'మా'లో మంటలు!

మాలో మంటలు!
x
chiranjeevi with rajasekhar in maa meeting (file photo)
Highlights

'మా'లో మేము.. 'మా'లో అందరమూ.. ఇలా 'మా' అంటూ ముడివేసుకుని మాట్లాదతారు మన సినిమా ఆర్టిస్టులు అందరూ. పైకి ఎంత 'మా' లోకంలా కనిపించినా, లోపల అంత పిచ్చ...

'మా'లో మేము.. 'మా'లో అందరమూ.. ఇలా 'మా' అంటూ ముడివేసుకుని మాట్లాదతారు మన సినిమా ఆర్టిస్టులు అందరూ. పైకి ఎంత 'మా' లోకంలా కనిపించినా, లోపల అంత పిచ్చ 'మా' లోకంలా ఉంటుంది. ప్రకృతి సమస్యలకు ఒక్కటవుతారు.. నిధులు సమకూర్చడంలో.. కలిసి ఆడిపాడతారు. కానీ, సమావేశం అంటూ మొదలెట్టారా 'మా' లొల్లి ఇంతే అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి. ఇదంతా 'మా' అనబడే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గురించి పదే పదే చెప్పుకోవాల్సి వస్తున్న సంగతులు.

ఎప్పటిలానే 'మా' సమావేశం మొదలైంది. ఈ కొత్త సంవత్సరంలో డైరీ విడుదల కార్యక్రమం అది. మహామహులు అనబడే వారంతా సమావేశానికి వచ్చేశారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, పరచూరి వెంకటేశ్వరరావు, జయసుధ ఇలా అందరూ వచ్చారు.

హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా, మూవీఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చిరంజీవి, సినిమా అసోసియేషన్ ఓ కన్‌స్ట్రక్టివ్‌గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, మైకులో చెప్పాలని, గొడవలు వస్తే చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. తామంతా ఓ కుటుంబం వంటి వాళ్లమేనని అన్నారు. త్వరలోనే విదేశాల్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందరు హీరోలనూ పిలిపించి, ఓ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి నిధిని పెంచుదామని సూచించారు. విభేదాలు వస్తే, బయట పడకుండా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.

ఆపై పరుచూరి వెంకటేశ్వరరావు నుంచి మైక్‌ను అందుకున్న హీరో రాజశేఖర్, నిప్పును ఎంతగా దాచాలని ప్రయత్నించినా, పొగ రాకుండా మానదని వ్యాఖ్యానించడంతో వేదికపై రభస మొదలైంది. రాజశేఖర్‌ను వారించే ప్రయత్నాన్ని చిరంజీవి చేశారు. ఆ సమయంలో రాజశేఖర్, చిరంజీవిని ఉద్దేశించి, మీరు మాట్లాడేటప్పుడు తాను కల్పించుకోలేదని, ఇప్పుడు మీరూ కల్పించుకోవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరు అరిచేస్తే ఏదీ జరిగిపోదని.... తాను చెప్పేది దయచేసి వినండన్నారు రాజశేఖర్‌.

ఈ సమయంలో జయసుధ స్టేజ్ పైకి వచ్చి, రాజశేఖర్ చేతిలోని మైక్ ను తీసుకునేందుకు ప్రయత్నించారు. మోహన్ బాబు స్టేజ్ దిగి వెళ్లిపోయేందుకు లేచారు. తన ప్రసంగాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్న రాజశేఖర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఏదీ కరెక్ట్‌గా జరగడం లేదని, తాను సత్యంగా బతకాలని అనుకుంటున్నానని, నిజాన్ని చెబుతున్నానని వ్యాఖ్యానించడంతో మరింత కలకలం రేగింది. ఏదైనా ఇంతకుముందే అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వుండాల్సిందని, తానేమీ చిన్న పిల్లాడిని కాదని, ఏ విషయాన్ని అయినా కప్పి పుచ్చాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

తాను చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి ఆవేదనను వ్యక్తం చేశారు. రాజశేఖర్ విమర్శల తరువాత, మరోసారి మైక్ తీసుకున్న ఆయన, తాను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదన్నారు. పెద్దలుగా తామంతా ఎందుకు ఉండాలని..? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడంగా ఉంటుందన్నారు చిరంజీవి.

ఎంతో సజావుగా, హుందాగా సాగుతున్న సభలో మైక్ లాక్కుని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా, లాక్కుని చేయడం మర్యాద కాదని హితవు పలికారు. ఇప్పుడు కూడా తాను కోపంతో మాట్లాడే వాడిని కాదని, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా, తనకు కోపం వచ్చేలా చేశారని చిరంజీవి వ్యాఖ్యానించారు. దయచేసి, ఇక ఆపేసి, మంచిని గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఎవరూ కోపావేశాలకు వెళ్లవద్దని, ఫ్యూచర్ ఎయిమ్ గురించి మాట్లాడుకుందామని అన్నారు.

మొత్తమ్మీద మా ఎప్పుడు మీటింగ్ పెట్టినా.. ఏదైనా గొడవ జరుగుతుందా..? అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories