Top
logo

Bigg Boss 4 Telugu: అవినాష్ కి మోనాల్ ముద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న అమ్మరాజశేఖర్!

Bigg Boss 4 Telugu: అవినాష్ కి మోనాల్ ముద్దు.. కన్నీళ్లు పెట్టుకున్న అమ్మరాజశేఖర్!
X

Bigg Boss 4 Telugu Episod 52 Highlights (Images star maa promo)

Highlights

Bigg Boss 4 Telugu: అమ్మ రాజశేఖర్ తనను నామినేట్ చేశారని ఏడుస్తుంటే.. ఉప్పు నిప్పుల్లా మారిన అఖిల్-అభిజీత్ లు అకస్మాత్తుగా స్నేహితులు అయిపోయారు. దీంతో మోనాల్ అవినాష్ కు ముద్దు పెట్టి కొత్త స్నేహం ప్రారంభించింది. మరి బిగ్ బాస్ హౌస్ అంటే అంతే!

కంటెస్టెంట్లు కలిసిపోయేలా బిగ్‌బాస్‌ ప్లాన్‌ చేస్తాడు. మళ్లీ వారిని విడదీసేందుకు పథకాలు రచిస్తాడు. స్నేహితుల మధ్య చిచ్చు పెడతాడు. అలాగే బద్ద శత్రువుల మధ్య స్నేహం చిగురించేలా చేస్తాడు. ఇలా హౌస్‌లో జరిగే అన్నింటికి కర్త, కర్మ, క్రియ బిగ్‌బాసే. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా..? తూర్పు పడమరలా ఉండే అభిజిత్‌, అఖిల్‌ ఈ మధ్య కలిసి మాట్లాడుకుంటున్నారు. కొన్ని విషయాలపై కూర్చుని మరీ క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్‌ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు హౌస్‌మేట్స్‌.

ఈ మధ్య కొత్తగా అమ్మరాజశేఖర్‌ గొడవ పడటం, కన్నీళ్లు పెట్టుకోవడం మామూలైపోయింది. అవును తనను నామినేట్‌ చేసినందుకు మాస్టర్‌ ఏడుస్తూ సోహైల్‌కు కోపం వచ్చేలా ప్రవర్తించాడు. అటు అవినాష్‌కు మోనాల్‌ ముద్దు పెట్టడంతో అసలైన A ఎవరో తనకూ కూడా అర్థమయ్యిందని అఖిల్‌ చెప్పుకొచ్చాడు. అభిజిత్‌తో మాట్లాడి అన్నింటినీ క్లియర్‌ చేస్కో అని అఖిల్‌ మోనాల్‌కు సూచించాడు. అయితే మోనాల్‌ బాధలో ఉండటంతో అఖిల్‌యే పోనీ నేను మాట్లాడనా అని మోనాల్‌తో అనుమతి తీసుకుని అభిజిత్‌ దగ్గరకు వెళ్లాడు అఖిల్. ఇక ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్‌ అభిజిత్‌కు సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు.

సోహైల్‌ నామినేట్‌ చేసినందుకు మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మాస్టర్‌ చేయెత్తి సైగలు చేయడం వల్లే తనను నామినేట్‌ చేశానని సోహైల్‌ స్పష్టం చేశాడు. అయినా సరే మాస్టర్‌ అర్థం చేసుకోకపోవడంతో సోహైల్‌ ఫ్రస్టేట్‌ అయ్యాడు. తర్వాతి వారం నామినేషన్‌ కోసం ఇప్పటినుంచే తనతో గొడవలు పెట్టుకోండని హౌస్‌మేట్స్‌కు తెలియజేశాడు సోహైల్‌. గార్డెన్‌ ఏరియాలో ఒకచోట అఖిల్‌-మోనాల్‌, మరోచోట అరియానా-అవినాష్‌ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అయితే మోనాల్‌ను చూసిన అవినాష్‌ ఆమెకు ఐ హేట్‌ యూ చెప్పగా అతడిని కూల్‌ చేసేందుకు అమె పరుగెత్తుకుంటూ వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. దీంతో షాకైన అవినాష్‌ నా పొలంలో మొలకలొచ్చాయ్‌ అంటూ సంతోషంతో ఎగిరి గంతేశాడు. అసలైన A అవినాష్‌ అని అర్థమైందంటూ సంబరపడిపోయాడు.

గతం గత: అనే మాట వినే ఉంటారు. ఇది దేనికైనా వర్తిస్తుందేమో కానీ బిగ్‌బాస్‌కు వర్తించదు. ఎందుకంటే సీజన్లు మారినా టాస్కులు మాత్రం పాతవే కనిపిస్తాయి. అందులో భాగంగానే 'బీబీ డేకేర్‌' టాస్కును ఇంటిసభ్యులతో ఆడించాడు బిగ్‌బాస్‌. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు అంటూ అఖిల్‌, మోహబూబ్‌ను నోయల్‌ నామినేట్‌ చేశాడని అతనితోనే చర్చించాడు. ఇది విన్న మోనాల్‌ అఖిల్‌ దగ్గరకు వెళ్లి నీ గురించి సోహైల్ మాట్లాడుతున్నాడని చెప్పడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో తానేమీ మాట్లాడలేదని సోహైల్‌ అఖిల్‌కు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇక్కడి విషయాలు అక్కడ చెప్పొద్దని చెప్పినా ఎందుకు ఇలానే చేస్తున్నావ్‌ అని మోనాల్‌ను నిలదీశాడు సోహైల్‌.

51వ రోజు హౌస్‌లో 'స్వాతి ముత్యం' సినిమాలోని 'చిన్నారి పొన్నారి కిట్టయ్య' సాంగ్‌ ప్లేచేశారు బిగ్‌బాస్‌. ఇక ఇంటిసభ‌్యులైన మాస్టర్‌, అరియానా, మోహబూబ్‌, లాస్య, సోహైల్‌ గార్డెన్‌ ఏరియాలో తమదైన శైలిలో కాలు కదిపారు. బిగ్‌బాస్‌ 'బీబీ డేకేర్‌' అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా అరియానా, అవినాష్‌, మోహబూబ్‌తోపాటు హారిక, అమ్మరాజశేఖర్‌ చంటిపిల్లలుగా మారిపోయారు. అవినాష్‌కి నోయల్‌, అరియానాకు సోహైల్‌, మెహబూబ్‌కి అఖిల్‌, హారికకు మోనాల్‌, అమ్మ రాజశేఖర్‌కు అభిజిత్‌ కేర్‌ టేకర్లుగా వ్యవహరించారు. లాస్య సంచాలకురాలిగా వ్యవహరించింది.

'బీబీ డేకేర్‌' టాస్క్‌లో చిన్నపిల్లల్లా మారిపోయిన కంటెస్టెంట్లు రాక్షసులుగా అనిపించారు. ఎందుకంటే కేర్‌ టేకర్లకు అంతలా నరకం చూపించారు మరీ. అటు నామినేట్‌ చేసిన సోహైల్‌కు అరియానా పట్టపగలే చుక్కలు చూపించింది. కొంటె హారిక కూడా కేర్‌ టేకర్లను నానా రకాలుగా టార్చర్‌ పెట్టింది. టాస్క్‌ ప్రారంభంకాగానే అరియానా, అవినాష్‌, మోహబూబ్‌తోపాటు హారిక, అమ్మరాజశేఖర్‌ చంటిపిల్లలుగా మారిపోయారు. మెహబూబ్‌ కోరిక మేరకు పదేపదే అఖిల్‌ అతడిని ఎత్తుకుని తిప్పాడు. అరియానా సోహైల్‌ మీద ఎక్కి చల్‌చల్‌ గుర్రం ఆడుకుంది. ఇక తోటి చంటోడైన మాస్టర్‌ను హారిక రాచిరంపాన పెట్టింది.

అటు సోహైల్‌ తనను నాన్న అని పిలవద్దని ఎంత మొత్తుకున్నా సరే అరియానా అతడిని పదేపదే నాన్న అని పిలుస్తూ అమ్మెక్కడ అని ప్రశ్నలు కురిపించింది. తర్వాత ఆమెను సోహైల్‌ భుజాలపై ఎత్తుకుని ఊరేగించాడు. ఆమె మాత్రం ముఖానికి రంగు పూస్తూ తలపై నారింజ పొట్టు వేసి నానా రకాలుగా టార్చర్‌ పెట్టింది. ఇక టాస్క్‌లో పిల్లలు పిడుగుల్లా మారిపోయి ఆ తర్వాత రాక్షసుల్లా అవతరించారు. ఏడుపు సౌండ్‌ వినిపిండచడంతో కేర్ టేకర్లు పిల్లలందరికీ డైపర్లు వేశారు. తర్వాత క్లాసులో ఏబీసీడీలు నేర్పుతున్న సోహైల్‌ణు పిల్లలు తిక్క ప్రశ్నలతో విసిగించారు. మాస్టర్‌ హారిక చాక్లెట్లు కొట్టేశాడు. తర్వాత ఆమె కోపంతో అరియానా పెన్సిల్‌ కొట్టేయడంతో ఇద్దరూ తలబడ్డారు. చివరకు అరియానా తన పెన్సిల్‌ను తాను దక్కించుకుంది.

మొత్తానికి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులతో రకరకాల ఆటలాడిస్తున్నాడు. నటింప జేయిస్తున్నాడు. నవ్వించడం చూపించి ఎమోషన్స్‌ బయటపడనీయకుండా దాచేయిస్తున్నాడు. ఏదీ ఏమైనా ఇల్లు పీకి పందిరేస్తున్న పిల్లలు కేర్‌ టేకర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా చేయిస్తున్నాడు.

Web TitleBigg boss 4 Telugu episode 52 October 27th highlights Monal kiss to Jabardath Avinash Amma Rajashekhar emotion over the nomination
Next Story