తెలంగాణలో విజృంభిస్తోన్న కుష్టు వ్యాధి

తెలంగాణలో విజృంభిస్తోన్న కుష్టు వ్యాధి
x
Highlights

అంతరించిపోయిందనుకున్న కుష్ట మహమ్మరి రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోంది. మూడేళ్లుగా కేసుల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా కుష్టు వ్యాధి కేసులు అధికమవుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

అంతరించిపోయిందనుకున్న కుష్ట మహమ్మరి రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోంది. మూడేళ్లుగా కేసుల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా కుష్టు వ్యాధి కేసులు అధికమవుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. వైద్య ఆరోగ్య శాఖలోనూ అలజడి మొదలై నివారణ చర్యలు ప్రారంభించింది. మైక్రో బ్యాక్టీరియా లెప్రై అనే బ్యాక్టీరియా ద్వారా కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది. సరైన నివారణ చర్యలు పాటించక పోవడంతో ఈ వ్యాధి ఇప్పటికీ ప్రజలను వెంటాడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం, మంచిర్యాల, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో కుష్టు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ జిల్లాల్లో లక్షలాది మందిని పరీక్షించగా 2016-17లో ఏకంగా 26 వేల 548 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 7 నెలల్లోనే కొత్తగా 2 వేల 629 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 189 కేసులు నమోదవగా, భూపాలపల్లి జిల్లాలో 158, పాలమూరులో 122 కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి 79వేల 812 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించి వారిలో 1,337 మందికి కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.

కుష్టులో పీబీ, ఎంబీ అని రెండు రకాల కేసులుంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దుర్లు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతోపాటు ఇతర లక్షణాలు ఉంటాయి. ఈ దశలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా కుష్టు వ్యాధి చలి ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది.

కుష్టు వ్యాధిని వ్యాప్తి చేసే మైకో బ్యాక్టీరియం లెప్రే శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి ఏడేళ్లలో లక్షణాలు బయట పడతాయి. ఈ దశను వ్యాధి పొదిగే ఇంక్యుబేషన్‌ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. ఒక్కోసారి 5-20 సంవత్సరాల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. మల్టీ డ్రగ్‌ థెరపీ ద్వారా కుష్టును పూర్తిగా నయం చేయవచ్చు. కాకపోతే ఈ వ్యాధి నయం కావడానికి ఏడాది సమయం పడుతుంది. పీబీకి అయితే 6 నెలలు, ఎంబీకి అయితే ఏడాది సమయం తీసుకుంటుంది.

దేశంలో కుష్టు వ్యాధి అధికంగా ఉన్న సమయంలో వ్యాధిని గుర్తించి, వైద్యం అందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నేషనల్‌ లెప్రసీ ప్రోగ్రామ్‌ విభాగం కింద లెప్రసీ కంట్రోల్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే కుష్టు వ్యాధి రోగుల సంఖ్య బాగా తగ్గిందన్న కారణంతో 2006లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఎత్తివేశారు. సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేసి రోగులను గుర్తించిన చోట చికిత్స కొనసాగించారు. ప్రత్యేక విభాగం లేకపోవడం, సిబ్బంది తక్కువ ఉండటంతో కుష్టు వ్యాధి ప్రబలుతున్నా వైద్య ఆరోగ్య శాఖ సరిగ్గా గుర్తించలేకపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories