Moringa Leaves: పాలు తాగాలంటే చిరాకుగా అనిపిస్తుందా.. అయితే ఈ సూపర్‌ఫుడ్ ప్రయత్నించండి

If You Dont Like Drink Milk Then Try These Super Foods for Good Health
x

Moringa Leaves: పాలు తాగాలంటే చిరాకుగా అనిపిస్తుందా.. అయితే ఈ సూపర్‌ఫుడ్ ప్రయత్నించండి

Highlights

మన శరీరానికి అందాల్సిన పోషకాల్లో ప్రోటీన్‌ ముఖ్యమైనది. శరీరంలోని కణాల ఆరోగ్యానికి, పనితీరుకు దీన్ని తప్పకుండా తీసుకోవాలి.

మన శరీరానికి అందాల్సిన పోషకాల్లో ప్రోటీన్‌ ముఖ్యమైనది. శరీరంలోని కణాల ఆరోగ్యానికి, పనితీరుకు దీన్ని తప్పకుండా తీసుకోవాలి.

మన బరువులో ప్రతి కేజీకి 0.8 గ్రాముల ప్రోటీన్‌ను మనం తీసుకోవాలి. అంటే మీ బరువు 70 కేజీలు అయితే, మీరు రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

చాలా మంది ప్రోటీన్ కోసం పాలపై ఆధారపడుతుంటారు. కానీ, కొంతమంది లాక్టోస్ ఇన్‌టోలరెంట్‌గా ఉంటారు. అంటే, వీరికి పాలు సరిగా జీర్ణం కావు. అలాంటివారు మునగ ఆకును తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మునగాకులో ఏం ఉంటాయి?

మునగాకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-బీ1 (థయమిన్), విటమిన్-బీ2 (రైబోఫ్లోవిన్), విటమిన్-బీ3 (నియాసిన్), విటమిన్ బీ6, ఫోలేట్ లాంటి పోషకాలు ఉంటాయి.

మెగ్నిషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ కూడా మునగాకులో పుష్కలంగా లభిస్తాయి. ఒక స్పూన్ మునగాకు పొడిలో ఒక గ్రాము వరకు ప్రోటీన్ అందుతుంది.

మునగాకులో అమైనో అమ్లాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి.

జుట్టు చర్మానికి మంచిది..

చర్మంపై గాయాలను తగ్గించడంలో మునగ గింజల నూనె మెరుగ్గా పనిచేస్తుందని జంతువులపై చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా చర్మంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.

జుట్టు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనూ మునగాకు పనిచేస్తుందని ఈ అధ్యయనంలో రుజువైంది.

నాన్‌ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటి జబ్బుల నుంచి కాలేయాన్ని కాపాడటంలోనూ మునగాకు చక్కగా పనిచేస్తుందని మరొక అధ్యయనంలో రుజువైంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఇది పనిచేస్తుంది.

ఆహారం ద్వారా వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కీళ్లవాతం, నాడీ సమస్యలు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలోనూ మునగాకు పనిచేస్తుందని పరిశోధనల్లో రుజువైంది.

మునగ రసం సూపర్‌ఫుడ్

కొందరు మునగాకు పొడి లేదా మునగాకు రసాన్ని కూడా తాగుతుంటారు. రుచి కోసం దీనిలో నిమ్మరసాన్ని కూడా కలుపుతుంటారు.

‘‘దీనిలో విటమిన్-ఏ, బీ1, బీ2, బీ3, బీ6, సీ లాంటి పోషకాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్‌లు కూడా దీనితో అందుతాయి. పాలకూరతో పోలిస్తే, మునగాకులో ఐరన్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది’’ అని విజయవాడకు చెందిన న్యూట్రిషినస్టు బీ రోహిణీ చెప్పారు.

రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ మునగాకు చక్కగా పనిచేస్తుందని ఆమె వివరించారు.

పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం

పాలకు బదులుగా మునగాకు పొడి లేదా రసాన్ని కూడా తీసుకోవచ్చని డాక్టర్ సాయిబాబా నాయుడు చెప్పారు.

పాలలో కాల్షియం, ప్రొటీన్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవే పోషకాలు మునగాకులోనూ లభిస్తాయని, పాలతో పోల్చినప్పుడు ఈ ఆకులో ఇవి రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగానే లభిస్తాయని సాయిబాబా వివరించారు.

‘‘పాలకు అదనంగా మునగాకులో అమైనో అమ్లాలు కూడా ఉంటాయి. పైగా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అజీర్తి సమస్య కూడా ఉండదు’’ అని ఆయన చెప్పారు.

బరువు తగ్గిస్తుంది

‘‘శాఖాహారులకు పప్పులు, పాల నుంచే ప్రోటీన్లు అందుతుంటాయి. కానీ, వారికి లాక్టోస్ ఇంటోలరెన్స్ సమస్య ఉంటే. అప్పుడు సమస్య జఠిలం అవుతుంది. దీంతో మునగాకు లాంటి ప్రత్యామ్నాయాలు వారికి మెరుగ్గా కనిపించొచ్చు’’ అని రోహిణి చెప్పారు.

బరువు తగ్గాలనుకునే వారూ మునగాకు తీసుకుంటే మంచిదని ఆమె సూచించారు. ‘‘దీనిలో క్యాలరీలు తక్కువ. పైగా పోషకాలు, ఫైబర్ పెద్ద మోతాదులో లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. జీర్ణం అవ్వడానికి కూడా ఇది కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటి సమయాల్లో వేరే ఆహార పదార్థాలు తీసుకోవాలని కూడా అనిపించదు’’ అని ఆమె వివరించారు.

చేదే అసలు సమస్య..

అయితే, మునగాకు అందరికీ నోటికి అంతగా రుచించదు. అందుకే దీన్ని ఎక్కువ మంది ఆహారంగా తీసుకోవడానికి వెనకాడుతుంటారని రోహిణి వివరించారు.

‘‘మీరు నేరుగా మునగాకు రసం తాగలేకపోయినా లేదా మునగాకు కూర తినడానికి ఇష్టం లేకపోయినా.. స్మూతీలు చేసుకోవచ్చు. అరటిపళ్లు, మామిడి పళ్లతో వీటిని కలిపి స్మూతీ చేసుకుంటే హాయిగా తీసుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.

లేదంటే మునగాకు టీ కూడా బావుంటుందని ఆమె వివరించారు. ‘‘కేవలం తేనె, నిమ్మరసం కలుపుకొని హెర్బల్ టీలా దీన్ని తాగొచ్చు’’ అని ఆమె వివరించారు.

సూప్‌లు, సలాడ్‌లలోనూ దీన్ని వేసుకోవచ్చని ఆమె చెప్పారు.

మరీ ఎక్కువ మంచిది కాదు..

అయితే, మునగాకును మరీ ఎక్కువ తీసుకోవడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.

‘‘వీటిని మరీ ఎక్కువ తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు వీటిలో ప్రతి వంద గ్రాముల ఆకుకు కాల్షియం ఆక్సలేట్ స్థాయిలు 430 నుంచి 1050 ఎంజీ వరకూ ఉంటాయి. పాలకూరలో ఇది 750 ఎంజీ మాత్రమే. కాల్షియం ఆక్సలేట్ స్థాయిలు మరీ ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పుంటుంది’’ అని కేరళకు చెందిన హెప్టాలజిస్టు, సోషల్ మీడియా సెలబ్రిటీ డాక్టర్ సీరియాక్ అబీ ఫిలిప్స్ ఒక వీడియోలోమ చెప్పారు.

‘‘మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, దేన్నైనా మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా దీన్నొక ఆకుకూరలానే చూడాలి. ఔషధంగా భావించకూడదు’’ అని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories