Mr Pregnant Movie Review: అమ్మతనం గొప్పను చెప్పే ఎమోషనల్ మూవీ..

Mr Pregnant Review
x

Mr Pregnant Review: అమ్మతనం గొప్పను చెప్పే ఎమోషనల్ మూవీ..

Highlights

Mr Pregnant Review: అమ్మతనం గొప్పను చెప్పే ఎమోషనల్ మూవీ..

Mr.Pregnant Telugu Movie Review

నటీ నటులు: సయ్యద్ సొహైల్ ర్యాన్, రూపా కొడువాయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్ తదితరులు

రచన, దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

నిర్మాతలు: అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల

సినిమాటోగ్రఫి: నిజార్ షఫీ

సంగీతం: శ్రావణ్ భరద్వాజ్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: గాంధీ నడికుడికర్

బ్యానర్: మైక్ మూవీస్

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గౌతమ్ (సయ్యద్ సోహైల్) అనాథగా పెరుగుతాడు. టాటూ ఆర్టిస్టుగా పనిచేస్తూ తనకు నచ్చినట్టుగా జీవించే గౌతమ్ జీవితంలోకి మహీ (రూపా కొడువాయుర్) ప్రవేశిస్తుంది. మొదటి మహీ ప్రేమను గౌతమ్ రిజెక్ట్ చేస్తాడు. అయినా మహీ పట్టు వదలకుండా గౌతమ్‌ను వెంటపడుతుంది. కొన్ని షరతులు పెట్టి మహి ప్రేమను గౌతమ్ అంగీకరిస్తాడు. కానీ కూతురు మహి ప్రేమను ఆమె తండ్రి (రాజా రవీంద్ర) వ్యతిరేకిస్తాడు. దాంతో తల్లిదండ్రులను ఎదురించి గౌతమ్‌ ను పెళ్ళీ చేసుకుంటుంది. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్బవతి కావడంతో మహినీ దూరంగా పెడుతాడు. ఆ తర్వాత మనసు మార్చుకొని ఆమె గర్బాన్ని తన కడుపులో పెంచుకోవడానికి గౌతమ్ నిర్ణయం తీసుకొంటాడు. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకొన్న ప్రభావం గౌతమ్‌పై ఎంత మేరకు ఉంది? మహీ ప్రేమను గౌతమ్ ఎందుకు నిరాకరించాడు? ఎలాంటి కండీషన్స్ పెట్టి మహీ ప్రేమను గౌతమ్ అంగీకరించాడు? ప్రేమ విషయంలో గౌతమ్ ప్రేమను మహీ తండ్రి ఎందుకు నిరాకరించాడు? మహీ గర్బవతి కావడంతో గౌతమ్ ఎందుకు మనస్తాపం చెందుతాడు? ప్రకృతికి విరుద్ధంగా భార్య మహీ గర్బాన్ని గౌతమ్ ఎందుకు మోయాలనుకొన్నాడు? గౌతమ్ గర్బాన్ని మోసే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? సమాజం పెట్టిన ఇబ్బందులను గౌతమ్ ఎలా ఎదురించాడు అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కథ

ఊహించని విధంగా మిస్టర్ ప్రెగ్నెంట్‌ తో సోహెల్ హిట్ కొట్టాడా అంటే! దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి ఎంచుకొన్న పాయింట్, దానిని కథగా విస్తరించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో రొటీన్, రెగ్యులర్ సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఆటో సీన్ కథలోకి వచ్చిన తర్వాత సినిమా పరుగులు పెట్టేలా చేసింది. భావోద్వేగమైన అంశాలు, ఫ్లాష్ బ్యాక్‌ సన్నివేశాలను దర్శకుడు ఎమోషనల్‌గా రాసుకొన్న తీరు ఆకట్టుకొనేలా చేసింది. ఇక సెకండాఫ్‌లో కథను ఎలా నడిపిస్తాడో అనే సందేహాలున్న ప్రేక్షకులకు మంచి వినోదంతో కడుపుబ్బ నవ్వించి తీరు స్క్రిప్టుపై ఆయనకు ఉన్న గ్రిప్ తెలియజేసింది. కచ్చా బాదమ్ ఎపిసోడ్‌‌లో బ్రహ్మాజీ, అభిషేక్ అదరగొట్టారు. గౌతమ్ గర్బంతో ఉన్న సీన్లు, కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో ఉండే కాంప్లికేషన్స్ చక్కగా రాసుకొన్నాడు. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా సోహైల్ ఆ పాత్రలో పోషించాడు. దాంతో సినిమా మరింత ఎమోషనల్‌గా కనిపిస్తుంది. కాకపోతే విలన్‌ను చివరిలో తెచ్చి కథను మళ్లీ రొటీన్ చేసే ప్రయత్నం చేసినా.. ఆ చిన్న లోపాన్ని సోహైల్ తన ఫెర్ఫార్మెన్స్‌తో కనిపించకుండా చేశారు.

సోహైల్ ర్యాన్ ఎమోషనల్ ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సయ్యద్ సోహైల్ ర్యాన్ గత రెండు, మూడు సినిమాల్లో ఫెర్ఫార్మెన్స్ విషయంలో కథల ఎంపికలో కాస్త తడబాటు కనిపించింది. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో మాత్రం ఫుల్ మెచ్యురిటీతో గౌతమ్ పాత్రలో అదరగొట్టాడు. 9 నెలలపాటు గర్బాన్ని మోసే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఓ సన్నివేశంలో నేను చనిపోతే.. నాకు పుట్టే బిడ్డకు నా తల్లి పేరు పెట్టండి అంటూ చెప్పిన డైలాగ్‌తో కంటతడి పెట్టించేంతగా నటించాడు. సెకండాఫ్‌ సినిమా భారాన్నంతా సోహైల్ తన మీద వేసుకొని సినిమాను నడిపించిన విధానం బాగుంది. మాస్, క్లాస్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మహీ పాత్రలో మరోసారి రూపా కొడువాయుర్ తన ప్రతిభతో ఆకట్టుకొన్నారు. అందం, అభినయాన్ని బ్యాలెన్స్ చేసి మంచి మార్కులే కొట్టేసిందని చెప్పాలి. ఇక సుహాసిని ఓ డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో కనిపించడమే కాకుండా భావోద్వేగాన్ని పండించారు. వైవా హర్షా ఎమోషనల్, కామెడీ అంశాలను బ్యాలెన్స్ చేసి నటుడిగా మెప్పించే ప్రయత్నం చేశారు. బ్రహ్మాజీ, అభిషేక్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకు హైలెట్. కథ సీరియస్‌గా సమయంలో ఆ ట్రాక్ రావడంతో రిఫ్రెష్ కావడమే కాకుండా.. సినిమాను మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు. రాజా రవీంద్ర, అలీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాలు ఈ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సన్నివేశాలకు తగినట్టుగా లైటింగ్‌ను వాడుకొన్న విధానం బాగుంది. ఆర్టిస్టుల ఎమోషన్స్ చక్కగా కెమెరాలో బంధించడంలో నిజార్ షఫీ తన సత్తాను చాటుకొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. ఫస్టాఫ్ ఆరంభంలో ఎడిటింగ్ కొంత అటు ఇటుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఎక్కడ ల్యాగ్ లేకుండా సన్నివేశాలు పరుగులు పెట్టించింది. నిర్మాతలు అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఎంచుకొన్న కథ వారికి సినిమాపై ఉన్న అభురుచిని తెలియజేసింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను క్వాలిటీగా నిర్మించారని చెప్పవచ్చు.

తరతరాలుగా మనిషికి జన్మనిచ్చేది తల్లి మాత్రమే. పురిటి నొప్పులు పడుతూ బిడ్డను భూమికి వదిలే తల్లులనే ఇప్పటి వరకు చూశాం. అలాంటి మాతృమూర్తి బాధ్యతలను మగవాడు తీసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? సమాజం ఎలా స్పందిస్తుందనే అంశాలతో రూపొందిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఒక క్రిటికల్ పాయింట్‌ను తీసుకొని గౌతమ్ పాత్రను దర్శకుడు మలిచిన తీరు ఛాలెంజ్ అని చెప్పాలి. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా సినిమాకే మోసం వచ్చే పరిస్థితిలో దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, రాసుకొన్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ఆరంభంలో కొన్ని సీన్లు ఇంకా బెటర్‌గా రాసుకొని ఉంటే సినిమాకు మరింత పాజిటివ్‌గా మారి ఉండేది. ఇంకా కొంత స్క్రిప్టుపై కసరత్తు జరిగి ఉంటే ఇంకా ఎమోషన్స్ వర్కవుట్ అయి ఉండేవనిపిస్తుంది. ఓవరాల్‌గా అన్ని ఎమోషన్స్‌తోపాటు క్లీన్ కంటెంట్ ఉన్న డీసెంట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. సున్నితమైన అంశాలను ఎమోషనల్‌గా చెప్పిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సినిమా నవ్విస్తుంది.. బాధపెడుతుంది. ఎమోషనల్‌గా మార్చుతుంది. ప్రతీ ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. పక్కాగా మంచి ఫీల్ అందించే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. మాతృత్వం గొప్పతానాన్ని చెప్పే ఎమోషనల్ మూవీ.. మిస్టర్ ప్రెగ్నెంట్.

Show Full Article
Print Article
Next Story
More Stories