అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన బ్రెయిలీ.. జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివాళి..

World Braille Day 2023: The enduring legacy of Louis Braille
x

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన బ్రెయిలీ.. జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివాళి

Highlights

World Braille Day 2023: అంధుల పాలిట దేవుడు లూయిస్ బ్రెయిలీ పుట్టిన రోజు ఈరోజు.

World Braille Day 2023: అంధుల పాలిట దేవుడు లూయిస్ బ్రెయిలీ పుట్టిన రోజు ఈరోజు. నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టి బాల్య చాపల్యంలో కళ్లు పోగొట్టుకొని.. చిన్నప్పుడే పూర్తి అంధుడైపోయాడు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోక.. తనలాంటి అందరూ చదువుకోవాలన్న పట్టుదలతో ప్రత్యేకమైన లిపిని తయారుచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. శిలలపై చెక్కిన శిల్పాల అందాన్ని ఎన్ని కళ్లున్నా ఆస్వాదించడం అంత సులభం కాదు. ఎందుకంటే కఠినమైన శిలల్ని సైతం వెన్న ముద్దలా కరిగించి మలచగలిగిన చాతుర్యం ఆనాటి శిల్పుల సొంతం. మరి అలాంటి శిల్పాల అందాల్ని ఆస్వాదించాలంటే చూపు కావాల్సిందే కదా. చూపు ఉన్నవాళ్లకే తమ రెండూ కళ్లూ చాలకపోతే.. అసలు చూపే లేనివారి పరిస్థితి ఏంటి?

అయితే చూపు లేనివారు శిల్పాలను నేరుగా చూడకపోవచ్చు గానీ.. ఆ శిల్పాలను సైతం వర్ణించి వివరించగలిగిన అక్షరాలను ఆశ్రయించి అర్థం చేసుకోవచ్చు. ఆత్మానుభూతి చెందవచ్చు. అలా అంధులను సైతం అక్షరాస్యులుగా మార్చగలిగిన ఒకానొక ప్రత్యేకమైన లిపే బ్రెయిలీ లిపి. లూయిస్ బ్రెయిలీ పేరు మీదుగా ఏర్పడిన లిపినే బ్రెయిలీ లిపిగా పేర్కొంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన పుట్టిన రోజు సందర్భంగా దేశదేశాల్లో, వాడవాడలా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4వ తేదీన అతి పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి సైమన్ వ్రేన్ బ్రెయిలీ. అతను అతి సామాన్యమైన చెప్పులు కుట్టే వృత్తికి చెందినవాడు. ఏ రోజు చెప్పులు కుట్టడానికి లేదా షూ తయారు చేయడానికి ఆర్డర్ రాదో.. ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే. అలాంటి కండిషన్స్ గల కుటుంబంలో పుట్టిన లూయిస్ బ్రెయిలీ.. ఇవాళ అంధుల ప్రపంచానికి ఆరాధ్య దైవం అయ్యాడంటే.. అందుకు ఆయన చేసిన కృషే కారణం. లూయిస్ చిన్నప్పుడు.. తండ్రి చెప్పుల షాపుకు వెళ్లి ఆడుకునేవాడు. అక్కడ ఉండే పదునైన వస్తువులు తీసుకొని ఆటల్లో మునిగిపోయేవాడు. ఓరోజు అలాగే ఆడుకుంటున్న క్రమంలో చెప్పులు కుట్టే దబ్బనం లూయిస్ కుడికంట్లో దిగిపోయింది.

అయితే ప్రాథమిక వైద్యం చేయించిన తండ్రి.. ఆ తరువాత ఇన్ఫెక్షన్ ను బహుశా పట్టించుకోలేదు. అందుకు పేదరికం కూడా కారణం కావచ్చు. లూయిస్ కు క్రమంగా కుడికన్ను చూపు తగ్గిపోవడం మొదలైంది. కొద్దిరోజుల్లోనే కుడికన్ను పూర్తిగా గుడ్డిదైంది. అప్పుడు లూయిస్ కు మూడేళ్లు మాత్రమే. మరికొద్ది రోజులకు ఇన్ఫెక్షన్ ఎడమకంటికి కూడా సోకడం మొదలైంది. ఆ విషయాన్ని గుర్తించే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. అలా లూయిస్ కు ఐదేళ్లు వచ్చేసరికి రెండు కళ్లూ పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో లూయిస్ బ్రెయిలీ జీవితం పూర్తిగా అంధకారమైంది.

చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే లూయిస్ బ్రెయిలీ.. అతి చిన్న వయసులోనే అంధుడిగా మారాడు. అయితే ఆయనలో ఉన్న చలాకీతనం మాత్రం తగ్గలేదు. చదువుకోవాలన్న మనో కాంక్ష.. అతన్ని ఇంటిపట్టున ఉండనీయలేదు. అది గమనించిన తండ్రి.. లూయిస్ కు పదేళ్లు రాగానే అప్పటికే అంధుల కోసం పనిచేస్తున్న ఓ బ్లైండ్ స్కూల్ కి పంపాడు. అది ప్యారిస్ లో ఉంది. వారున్న కుగ్రామం నుంచి ప్యారిస్ చాలా దూరం. దీంతో చాలారోజులు అక్కడే హాస్టల్లో ఉండాల్సి వచ్చేది. అయితే అంధుల కోసం పేరుకైతే పాఠశాలలు ఉన్నాయి గానీ.. అందులో అంతా ముతకరకమైన విద్యా విధానమే ఉండేది. దీంతో అంధులకు సరిగా విద్య అబ్బేది కాదు. వారి విజ్ఞానం వికసించేది కాదు. అందువల్ల ఉద్యోగావకాశాలు దొరికేవి కావు. ఓ ఫ్యామిలీలో ఒక అంధుడు ఉన్నాడంటే ఆయన కుటుంబమంతా పూర్తి పేదరికంలో కూరుకుపోయేది. అయితే పూర్తి అంధుడైన లూయిస్ కి అంధుల విద్య కోసం ఎప్పుడూ ఆలోచించేవాడు. మిగతా అందరిలాగే వీళ్లు చదువుకోవాలంటే ఏం చేయాలని తపించేవాడు. అయితే ప్యారిస్ లోని అంధుల స్కూల్లో నాసిరకమైన వాతావరణం, పారిశుద్ధ్యం పాటించకపోవడం వంటి కారణాలతో హోమ్ సిక్ అయ్యాడు. జబ్బులపాలయ్యాడు. అయినా దాన్ని లక్ష్యపెట్టకుండా తనకు 15 ఏళ్లు వచ్చేటప్పటికే అంధుల విద్య కోసం ఓ సిస్టమ్ ని రూపొందించాడు లూయిస్. చెక్క మీద మేకులు కొట్టి స్పర్శ ద్వారా అక్షరాలను గుర్తించి నేర్చుకునే విధానం ద్వారా మొదలైన లూయిస్ కృషి.. ప్రత్యేకమైన పేపర్ మీద ఉబ్బెత్తు అక్షరాలకు దారి తీసి.. ఆ తరువాత చిన్నచిన్న డాట్స్ ద్వారా సంకేత భాషలో చదవడం, రాయడం వరకు తీసుకెళ్లాడు. అదే ఈనాడు లూయిస్ బ్రెయిలీ గా ప్రపంచ ఖ్యాతి పొంది.. అనేక రూపాల్లో అభివృద్ధి చెందింది.

తక్కువ చూపు ఉన్నవారి కోసం ప్రత్యేకమైన ఆల్ఫాబెట్స్ తయారు చేశాడు. ఆ పరిమితమైన నాలెడ్జ్ తో చేసిన ఆల్ఫాబెట్స్ అంధులకు ఎంతో పనికొచ్చాయట. దాన్ని ఒక స్థాయికి అభివృద్ధి చేసి 1829లో పబ్లిష్ చేశాడు. "System of Writing Words, Music and Plain-Chant for the Use of the Blind" అనే పేరుతో తన పనిని పబ్లిష్ చేశాడు లూయిస్. ఆ సిస్టమ్ ద్వారా తక్కువ చూపు ఉన్నవారికి, పూర్తి అంధులకు చదవడానికి, రాయడానికి, మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎంతో పనికొచ్చింది. అంతేకాదు.. సైన్స్, మాథ్య్స్ వంటి కఠినమైన సబ్జెక్టులు కూడా నేర్చుకోవాడనికి అక్కరకొచ్చింది. అప్పటికి ఉన్న నాసిరకంతో కుస్తీ పడేకంటే.. లూయిస్ తీసుకొచ్చిన కొత్త విధానం చాలా ఈజీగా, బెటర్ గా పని చేస్తుందని ప్యారిస్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు ఎంతో ఆనందించారు. వారి అవసరాలు తీరడంతో లూయిస్ పనితనాన్ని ఎంతో ప్రశంసించారు. అయితే ప్యారిస్ స్కూల్ గానీ, ఫ్రాన్స్ ప్రభుత్వం గానీ లూయిస్ వర్క్ ను గుర్తించలేదు. అయితే తాను విద్యార్జన కోసం జాయిన్ అయిన స్కూల్లోనే తన ప్రతిభ కారణంగా అంధులకు టీచర్ గా ఎదగడం విశేషం.

ఇక లూయిస్ వ్యక్తిగతంగా చాలా విలువలు కలిగిన మనిషి. కళల్ని, సాహిత్యాన్ని ఆస్వాదించే గుణం కలవాడు. తోటివారి పట్ల దయ గల వ్యక్తిత్వం. చర్చిలో పాటలు పాడటం, సంగీతం వాయించడం చేసేవాడు. అలా లూయిస్ అంటే అందరికీ ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఓసారి తన శిష్యుడికి ఉద్యోగం అవసరం అయింది. చర్చిలో ఓ స్టూడెంట్ ని చేర్పించడం కోసం తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడట. మరోవైపు ప్యారిస్ లోని బ్లైండ్ స్కూల్లో పని చేస్తుండగానే ఆయనకు టీబీ అంటుకుంది. ఆ వ్యాధితోనే 1852లో 43 ఏళ్ల చిన్న వయసులోనే లూయిస్ చనిపోయాడు.

లూయిస్ బతికి ఉండగా రాని గుర్తింపు.. ఆయన చనిపోయిన తరువాత వచ్చింది. ఆయన చనిపోయిన రెండేళ్లలో అంటే 1854లో లూయిస్ డెవలప్ చేసిన ఆల్ఫాబెట్ సిస్టమ్ ని గుర్తించింది. అధికారికంగా అదే పద్ధతిలో నేర్పించడం మొదలైంది. క్రమంగా లూయిస్ కు అంతర్జాతీయ గుర్తింపు మొదలైంది. దానికి కొనసాగింపుగా.. 1952లో ప్యారిస్ లోని పాంథియన్ కు ఆయన శకలాల పేటికను అధికారికంగా తీసుకెళ్లారట. ఫ్రాన్స్ చరిత్రలో మహనీయులుగా కీర్తి పొందినవారిని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద మ్యూజియమే పాంథియన్. అలా ఫ్రాన్స్ చరిత్రకు దోహదం చేసినవారిలో జాబితాలో లూయిస్ బ్రెయిలీ కూడా చేరిపోయాడు. ఆయన శవపేటికా యాత్రలో అప్పటి దేశాధ్యక్షుడు విన్సెంట్ ఆరియోల్, అలాగే అంధుల కోసం పనిచేసిన హక్కుల ఉద్యమకారిణి హెలన్ కెల్లర్ కూడా పాల్గొన్నారు. మరోవైపు బ్రెయిలీ పుట్టిన ఇంటిని ఓ స్మారకంగా రూపొందించింది ఫ్రాన్స్ ప్రభుత్వం.

అంధుల విద్య కోసం బ్రెయిలీ చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు.. అంధత్వం కారణంగా పేదరికంలో కూరుకుపోతున్న కుటుంబాలు గాడిన పడాలంటే.. బ్రెయిలీ లిపే శరణ్యమంటూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేశాయి. ఆ తరువాత 1982లో ఎలక్ట్రానిక్ బ్రెయిలీ డిస్ ప్లే వచ్చింది. అయితే ఖరీదు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది దాన్ని యూజ్ చేయలేకపోయారు. ఆ తదుపరి ఎలక్ట్రానిక్ నోట్స్ కూడా డెవలప్ అయ్యాయి. డిజిటల్ ఆడియో బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్స్, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా అనేక పద్ధతుల్లో బ్రెయిలీ లిపి ఆవిర్భవించి అంధుల జీవితాల్లో వెలుగులు నింపింది. మిచిగాన్ యూనివర్సిటీ హోలీ బ్రెయిలీ అనే పేరుతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి అంధుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తోంది. దీని ద్వారా ప్రైమరీ విద్యతో ఆగిపోవడమే గాక.. పెద్ద చదువులు చదవడానికి, ఉన్నతమైన ఉద్యోగాల్లో అంధులు స్థిరపడటానికి కారణమైంది. ఇటు భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. డెహ్రాడూన్లో దీని కేంద్ర కార్యాలయం ఉంది. జమ్మూ-కాశ్మీర్ లో దాని బ్రాంచ్ పనిచేస్తోంది. డెహ్రాడూన్లో నేషనల్ బ్రెయిలీ ప్రెస్ ను ఏర్పాటు చేశారు. ఎలిమెంటరీ నుంచి ఉన్నత విద్య వరకు బ్రెయిలీ బుక్స్ ప్రింట్ అవుతాయి. అంతేకాదు.. ఉన్నతమైన సాహిత్యాన్ని కూడా అచ్చు వేస్తున్నారు. దాని ద్వారా చూపున్న మిగతావారి లాగే భారతదేశంలోని ప్రత్యేకమైన సాహిత్యాన్ని, శిల్పకళను, వేదాల్లో ఉన్న విలువలను అంధ విద్యార్థులు అనుభూతి చెందగలుగుతున్నారు. మిగతావారిలాగా తామేమీ తక్కువ కాదని ఫీలవుతున్నారు. పర్ఫామ్ చేస్తున్నారు.

ఒక్క లూయిస్ కృషి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అంధుల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. ప్రపంచంలో సుమారుగా 130 కోట్ల మందికి ఏదో రకమైన కంటిచూపు ప్రాబ్లమ్ ఉందని డబ్ల్యు.హెచ్.ఒ అంచనా వేస్తోంది. అలాగే 3 కోట్ల 60 లక్షల మంది పూర్తి అంధులుగా ఉన్నారని మరో అంచనా ఉంది. అయితే ఈ సంఖ్యలేవీ స్థిరంగా ఉండేవి కావు. పెరుగుతున్న వయసు కారణంగా, ఆయా పరిస్థితుల కారణంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. మొత్తానికి ఎవరు ఏ దశలో అంధత్వంలోకి జారుకున్నా.. ఇప్పుడు ఎవరూ బాధపడాల్సింది లేదంటారు బ్రెయిలీ లిపిని బాగా యూజ్ చేస్తున్నవారు. అలాంటి పరిస్థితి కల్పించిన లూయిస్ బ్రెయిలీకి ప్రపంచమంతా నివాళులు అర్పిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories