Dasara Review: 'దసరా'మూవీ రివ్యూ.. నాని కొట్టేశాడు..

Nani Dasara Movie Review in Telugu
x

Dasara Review: నాని ‘దసరా’మూవీ రివ్యూ.. నాని కొట్టేశాడు..

Highlights

Dasara Review: నాని 'దసరా'మూవీ రివ్యూ.. నాని కొట్టేశాడు..

చిత్రం: దసరా

నటీనటులు: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సి, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్

విడుదల తేది: 30/03/2023

గత కొంతకాలంగా న్యాచురల్ స్టార్ నాని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నాని ఎప్పుడూ కనిపించనటువంటి ఒక విభిన్న రా మరియు రస్టిక్ పాత్రలో కనిపించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక అభిమానుల ఎదురు చూపులకు తెరపడుతూ ఈ చిత్రం ఇవాళ అనగా మార్చి 30, 2023 న థియేటర్లలో భారీగా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా తెలుగు లో మాత్రమే కాక తమిళ్, కన్నడ, హిందీ, మరియు మలయాళం భాషల్లో కూడా విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో చూసేద్దామా..

కథ:

సినిమా తెలంగాణలోని వీర్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్), మరియు సూరి (దీక్షిత్ శెట్టి) లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ధరణి వెన్నెల ని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ వెన్నెల సూరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వీర్లపల్లి లోని జనాల జీవితం సిల్క్ బార్ మరియు బొగ్గు మైనింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో లోకల్ రాజకీయాల వల్ల ధరణి జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? దానివల్ల ధరణి జీవితం ఎలా మారింది? వెన్నెల ధరణి ని తిరిగి ప్రేమించిందా? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

నాని ఈ సినిమాకి వెన్నెముకగా చెప్పుకోవచ్చు. మొదటినుంచి ఆఖరి దాకా నాని తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. రస్టిక్ పాత్ర అయినప్పటికీ నాని తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నాని నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించింది. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన బాగానే అనిపించింది. నానితో తన కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. దీక్షిత్ శెట్టి కూడా చాలా బాగా నటించారు. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. తన పాత్రలో బాగానే నటించారు. ఝాన్సీ కూడా ఈ సినిమాలో బాగానే నటించారు. సాయికుమార్ నటన కూడా బాగానే అనిపిస్తుంది. సముద్రఖని బాగానే నటించినప్పటికీ సినిమాలో ఆయన పాత్ర కనిపించింది తక్కువ అని చెప్పుకోవాలి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తన పనితనాన్ని చూపించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ మొదటి సినిమాకే ఇలాంటి రస్టిక్ కథను ఎంచుకున్నారు కానీ దానిని చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. కథ నెరేషన్ కొంచెం స్లో గా అనిపించినప్పటికీ శ్రీకాంత్ ప్రేక్షకులను కథ తో బాగానే కట్టిపడేసారు. మొదటి సినిమాతోనే అదరగొట్టిన శ్రీకాంత్ కు టాలీవుడ్ లో మరొక పెద్ద డైరెక్టర్ అయ్యే స్కోప్ ఎక్కువగానే కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో విజువల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో సన్నివేశాలను మినహాయిస్తే ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. పాటలతో బాగానే మెప్పించిన సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం తో కూడా బాగానే అలరించారు. అయితే కొన్ని ఎలివేషన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఇంకొంచెం బాగుండి ఉండొచ్చు అనిపిస్తుంది.

బలాలు:

నాని

ఇంటర్వెల్

క్లైమాక్స్

ఎమోషనల్ సన్నివేశాలు

సినిమాటోగ్రఫీ

బలహీనతలు:

ప్రెడిక్టబుల్ కథ

స్లో సన్నివేశాలు

చివరి మాట:

దసరా సినిమా కథ మొత్తం ధరణి, వెన్నెల మరియు సూరి పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారి స్నేహంతో మొదలైన కథ లోకి ప్రేమ మరియు రాజకీయాలు ఎంటర్ అవుతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకులకు బోరు కొట్టించకుండా ప్రతి సన్నివేశం చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. పొలిటికల్ డ్రామా ని కూడా చాలా బాగా చూపించారు. ఇంటర్వల్ లో వచ్చే పెద్ద ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని స్లో సన్నివేశాలు ప్రేక్షకులకు బోరు కొట్టించొచ్చు. కానీ నాని తన నటన తో బాగానే నడిపించారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది. క్లైమాక్స్ ని కూడా చాలా థ్రిల్లింగ్ గా డిజైన్ చేశారు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ కథ మరియు కొన్ని స్లో సన్నివేశాలు ఉన్నప్పటికీ రా మరియు రస్టిక్ డ్రామా సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.

బాటమ్ లైన్:

దస"రా" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల అద్భుతమైన విలేజ్ డ్రామా.

Show Full Article
Print Article
Next Story
More Stories