందో చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్. నిజానికి.. బాలీవుడ్‌లో ఆమీర్ అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా ఫస్ట్ డే 25 కోట్లు కలెక్షన్లు తెస్తుంది. అలాంటిది లాల్ సింగ్ చడ్డా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..? అక్షరాలా 12 కోట్లు మాత్రమే. సినిమాలో ఎంతో కొంత కంటెంట్ ఉంటే పరిస్థితుల్లో కాస్త మార్పు ఉండేవేమో కానీ, మూవీలో దమ్ము లేకపోవడానికి బాయ్‌కాట్ లాల్‌ సింగ్ చడ్డా హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవ్వడంతో డిజాస్టర్ రిజల్ట్ వచ్చిందనేది బీటౌన్ విశ్లేషకుల అంచనా. సినిమా విడుదలకు ముందే తనకు భారత్ అంటే ఎంతిష్టమో చెబుతూ.. తన సినిమాను బాయ్‌కాట్ చేయొద్దని ఆమీర్ వేడుకున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఓ దశలో ఆమీర్ ఖాన్‌ అస్సాం టూర్‌ను వాయిదా వేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విజ్ఞప్తి చేశారంటే అమీర్‌పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆమీర్ వివాదం అటుంచితే అక్షయ్ కుమార్‌ వివాదం మరో ఎత్తు గత పార్లమెంట్ ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు వినియోగంపై క్లాస్ పీకిన ఈ హీరో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో అక్షయ్ కెనడా పౌరసత్వాన్ని తెరపైకి తెచ్చి అతడి సినిమాలను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఓ దశలో భారత్‌పై తనకున్న ప్రేమను ప్రత్యేకించి చూపించాల్సిన అవసరమే లేదని.. గత కొన్నేళ్లలో భారత్‌లోనే ఉన్నా, ఇక్కడే ట్యాక్స్ కడుతున్నా అని వివరణ ఇచ్చినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇలాంటి సమయంలోనే ఇండియాస్ మోస్ట్ ఎమోషనల్ సబ్జెక్ట్ రామసేతు మూవీ తెరపైకి వచ్చింది. రామసేతు అంశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని, నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు హీరో అక్షయ్ కుమార్‌పైనా కేసు పెడతానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది తాజా రామసేతు సహా గతంలో ఉన్న వివాదాలన్నింటికీ కలిపి బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌కు యాడ్ చేశారు. ఈ ఎఫెక్ట్ రీసెంట్ రక్షాబంధన్‌పై స్పష్టంగా కనిపించగా.. విడుదలకు రెడీ అవుతున్న రామసేతును ప్రశ్నార్ధం చేసింది.

బాలీవుడ్‌పై బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే.. వివాదంలో ఉన్న హీరోలకు మద్దతుగా నిలిచిన వారిపైనా దీని ప్రభావం ఖాయం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా, ఆమీర్ లాల్ సింగ్ చడ్డాకు మద్దతుగా ట్వీట్ చేసిన హృతిక్‌‌కు సైతం ఈ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ స్ట్రోక్ ఖాయంగా కనిపిస్తోంది. హృతిక్ అప్‌కమింగ్ మూవీ విక్రమ్ వేద టార్గెట్‌గా బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ ఎంట్రీ ఇచ్చేసింది. తాము వ్యతిరేకించే హీరోని ఎలా సపోర్ట్ చేస్తావంటూ.. కొంతమంది పని కట్టకుని హృతిక్‌‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ లాంటి డిజాస్టర్లు బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంటే ఆమీర్‌కు మద్దతుగా ట్వీట్ చేసిన హృతిక్‌ను టార్గెట్ చేయడం బీటౌన్ ఫ్యూచర్‌ ఏంటో చెబుతోంది. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో బాలీవుడ్ కోలుకోవడం అటుంచితే సినిమాలు నిర్మించే ధైర్యం కూడా చేయకపోవచ్చనే విశ్లేషణలువినిపిస్తున్నాయి. మొత్తంగా.. బాయ్‌కాట్‌ను ఎవరు ట్రెండ్ చేస్తున్నారనేది పక్కన పెడితే దీని ఎఫెక్ట్‌గా మాత్రం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన బీటౌన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి ముగింపు దొరుకుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories