తమిళ నాట మరో నటుడు రాజకీయాల వైపు..

Tamilnadu Politics: తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారనే వార్తా ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Arun Chilukuri
Published on: 24 Oct 2020 2:00 PM IST
తమిళ నాట మరో నటుడు రాజకీయాల వైపు..
X

దక్షిణాదిన సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పెయాలనుకోవడం చాలా మామూలు విషయంగా మారిపోయింది. రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళిన సినీ నటులు తక్కువగా ఉన్నా.. ఎవరికీ వారు తమ అభిమాన బలాన్ని నమ్ముకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉబలాట పడిపోతుంటారు. ఈ ధోరణి తమిళ సినిమా రంగంలో మరీ ఎక్కువ. ఇప్పుడు మరో యువ నటుడు రాజకీయాల్లో ఎంట్రీ కోసం తహ తహ లాడుతున్నట్టు తెలుస్తోంది.

హీరోల పొలిటికల్ ఎంట్రీ ఫలితాలు ఎలా ఉన్నా అంచనాలు మాత్రం ఏ పూటకాపూట పెరిగిపోతున్నాయి. తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళపతి విజయ్‌ తన అభిమాన సంఘం కీలక నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో విజయ్ అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది.

విజయ్ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తిరుచ్చి, మధురైలలో కాబోయే సీఎం విజయ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. తమిళనాట కళైంజర్ తర్వాత నువ్వే అంటూ విజయ్‌ను ఆకాశానికెత్తే పోస్టర్లు అంటించారు. అప్పట్లో ఇదో పొలిటికల్ దుమారం రేపింది.

ఇప్పుడు విజయ్ తన అభిమాన సంఘాల నాయకులతో భేటీ కావడంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీలో పోస్టర్ల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ పోస్టర్లు, ప్రకటనల జోలికి వెళ్ళొద్దని అభిమానులకు విజయ్‌ సూచించినట్టు సమాచారం. పొలిటికల్‌ ఎంట్రీపై అభిమానులతో చర్చించిన తర్వాతే ప్రకటన ఉంటుందని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story