Lopaliki Ra Chepta Review: ‘లోప‌లికి రా చెప్తా’ - నవ్వులు పూయించిన హారర్ కామెడీ

Lopaliki Ra Chepta Review: ‘లోప‌లికి రా చెప్తా’ - నవ్వులు పూయించిన హారర్ కామెడీ
x
Highlights

Lopaliki Ra Chepta Review: కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘లోప‌లికి రా చెప్తా’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.

Lopaliki Ra Chepta Review: కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘లోప‌లికి రా చెప్తా’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. హారర్, కామెడీ అంశాలను కలిపి తీసిన ఈ సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది.. నవ్వించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోయిన్లుగా నటించారు.

కథలోకి వెళ్తే...

కథ ఒక డెలివరీ బాయ్‌ రామ్‌ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ (సుస్మిత ఆనాల)ల పెళ్లితో మొదలవుతుంది. వారి శోభనం రాత్రి, గదిలోకి వెళ్ళగానే ప్రియ దెయ్యంలా మారి రామ్‌ని భయపెట్టి, అతన్ని బయటకు పంపించేస్తుంది. స్నేహితుడు సలహా మేరకు రామ్ ఒక తాయత్తుతో మళ్ళీ ప్రయత్నిస్తే, రెండో రాత్రి కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో రామ్ ఒక మంత్రగాడి (వంశీ) దగ్గరకు వెళ్తాడు. మంత్రగాడు రామ్‌ని అతని గతం గురించి అడగడంతో, కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో, డెలివరీ బాయ్‌ రామ్‌కు రోడ్డుపై ఒక అమ్మాయి (సాంచిరాయ్‌) పరిచయం అవుతుంది. ఆమె నంబర్ ఇచ్చి రాత్రికి తన అపార్ట్‌మెంట్‌కి రమ్మంటుంది. రామ్ తప్పు విల్లా నంబర్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్నాని) ఎవరు? ఆమెతో రామ్‌కి సంబంధం ఏమిటి? విక్కీ (అజయ్ కార్తీక్) ఎవరు? రామ్ మొదటి రాత్రి జరగకుండా అడ్డుకుంటున్న ఆ దెయ్యం ఎవరు? దాని కోరిక ఏమిటి? చివరికి రామ్ శోభనం జరిగిందా లేదా? అనేది మిగతా కథ.

నవ్వులు పంచడంలో సక్సెస్!

దర్శకుడు, హీరో అయిన రాజేంద్ర ఈ చిన్న కథను ఫన్ జోనర్‌లో బాగా మలిచి ప్రేక్షకులను నవ్వించాడు. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని, రొమాంటిక్ కామెడీని చక్కగా మిక్స్ చేశాడు. ప్రేక్షకులను నవ్వించడమే తన లక్ష్యం అని దర్శకుడికి స్పష్టంగా తెలుసు. అందుకు తగ్గట్టే సినిమాను రూపొందించాడు. ఫస్టాఫ్ ఒక గంట పది నిమిషాలు, సెకండాఫ్ నలభై నిమిషాలతో పర్ఫెక్ట్‌గా ముగించాడు. సెకండాఫ్ లో వచ్చే "సూదిలో నా దారం" అనే పాట, సీరియస్ కథా సన్నివేశాల్లో కూడా నవ్వులు పూయించి మెప్పించింది.

నటీనటుల ప్రతిభ, టెక్నికల్ అంశాలు

హీరో, దర్శకుడైన కొండా వెంకట రాజేంద్ర సినిమా బాధ్యతను తన భుజాలపై మోశాడు. నటుడిగా అతను బాగా అలరించాడు. మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. హీరోయిన్ సుస్మిత ఆనాల అద్భుతమైన నటనను కనబరిచింది. మనీషా జష్నాని నటన పర్వాలేదనిపించింది. శుభం సినిమాలో డిష్ రాజుగా గుర్తింపు పొందిన వంశీ, ఈ సినిమాలో బ్లాక్ స్పారో పాత్రలో చాలా బాగా చేశాడు. ఎడిటింగ్ పదునుగా బాగుంది.. కథనాన్ని వేగంగా నడిపింది. నిర్మాణ విలువలు కూడా ఫర్వాలేదు. ఈగల్ సినిమా ఫేమ్ డేవ్ అందించిన మ్యూజిక్ బాగుంది. కెమెరామెన్లు రేవంత్ ,అరవింద్ లొకేషన్స్‌ను అందంగా చూపించారు.

మొత్తంగా చెప్పాలంటే, ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకులకు మంచి నవ్వులను పంచుతుంది. హారర్ కామెడీని ఇష్టపడేవారు, పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories