
పనామా కెనాల్‌పై ట్రంప్ ఎందుకు కన్నేశారు?
పనామా కాలువపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కాలువపై కీలక పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు.
Donald Trump: పనామా కాలువపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కాలువపై కీలక పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు పనామాపై అమెరికా ఉద్దేశాన్ని బయటపెట్టాయి. అసలు పనామా కాలువపై ట్రంప్ ఎందుకు కన్నేశారు? దీనికి గల కారణాలు ఏంటి? పనామా కాలువపై చైనా ఆధిపత్యం సాగిస్తోందా? డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకే ట్రంప్ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారా? పనామా కాలువపై ట్రంప్ ఎందుకు పట్టుదలగా ఉన్నారో తెలుసుకుందాం.
ట్రంప్ ఏమన్నారంటే?
పనామా కాలువను చైనాకు ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ, ఈ కాలువను డ్రాగన్ కంట్రీ పరోక్షంగా నిర్వహిస్తోంది. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. లేదా ఇందుకు సంబంధించి శక్తివంతమైన చర్య ఉండనుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే పనామా కాలువ గురించి 2024 డిసెంబర్ లో మాట్లాడారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత యాక్షన్‌లోకి దిగారు. షిప్పింగ్ రేట్లను తగ్గించాలని పనామాను ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కాలువపై ఉన్న నియంత్రణను తిరిగి ఇచ్చేయాలనేది ట్రంప్ వాదన.
పనామా కాలువతో ఉపయోగం ఏంటి?
అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను పనామా కాలువ కలుపుతోంది. ఈ కాలువ 82 కి.మీ. దూరం ఉంటుంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతోంది.దీని ద్వారా ప్రయాణిస్తే సుమారు 8 వేల నాటికల్ మైళ్లు అంటే సుమారు 15 వేల కి.మీ. దూరం తగ్గుతోంది.
1904లో ఈ కాలువ పనులు ప్రారంభించారు. 1914 ఆగస్టు 15న కాలువ పనులు పూర్తయ్యాయి. 1977 వరకు ఈ కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో పనామా, అమెరికా సంయుక్తంగా కాలువపై నియంత్రణ సాగింది. 1999లో ఈ కాలువను పనామాకు అమెరికా అప్పగించింది. ప్రతి ఏటా 14 వేలకు పైగా నౌకలు ఈ కాలువ ద్వారా ప్రయాణం చేస్తాయి. దీంతో పనామాకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. పనామా కాలువకు అమెరికా నౌకలు ఎక్కువగా వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ లెక్కల ప్రకారం 75 శాతం సరకు రవాణా నౌకలు పనామా కాలువ ద్వారానే అమెరికాకు వస్తాయి. ప్రతి ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు రూ. 23 లక్షల కోట్లు వాణిజ్యం జరుగుతోంది.
పనామా కాలువపై చైనా ఆధిపత్యం సాగిస్తోందా?
గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని పలు దేశాలతో తన వ్యాపార సంబంధాలను పెంచుకుంటోంది. దీంతో పనామా కాలువ చుట్టూ తన కార్యకలాపాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ దేశాల మధ్య జరిగే వ్యాపారంలో పనామా కాలువ ద్వారానే 6 శాతం జరుగుతోంది.2013 జూన్ 13న చైనా, పనామా దౌత్య ఒప్పందం జరిగింది. తైవాన్ తో దౌత్య సంబంధాలను పనామా వదులుకుంది. దీంతో చైనా కూడా పనామాతో దౌత్య ఒప్పందం కుదిరింది. వ్యాపారంతో పాటు మరో 19 అంశాలపై పనామాతో చైనా అగ్రిమెంట్ చేసుకుంది. పనామాకు అంతకుముందు చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి. 1911 నుంచి చైనా, పనామా మధ్య సంబంధాలున్నాయి.
చైనాలో 1949లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రచ్ఛన్నయుద్ధం కారణంగా పనామా తైవాన్ తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. 1949 నుంచి 2017 వరకు తైవాన్ తో పనామా సంబంధాలు కొనసాగించింది. కానీ ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో చైనాతో పనామా తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్దరించుకుంది.
అమెరికా తర్వాత పనామా కాలువ ద్వారా ఎక్కువగా వాణిజ్యం జరుపుతోంది చైనా. 2017 మొదటి సెమిస్టర్‌లో చైనా నుండి 1.344 బిలియన్ విలువైన వస్తువులను పనామా దిగుమతి చేసుకుంది. కోలన్ ప్రాంతంలో ఒక కంటైనర్ పోర్ట్‌ను నిర్మించనున్నట్లు చైనా ప్రకటించింది. దీని నిర్మాణానికి 900 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. నిర్మాణంలో మొదటి కంటైనర్ టెర్మినల్ నియోపనామాక్స్ షిప్‌లను నిర్వహణకు ప్రతిపాదించారు. పనామా కాలువపై చైనా ఆధిపత్యం పెరిగిపోతోందని అమెరికా భావించింది. చైనా ఆధిపత్యం తగ్గించేందుకు పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.
పనామా రియాక్షన్ ఏంటి?
ట్రంప్ వార్నింగ్‌తో పనామా కూడా ఒక అడుగు వెనక్కు వేసింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు పనామా అధ్యక్షుడు ములినో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్దరించబోమని వివరించారు. పనామా అధ్యక్షుడితో అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రుబియో ఫిబ్రవరి 2న సమావేశమయ్యారు. పనామా కాలువపై చైనా ఆధిపత్యం తగ్గించాలి లేకపోతే చర్యలు తీసుకుంటామని రుబియో వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికా వార్నింగ్ కు భయపడబోమని పనామా తెలిపింది. అదే సమయంలో చర్చలకు సిద్దమని కూడా ములినో తెలిపారు.
తెరపైకి నికరాగువా కాలువ
పనామా కాలువలోకి ఇటీవల కాలంలో వరద తగ్గింది. ఈ కాలువలోకి వరద వచ్చే ప్రాంతంలో వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో ఈ కాలువ ద్వారా పెద్ద పెద్ద నౌకలు ప్రయాణించడానికి సమయం పడుతోంది. దీంతో మరోసారి నికరుగువా కాలువ ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. పనామా కాలువతో పాటు నికరాగువా కాలువ ప్రతిపాదన 1900లో అమెరికా ముందుండేవి. నికరాగువా గుండా కాలువ నిర్మాణం అంతా ఈజీ కాదని అప్పట్లో భావించరు. దీంతో పనామా కాలువకే అమెరికా మొగ్గు చూపింది. పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం వైపు 100 కి.మీ. అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి. ఈ కాలువల తవ్వకాలకు 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతోందని అంచనా. ఇంత ఖర్చుతో కాలువల తవ్వితే ఎంత తిరిగి వస్తోందనేది కూడా ముఖ్యమే.2013లో హెచ్‌కెఎన్‌డీ అనే చైనా కంపెనీ కాలువ నిర్మాణానికి రెడీ అయింది. కానీ, అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ కాలువ నిర్మాణంతో పెద్ద పెద్ద అడవులు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యంత కీలకమైన పనామా కాలువపై పట్టును అమెరికా కోరుకుంటోంది. ఈ క్రమంలోనే ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అమెరికా నిర్ణయాలపై చైనా ఎలా రియాక్ట్ అవుతోందో చూడాలి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire