రష్యా దాడులు సక్సెస్‌.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన

Vladimir Putin Declared that Mariupol has Been Successfully Liberated
x

రష్యా దాడులు సక్సెస్‌.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన

Highlights

Ukraine Russia War: దక్షిణ ఉక్రెయిన్‌లోని కీలక నగరం మరియూపోల్‌ను సొంతం చేసుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు

Ukraine Russia War: దక్షిణ ఉక్రెయిన్‌లోని కీలక నగరం మరియూపోల్‌ను సొంతం చేసుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. మరియూపోల్‌కు విముక్తి లభించినట్టు ప్రకటించారు. 56 రోజులుగా సాగుతున్న యుద్ధంలో కీలకమైన విజయం సాధించినట్టు రష్యా ప్రకటించింది. మరియూపోల్‌పై పట్టుతో రష్యాకు క్రిమియాకు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అవకాశం లభించినట్టయ్యింది. మరియూపోల్‌లోని అజోవ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో కొందరు ఉక్రెయిన్‌ సైనికులు పోరాటాం చేశారు. అయితే తాజాగా నాలుగు బస్సుల్లో పౌరులను ఉక్రెయిన్ అక్కడి నుంచి తరలించడంతో రష్యాకు మరియూపోల్‌ లభించినట్టయ్యింది.

ఉక్రెయిన్‌కు ఆర్థిక రాజధాని, నల్లసముద్ర తీరంలో కీలకమైన ఓడరేవు నగరం మరియూపోల్‌. ఈ నగరం ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైనది. ప్రధానంగా ఉక్రెయిన్‌కు సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు ఈ నగరం నుంచే సాగుతాయి. అంతేకాకుండా పారిశ్రామిక హబ్‌గా పేరున్న అజోవ్‌ ప్రాంతం కూడా మరియూపోల్‌కు సమీపంలో ఉండడంతో ఉక్రెయిన్‌కు కలిసొచ్చేది. నల్ల సముద్రంలో కీలకమైన ఈ ప్రాంతంపై రష్యా కన్నేసింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అన్ని నగరాల్లాగే మారిపోల్‌ను సొంతం చేసుకునేందుకు దాడులు ప్రారంభించింది. అయితే ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. నెల రోజుల పాటు దాడులు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో రష్యా వ్యూహం మార్చుకుంది. ముందు తూర్పు ప్రాంతంపై పట్టు సాధించి.. ఆ తరువాత మిగతా ప్రాంతాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా దేశ రాజధాని కీవ్‌‌తో పాటు చెర్నీహైవ్‌ ప్రాంతాల నుంచి సైన్యాన్ని రష్యా వెనక్కి తీసుకుంది. డాన్‌బాస్‌ ప్రాంతానికి తమ దళాలను మాస్కో తరలించింది. కానీ మరియూపోల్‌ నుంచి మాత్రం వెనక్కి వెళ్లలేదు.

అయితే మారియూపోల్‌ నగరం రష్యాకు కూడా ఎంతో కీలకం. ఈ నగరం సొంతమైతే అటు నల్లసముద్రంలో తమ ప్రాబల్యం పెరుగుతోంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌ నుంచి 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియా ప్రాంతం రష్యాకు దూరంగా ప్రత్యేకంగా ఉండేది. అక్కడికి అధికారులు వెళ్లాలన్నా వాయు, జల మార్గాలే దిక్కయ్యేవి. అదే మరియూపోల్‌ సొంతమైతే మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. మిగతా ప్రాంతాలు పోయినా పర్లేదని రష్యా ఈ ప్రాంతంపై భీకరంగా దాడులు జరిపింది. బాంబుల వర్షం కురిపించింది. నగరాన్ని సర్వనాశనం చేసింది. మరియూపోల్‌లో ఎక్కడ చూసినా బాంబుల దాడుల్లో శిథిలమైన భవనాలే కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో 10వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. మరియూపోల్‌లో ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం కొంత మేర లొంగిపోయినట్టు రష్యా ప్రకటించింది. మరియూపోల్‌ ఇప్పటికే తమ స్వాధీనమైందని సైన్యం లొంగిపోవాలని ఈనెల 16 నుంచి పదే పదే రష్యా సైన్యం హెచ్చరించింది. ఆయుధాలను వదిలేసి తమకు లొంగిపోతే యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తామని ప్రకటించింది. జెనీవా ఒప్పందం ప్రకారం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది.

మరియూపోల్‌లో చిక్కుకున్న పౌరులను, సైన్యాన్ని తరలించేందుకు మానవతా కారిడర్లను తెరిచేందుకు అవకాశమివ్వాలని ఉక్రెయిన్ రష్యాను కోరింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మరియూపోల్‌ నుంచి నాలుగు బస్సుల్లో అక్కడి పౌరులను, సైన్యాన్ని ఉక్రెయిన్‌ తరలించింది. ఉక్రెయిన్‌ సైన్యం వెళ్లిపోవడంతో మరియూపోల్‌ తమ సొంతమైనట్టు రష్యా ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా సాధించిన తొలి విజయం ఇదే. మరియూపోల్‌కు విముక్తి లభించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇక స్టీల్‌ ప్లాంట్‌లో 2వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉండే అవకాశం ఉందని పుతిన్‌కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరియూపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌పై దాడి చేయడానికి బదులు దాన్ని ముట్టడించాలని సైన్యానికి పుతిన్‌ సూచించినట్టు తెలిసింది. స్టీల్‌ ప్లాంట్‌ను ముట్టడిస్తే ఈగ కూడా లోపలకి చొరబడదని పుతిన్‌ ఆదేశించినట్టు సమాచారం. మరియూపోల్‌ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య పూర్తి కావడం చాలా గొప్పవిషయమని సైన్యానికి పుతన్‌ అభినందనలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories