logo
తాజా వార్తలు

పాతపట్నం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర ఖాయమా?

పాతపట్నం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర ఖాయమా?
X
Highlights

ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరించబోతోంది వార్ వన్ సైడ్ అనుకున్న చోట ఎగిరే జెండా ఎవరిది ఆఖరి నిమిషంలో టికెట్...

ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరించబోతోంది వార్ వన్ సైడ్ అనుకున్న చోట ఎగిరే జెండా ఎవరిది ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న ఆ నేత మళ్ళీ అధికారంలోకి వస్తారా ఆది నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న వ్యక్తికే అక్కడి ప్రజలు పట్టం కడతారా అసలు పాతపట్నం నియోజకవర్గ ప్రజల మనోగతం ఎవరికీ అనుకూలంగా ఉంది గెలుపుపై ఇరు పార్టీల అభ్యర్ధుల టెన్షన్‌కు కారణాలేంటి?

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, లక్ష్మీ నర్సంపేట, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి మండలాలు ఉన్నాయి. జనాభా పరంగా కాపు, ఎస్టీ సామాజిక వర్గాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో వెలమ, కాళింగ, శ్రీశయన సామాజికవర్గాలున్నాయి. 1978లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచిన కలమట మోహనరావు, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 1986 టీడీపీలో చేరిన కలమట, వరుసగా 1989,94,99,2004 ఎన్నికల్లో గెలుపొంది, మొత్తం ఐదుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 1994 ఎన్నికల్లో దేవుని ఫోటో పెట్టి ప్రచారం చేశాడన్న కారణంతో ఎన్నికల సంఘం కలమట మోహనరావుపై అనర్హత వేటువేసింది. దీంతో 1996లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ పోటీ చేయగా, అన్నా తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతి పోటీ చేశారు. నాటి సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో, చివరకు అన్నాతెలుగుదేశం తరపున పోటీచేసిన లక్ష్మీ పార్వతి విజయం సాధించారు. అప్పట్లో ఈ ఎన్నిక ఒక సంచలనం.

2009 ఎన్నికల ముందు కలమట మోహనరావు ప్రజారాజ్యంలో చేరగా, ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన కలమట వెంకటరమణ మూర్తి మాత్రం టీడీపీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున కలమట వెంకటరమణ పోటీకు దిగడంతో, తన కుమారునికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఇష్టంలేక పిఆర్పీ తరపున మరో అభ్యర్థిని బరిలో దించాల్సివచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్ధి శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందారు. దీనితో ఆయనకు రాజశేఖరెడ్డి కేబినెట్‌లో అటవీ శాఖా మంత్రిగా స్థానం లభించింది. అయితే 2014 ఎన్నికలకు ముందు కలమట వెంకటరమణ వైసీపీలో చేరగా, శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరి ఇద్దరూ పాతపట్నం నియోజకవర్గం నుండే పోటీచేశారు. ఈ ఎన్నికల్లో కలమట వెంకటరమణ గెలుపొందగా, మళ్లీ రెండేళ్లు తిరగకముందే తెలుగుదేశం గూటికి చేరుకున్నారు.

జిల్లాలోనే అత్యల్ప ఓటింగ్ నమోదైన నియోజకవర్గం పాతపట్నం. 69.47 శాతం ఓటింగ్‌తో పదో స్థానంలో నిలిచింది. ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే, హోరాహోరీ పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున కలమట వెంకట రమణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలవగా, వైసీపీ నుంచి రెడ్డి శాంతి రణభేరి మోగించారు.

ఇకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనపై వ్యతిరేకత ఉన్నా, సిఫార్సులతో టికెట్ దక్కించుకున్నారన్న విమర‌్శలు ఎదుర్కొన్నారు కలమట వెంకటరమణ. పార్టీకి సంబందించి జిల్లాలోని ముఖ్య నాయకుల అండతో టికెట్ దక్కించుకున్న వెంకటరమణ, గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నా, ఆయన మాత్రం పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో తనకు లభించిన ఆదరణ, కుటుంబ నేపథ్యంతో పాటు, ఐదేళ్లలో తాను చేసిన అభివృద్దిని చెప్పకున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తనకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలేస్తున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి నాన్‌లోకల్‌ కావడం కూడా తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు కలమట.

ఇక వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి విషయానికి వస్తే, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేశారామె. బలమైన క్యాడర్ కలిగి ఉండటంతో పాటు గత ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో ఈసారి కూడా ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోకే చేరుతాయన్న ధీమాతో రెడ్డి శాంతి కనిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట మీద ఉన్న వ్యతిరేకతే, తన బ్రహ్మాస్త్రమని కూడా చెప్పుకున్నారు రెడ్డి శాంతి. అయితే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించే వరకు నిత్యం ప్రజల్లో కనిపించిన ఆమె, ప్రకటన తరువాత ప్రచారంలో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయారనే చర్చ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అయితే జగన్ చరిష్మా, పార్టీపై అభిమానం, నియోజవర్గంలో తాను చేసిన ఆందోళనలు, తనకు విజయాన్ని అందిస్తాయని బలంగా నమ్ముతున్నారు రెడ్డి శాంతి.

మొత్తంమీద స్థానిక పరిస్థితులు ఎలావున్నా గెలుపుపై అభ్యర్ధుల ధీమా వెనుక మర్మం ఏమిటో, ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ మాత్రం నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ప్రజల తీర్పు ఎవరికి అనికూలంగా ఉందో తెలియాలంటే, మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

Next Story