ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో నాలుగు బీభత్సాలు..

World Sees Four Dangers in Four Days
x

ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో నాలుగు బీభత్సాలు..

Highlights

Four Days: ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో నాలుగు దేశాల్లో మరణ మృదంగం మోగింది.

Four Days: ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో నాలుగు దేశాల్లో మరణ మృదంగం మోగింది. నాలుగు భయానక ఘటనలతో వందల మంది ప్రానాలను కోల్పోయారు. వీటిలో ఒకటి ప్రకృతి విపత్తు కాగా మిగిలినవి మానవ తప్పదాలతో జరిగిన ఘటనలే. రాకసి అలలను సునామీగా భావించి పర్వతం వైపునకు పరిగెత్తి బురదలో కూరుకుని 100 మంది మేర మృతి చెందారు. ఇక దక్షిణ కొరియాలో హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాటలో 153 మంది, సోమాలియాలో బాంబు పేలుడులో 100 మంది, భారత్‌లోని గుజరాత్‌లో తీగల బ్రిడ్జి కూలి 141 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మానవ తప్పిదాలపై ఆయా దేశాల అధినేతలు విచారణకు ఆదేశించారు. ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు బీభత్సకరమైన ఘటనలు నాలుగు దేశాల్లో నాలుగు రోజుల్లో చోటు చేసుకున్నాయి. ఈ నాలుగింటిలో ఒకటి ప్రకృతి విపత్తు కారణంగా నెలకొన్న భయం.. 100 మంది ప్రాణాలను బలిగొంది. మిగిలిన మూడు ఘటనలు మాత్రం మానవ తప్పిదాలే ఆయా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆయా ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మూడింటిలో రెండు ఘటనల్లో మాత్రం సరదాగా గడిపేందుకు వెళ్లినవారు మృత్యువాతపడ్డారు. మరో ఘటన మాత్రం ఉగ్రదాడిలో జరిగిన బాంబు పేలుళ్లలో జరిగిన విషాదం ఈ నాలుగు రోజుల్లోనే ఫిలిప్పైన్స్‌లో రాకాసి అలలు ఎగసి పడ్డాయి. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రదాడి జరిగింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్‌ వేడుకలు అత్యంత భయానకంగా మారాయి. ఇక గుజరాత్‌లో బ్రిడ్జి కూలిపోయింది. ప్రతి ఘటనలోనూ వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నాలుగు ఘటనలు ఆయా దేశాల్లో పెను విషాదాలను నింపాయి.

ఫిలిప్పైన్స్‌లో నల్గే తుపాను బీభత్సం సృష్టించింది. తుపానుతో సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ఉవ్వెతున్న ఎగసిపడుతున్న అలలను చూసి ప్రజలు సునామీగా భావించి భయాందోళనకు గురయ్యారు. దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్‌లోని కుసియోంగ్‌ గ్రామంలో పర్వతం వైపునున్న చర్చి వద్దకు గ్రామస్థులు పరుగులు తీశారు. అయితే వర్షంతో ఏర్పడిన బుదరలో కూరుకుపోయి వారు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. రెండ్రోజుల నుంచి తుఫాను కారణంగా.. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. ఇక కొండ చరియలు విరిగిపడి.. 47 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోనికి నీరు చేరడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదలో చిక్కుకున్న వారిని ఆర్మీ దళాలు, పోలీసులు, వాలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజధాని మనీలాతో సహా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వం తుపాను హెచ్చరికలు జారీ చేసింది. ఫిషింగ్, కార్గో బోట్లు, ఇంటర్-ఐలాండ్ ఫెర్రీలు సముద్రంలోకి వెళ్లకుండా నిషేధించింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరకుండా వరదల్లో చిక్కుకున్నారు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్‌ వేడుకలు అత్యంత భయానకంగా మారాయి. వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో యువత తీవ్ర గాయాల పాలయ్యింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకలకు లక్ష మందికి పైగా హాజరయ్యారు. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒక్కసారిగా యత్నించడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఇరుకు వీధులతో ఉన్న ఆ ప్రాంతంలో వేలాది మంది పరిగెత్తడంతో పలువురు కిందపడిపోయి.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి కారణం, మృతుల సంఖ్యను దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మృతులు, క్షతగాత్రుల్లో చాలామంది 20 ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వారు ఏ దేశానికి చెందినవారన్నది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. రెండేళ్ల విరామం తర్వాత కొవిడ్‌-19 పూర్తి స్థాయి ఆంక్షలను తొలగించడంతో వేడుకలకు యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు. హాలోవీన్‌ జరిగే ఇటేవాన్‌ ప్రాంతంలో చాలా బార్లు, క్లబ్బులు, షాపింగ్‌ కాంప్లెక్సులు ఉంటాయి. ఈ నేపథ్యంలో యువకులు భారీ ఎత్తున వేడుకలకు హాజరవుతుంటారని తెలుస్తోంది. తాజాగా సంఘటనా స్థలాన్ని దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సందర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు సహాయం చేస్తామన్నారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడిలో 100 మందికి పైగా చనిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్‌ కూడలి వద్ద ఆక్టోబర్‌ 29 రెండు కారు బాంబులు పేలడంతోనే ఈ ఘటన జరిగింది. సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో ఉగ్రవాదంపై చర్చిస్తుండగానే రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్‌ ముందు మరో కారు బాంబు పేలింది. సోమాలియా అధ్యక్షుడు హసన్‌ షేక్‌ మొహమూద్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్‌ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్‌సబాబ్‌ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్‌సబాబ్‌ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్‌ షబాబ్‌ దీనిపై స్పందించలేదు. మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు.

భారత్‌లోని గుజరాత్‌ రాష్ట్రంలో మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలి.. బీభత్సాన్ని సృష్టించింది. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలోకి పడిపోయారు. ఈ ఘటనలో 140 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు 177 మందిని సైన్యం, వాయు, నావికాదళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గుజరాత్‌ ప్రభుత్వం చెప్పింది. ఇక ప్రమాద సమయంలో తీగల వంతెనపై 500 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నదిలోకి పడిపోయిన వారి కోసం రాత్రంతా.. గాలింపు చర్యలను కొనసాగించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్‌ ముఖ్యమంత్రి భూఫేంద్రతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాస్ట్ర ప్రభుత్వానికి తక్సణ సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వేలాడే మోర్బీ సస్పెన్షన్‌ బ్రిడ్జిపై నడవడం.. సందర్శకుల మధురానుభూతిని కలిగిస్తున్నది. నిత్యం ఈ బ్రిడ్జిపై నుంచి అక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు వందలాది మంది వస్తుంటారు. తీగల బ్రిడ్జికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ కాలంలో 1880లో నిర్మించారు. అయితే గుజరాత్‌లో సంభవించిన భూకంపంతో ఈ బ్రిడ్జి దెబ్బతిన్నది. ఇటీవల ఈ బ్రిడ్జి మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. 2 కోట్ల రూపాయలతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి. ఈ వంతెనపై ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్ఠతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేశారు. ఈనెల 26న రీఓపెన్ చేసి సందర్శకులను అనుమతించారు.

ఈ ఘటనలు సూర్యగ్రహణం కారణంగానే ఈ ఘటనలు జరిగినట్టు పలువురు వాదిస్తున్నారు. సూర్యుడి తీక్షణ ప్రభావం మనుషులపై పడిందని అందుకే ఈ బీభత్సకరమైన ఘటనలు జరిగాయని అంటున్నారు అయితే అందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories