Nilakanta Movie Review: నీలకంఠ’ మూవీ రివ్యూ.. “ఇష్టాన్ని దూరం చేసిన శిక్ష… గెలుపుగా మారిన పోరాటం”

Nilakanta Movie Review: మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి మరియు నేహా పఠాన్ హీరోయిన్లుగా, స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో మెరవగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నీలకంఠ’.
Nilakanta Movie Review: మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి మరియు నేహా పఠాన్ హీరోయిన్లుగా, స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో మెరవగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని L S ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. అనిల్ ఇనుమడుగు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
ఈ చిత్రంలో రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, అకాండ శివ, భరత్ రెడ్డి తదితర సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా చాల సంవత్సరాల తర్వాత స్నేహా ఉల్లాల్ ఒక ప్రత్యేక పాటలో కనిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జనవరి 2, 2026న గ్రాండ్‌గా విడుదలకానున్న ఈ సినిమాకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ నిర్వహించారు. మరి ఆడియన్స్‌ని ‘నీలకంఠ’ ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.
కథ :
‘నీలకంఠ’ ఒక పీరియాడిక్ రూరల్ డ్రామా. సరస్వతిపురం అనే గ్రామంలో కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరు తప్పు చేసినా గ్రామ పెద్ద రాఘవయ్య (రాంకీ) కఠినమైన శిక్షలు విధిస్తాడు.
అదే ఊరిలో టైలర్ వృత్తి చేసుకునే నాగభూషణం (కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్) చదువులో మంచి ప్రతిభ కలవాడు. కానీ 10వ తరగతి చదువుతున్న సమయంలో చేసిన ఒక తప్పు కారణంగా, అతడికి 15 సంవత్సరాలు ఊరు దాటకుండా ఉండాలని, ఇక చదువుకు అవకాశం లేదని శిక్ష విధిస్తారు.
నీలకంఠకు 10వ తరగతిలో చదువుతున్నప్పుడు సీత (యాశ్న ముత్తులూరి)పై ప్రేమ కలుగుతుంది. ఆమె ఊరి సర్పంచ్ (బబ్లూ పృథ్వీ) కూతురు. సీత ఉన్నత చదువుల కోసం ఊరు విడిచి వెళ్తుంది. చిన్న వయసులోనే తల్లి వద్ద “బాగా చదివి ఊరికి పేరు తెస్తా” అని మాట ఇచ్చిన నీలకంఠ, ఆ మాట నిలబెట్టుకోలేకపోయాననే బాధలో మునిగిపోతాడు.
సరస్వతిపురంలో కబడ్డీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. చదువు దూరమైనా, నీలకంఠ కబడ్డీ ఆటలో తన ప్రతిభను చూపిస్తాడు. ఊరిలో జరిగే ప్రతి కబడ్డీ పోటీలో గెలిచినా, ఊరు దాటే అనుమతి లేకపోవడంతో మండల స్థాయి పోటీల్లో పాల్గొనలేడు. నీలకంఠ లేకుండా సరస్వతిపురం జట్టు ఎప్పుడూ మండల స్థాయిలో ఓడిపోతూ ఉంటుంది.
15 సంవత్సరాల తర్వాత సీత ఊరికి తిరిగి రావడం, మళ్లీ నీలకంఠను కలవడం కథలో కీలక మలుపు. ఇది చూసిన సర్పంచ్ సీతకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. దీనికి నీలకంఠ అడ్డుపడి, “మీరు గౌరవంగా భావించే సర్పంచ్ పదవికే నేను పోటీ చేసి గెలిచి, సీతను పెళ్లి చేసుకుంటా” అని ఛాలెంజ్ చేస్తాడు.
ఒక దొంగగా చూసిన గ్రామ ప్రజలు నీలకంఠను సర్పంచ్‌గా గెలిపిస్తారా? సరస్వతిపురం జట్టును మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఎలా గెలిపించాడు? తల్లికి ఇచ్చిన మాటను నీలకంఠ ఎలా నిలబెట్టుకున్నాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
ఈ సినిమాకు కోర్ పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు గ్రామం నుంచి వెలివేయడం అనే శిక్షను చూశాం కానీ, ఈ కథలో ఊర్లోనే ఉంచి అతడికి ఇష్టమైనది దూరం చేయడం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కథ ప్రారంభమైన పది నిమిషాల్లోనే ఈ పాయింట్ స్పష్టంగా అర్థమవుతుంది.
గ్రామ ప్రజలు ఎంత ప్రేమగా ఉంటారో, అంతే కఠినంగా కూడా ఉంటారనే విషయాన్ని దర్శకుడు బాగా చూపించారు. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే వల్ల తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నిరంతరం ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా సహజంగా సాగుతాయి.
ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎమోషనల్ జర్నీ, లవ్ ఎపిసోడ్, మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంటర్వెల్‌ను ఆసక్తికరమైన సస్పెన్స్‌తో ముగిస్తారు. సెకండ్ హాఫ్ చాలా రేసీగా సాగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో కబడ్డీ మ్యాచ్‌ల చిత్రీకరణ బాగా ఆకట్టుకుంటుంది. చివరి 30 నిమిషాల్లో కథకు సరైన పే ఆఫ్స్ ఇస్తూ, కథ యొక్క అసలు ఉద్దేశాన్ని కొత్తగా ఆవిష్కరించారు.
నటీనటులు & సాంకేతిక విభాగం:
మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటంతో పాటు, క్యారెక్టర్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్‌లో ఎఫర్ట్ కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో అనుభవజ్ఞుడైన నటుడిలా కనిపించాడు.
యాశ్న ముత్తులూరి సీత పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకుంది. స్నేహా ఉల్లాల్ ప్రత్యేక పాటలో గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాంకీని చాల రోజుల తర్వాత తెరపై చూడటం సంతోషాన్ని కలిగించింది. మిగతా నటీనటులందరూ సహజమైన నటనతో గ్రామ వాతావరణాన్ని నిజంగా మన ముందు నిలిపారు.
రచయితగా, దర్శకుడిగా రాకేష్ మాధవన్ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్పష్టంగా ఆడియన్స్‌కి చేరవేశారు. డైలాగ్స్ బాగా వర్క్ అయ్యాయి. కొత్త దర్శకుడిగా ఇంత పెద్ద తారాగణాన్ని హ్యాండిల్ చేసిన విధానం ప్రశంసనీయం.
శ్రవణ్ జి కుమార్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ప్యాటర్న్ రిఫ్రెషింగ్‌గా ఉంది. మార్క్ ప్రశాంత్ సంగీతం వింటేజ్ ఫీలింగ్ ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటల లిరిక్స్ అనిల్ ఇనుమడుగు, కృష్ణ గారు రాయగా, అవి కూడా పాతకాలపు మాధుర్యాన్ని గుర్తు చేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ నాని పండు, సతీష్ రియలిస్టిక్‌గా చేశారు. ఫైట్స్‌ను రవి గారు సమర్థవంతంగా కంపోజ్ చేశారు. కొత్త నిర్మాతలైనా మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ ఒక మంచి కమర్షియల్ సినిమాను అందించడంలో విజయం సాధించారు.
ఫైనల్‌గా:
‘నీలకంఠ’ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన కంటెంట్ ఉన్న సినిమా. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది.
రేటింగ్: 3/5

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



