logo

ప్రమాదాలకు కేరాఫ్ వెల్దుర్తి...డేంజర్ రోడ్స్ ... ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

ప్రమాదాలకు కేరాఫ్ వెల్దుర్తి...డేంజర్ రోడ్స్ ... ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
Highlights

అవి ర‌హ‌దారులు కాదు మృత్యుకుహ‌రాలు. రెప్పపాటు కాలంలో మ‌నుషుల ప్రాణాలు తోడేస్తాయి. చావు త‌మ ముందు ఉంద‌ని...

అవి ర‌హ‌దారులు కాదు మృత్యుకుహ‌రాలు. రెప్పపాటు కాలంలో మ‌నుషుల ప్రాణాలు తోడేస్తాయి. చావు త‌మ ముందు ఉంద‌ని తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. ఈ ప్రమాదాలకు కారణం ఎవరు..? కర్నూలు జిల్లాలో ప్రాణాలు తీస్తున్న ఆ రహదారులు ఏవీ..?

కర్నూలు జిల్లాలో రహదారులు చావుకు హైవేలుగా మారాయి. ఒకటి కాదు, రెండు కాదు వందల సంఖ్యలో జరిగిన ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నాయి. తాజాగా వెల్దుర్తిలో జరిగిన ప్రమాదం జిల్లాలో రహదారుల పరిస్థితిపై ఆలోచించేలా చేస్తున్నాయి.

నిశ్చితార్థానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబ ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారు అనంత వాయువుల్లో కలిసిపోయారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారి కుటుంబం శోకంలో మునిగిపోయింది. తప్పు ఎవరది అనే విషయం పక్కన పెడితే అభం శుభం తెలియని వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

కొన్ని నెలల క్రితం ఇదే డోన్‌, ఇదే జాతీయ ర‌హ‌దారి. అనంత‌లో జ‌రిగిన జ‌న‌సేన క‌వాతుకు వెళ్లి వ‌స్తూ ఐదుగురు కార్య‌క‌ర్త‌లు ఇదే ఎస్‌.ఆర్‌.ఎస్ ట్రావెల్స్ బ‌స్సు ఢీకొని మృత్యువాత ప‌డ్డారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ప్ర‌మాదాల్లో కేవ‌లం రెండు మాత్రమే. క‌ర్నూలు జిల్లా మీదుగా వెళ్లే 44వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఇలాంటి ప్ర‌మాదాలు నిత్య‌కృత్యం. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే గ‌త ఏడాది ఇదే జాతీయ ర‌హ‌దారి ప‌రిధిలో సుమారు 573 మంది ప్రాణాలు అనంత‌వాయువుల్లో క‌ల‌సి పోయాయి.

నిత్యం ఏదో ఒక మూల వాహ‌న చోద‌కుల్లో, రోడ్డు దాటుతున్న వారినో యాక్సిడెంట్ రూపంలో మృత్యువు మింగేస్తోంది. ప్రమాదాల్లో చనిపోతోంది కొంతమంది అయితే అవయవాలు కోల్పోయి వికలాంగులవుతోంది మరికొంతమంది. ఇక జైల్లో శిక్షణను అనుభవిస్తున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది.

అభం..శుభం తెలియ‌ని వంద‌ల‌ మంది ప్రాణాలు కోల్పోవ‌డానికీ, మ‌రెంతో మంది జీవ‌శ్చ‌వాలుగా మార‌డానికి కార‌ణాలు ఏంటి..? ఈ పాపం మితిమీరిన వేగంతో వాహ‌నాలు న‌డుపుతున్న డ్రైవ‌ర్ల‌దా.? చ‌ర్య‌లు తీసుకోని అధికార యంత్రాంగానిదా?

కుటుంబాల ఉసురు తీస్తున్న ప్రమాదాల్లో తిలా పాపం త‌లో పిడికెడు అన్నట్టు ఉంది. వాహ‌నాల వేగంలో నియంత్ర‌ణ లేక‌పోవ‌డం మితిమీరిన వేగంతో న‌డుస్తున్న వాహ‌నాల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ర‌హ‌దారి భ‌ద్ర‌త అధికారులు గాలికి వ‌దిలేయ‌డం వంటి కార‌ణాలు ఎన్నో ప్రమాదాల వెనుక ఉన్నాయి. ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేసే అధికారులు, త‌ప్పు మీదంటే మీది అంటూ అరోపణలు చేసుకుంటూ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌న్నీ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ ఉంటారు. వెల్దుర్తి ప్రమాదం తర్వాత వరుస ఘటనలపై దృష్టి పెట్టిన హెచ్ఎంటీవీకి లోపాలను పసిగట్టింది.

క‌ర్నూలు జిల్లాలో రెండు సంవత్సరాల కాలంలో సుమారు 1200 మంది మృత్యువాత పడ్డారు. 2017లో 1,668 ప్రమాదాలు జరుగగా 632 మంది చనిపోయారు. 2255 మంది క్షతగాత్రులయ్యారు. 2018లో 1,356 ప్రమాదాలు చోటు చేసుకుంటే 573 మంది మృత్యవాతపడగా, 1,721 క్షతగాత్రులుగా మారారు. ఈ లెక్కలు చూస్తే కర్నూల్ జిల్లాలో రోడ్డు భద్రత ఏపాటిదో మనకు అర్థమవుతుంది.

ఈ మార్గంలో నిర్థిష్ట వేగం కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై వేగ నియంత్రణ లేకపోవడం స్పీడ్ బ్రేకర్స్, ట్రాఫిక్ సిగ్నలింగ్ అంతత మాత్రంగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణంగా చెబుతున్నారు. వేగ నియంత్రణకు స్పీడ్ గన్స్‌ను వినియోగించడం లేదు. భద్రతా వారోత్సవాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే యంత్రాంగా అసలైన భద్రత విషయానికి వచ్చే సరికి విఫలమవుతోంది. చలానాలు రాయడం తప్ప ప్రజల్లో అవగాహన తేలేకపోతోంది. చలాన్లు కడితే చాలు రూల్స్ పాటించనవసరం లేదు అన్నట్టు తయారైంది. ఇవన్నీ ఒకెత్తైతే జాతీయ రహదారి నిర్మాణంలోనే కొన్ని లోపాలున్నాయని కూడా అంటున్నారు. వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిచేస్తే తప్ప ప్రమాదాలను అరికట్టలేం. నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే తప్ప ప్రాణాలు కాపాడలేం. అప్పటి వరకు వెల్దుర్తి వంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

లైవ్ టీవి

Share it
Top