Cancer Detection: గుడ్ న్యూస్.. క్యాన్సర్‌ను మూడు సంవత్సరాల ముందే పసిగట్టే కొత్త టెక్నిక్!

Cancer Detection: క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో క్యాన్సర్‌ను గుర్తించగలిగితే చికిత్స సాధ్యమవుతుంది. కానీ, ఈ వ్యాధిని ప్రారంభ దశలో త్వరగా గుర్తించలేము. దీనివల్ల రోగులు ఎప్పుడు ఫోర్త్ స్టేజీకి చేరుకుంటారో కూడా తెలియదు.

CR Reddy
Updated on: 19 Jun 2025 9:30 AM IST
Cancer Detection
X

Cancer Detection: గుడ్ న్యూస్.. క్యాన్సర్‌ను మూడు సంవత్సరాల ముందే పసిగట్టే కొత్త టెక్నిక్!

Cancer Detection: క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో క్యాన్సర్‌ను గుర్తించగలిగితే చికిత్స సాధ్యమవుతుంది. కానీ, ఈ వ్యాధిని ప్రారంభ దశలో త్వరగా గుర్తించలేము. దీనివల్ల రోగులు ఎప్పుడు ఫోర్త్ స్టేజీకి చేరుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. దీని ద్వారా క్యాన్సర్ లక్షణాలు కనిపించడానికి దాదాపు మూడేళ్ల ముందే దానిని గుర్తించవచ్చు. ఈ పరిశోధన అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో జరిగింది. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ను 36 నెలల ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడం సులభతరం అవుతుంది. వ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా ప్రారంభ దశలోనే నయం చేయవచ్చు. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రారంభ దశలో ఉన్నప్పటికీ ఇది క్యాన్సర్ నివారణలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

ఈ పరిశోధన ప్రతిష్టాత్మక వైద్య పత్రిక క్యాన్సర్ డిస్కవరీలో ప్రచురితమైంది. రక్తంలో ఉండే జీన్లలో జరిగిన మార్పులను గుర్తించే ఒక పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఇందులో పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పగలదు. ఈ టెక్నాలజీని మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్(MCED) టెస్ట్ అని పిలుస్తున్నారు.

ఎంసీఈడీ టెస్ట్ ఒక రకమైన ఎక్స్‌పెరిమెంటల్ బ్లడ్ టెస్ట్. ఇందులో రక్తంలో ఉండే డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ లేదా ప్రోటీన్ల ద్వారా శరీరంలో ఏదైనా రకమైన క్యాన్సర్ సంకేతాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ఈ టెస్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాంప్రదాయిక పరీక్షల ద్వారా సాధ్యం కాని అనేక రకాల క్యాన్సర్‌లను ఒకేసారి గుర్తించగలదు.

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు 52 మంది రక్త నమూనాలను పరీక్షించారు. వీరిలో 26 మందికి ఆరు నెలల్లోపు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 26 మంది ఆరోగ్యంగా ఉన్నారు. పరిశోధనలో 8 మందికి టెస్ట్ పాజిటివ్ వచ్చిందని, వారికి 4 నెలల్లోపే క్యాన్సర్ నిర్ధారణ అయిందని తేలింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఎనిమిది మందిలో ఆరుగురి పాత రక్త నమూనాలను (సుమారు 3.1 నుండి 3.5 సంవత్సరాల క్రితం సేకరించినవి) కూడా పరీక్షించారు. వీటిలో నాలుగు నమూనాలలో క్యాన్సర్‌కు సంబంధించిన జెనెటిక్ మ్యుటేషన్ అంటే జీన్లలో మార్పులు ముందుగానే ఉన్నట్లు గుర్తించారు.


ఈ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త ప్రకారం.. ఈ ఫలితాలు శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. క్యాన్సర్‌ను మూడు సంవత్సరాల ముందే గుర్తించగలిగితే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే పట్టుకోవచ్చు. దీనివల్ల చికిత్సకు అవకాశం, విజయం రెండూ పెరుగుతాయి. కానీ ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో దీనిని మరింత సులభతరం చేయవచ్చని ఆశిస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story