కరోనాపై విజయం సాధించిన వియత్నాం.. కరోనాపై పోరాటంలో కీలకపాత్ర పోషించిన స్వదేశీ కిట్లు..

కరోనాపై విజయం సాధించిన వియత్నాం.. కరోనాపై పోరాటంలో కీలకపాత్ర పోషించిన స్వదేశీ కిట్లు..
x
Highlights

కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టడంలో విజయవంతమైన వియత్నాం ప్రశంసలు అందుకుంటోంది. అందుకు ప్రజల్ని చైతన్యపరచడంలో అధికారులు చేపట్టిన చర్యలే కారణం. కరోనా...

కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టడంలో విజయవంతమైన వియత్నాం ప్రశంసలు అందుకుంటోంది. అందుకు ప్రజల్ని చైతన్యపరచడంలో అధికారులు చేపట్టిన చర్యలే కారణం. కరోనా కట్టడిలో ఎన్నో దేశాలు విజయాలు సాధించినా వియత్నాం అందుకు భిన్నం. ఇప్పటివరకు 288 కరోనా కేసులు రావటం ఒక్క మరణం కూడా నమోదు కాకపోవటం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

కరోనా వైరస్ ప్రబలుతోన్న ప్రారంభంలోనే ముప్పును గుర్తించింది వియత్నాం. చైనాలో కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని వియత్నాంకు చెందిన సైబర్‌ నిఘా సంస్థ ఏపీటీ32 ముందే పసిగట్టింది. వెంటనే చైనా, వుహాన్‌ వ్యవహారాలపై నిఘా పెట్టింది. ఈ నిఘా సంస్థ ద్వారా వుహాన్‌లో ఏదో కొత్త తరహా వైరస్‌ వ్యాపిస్తోందని తెలుసుకున్న వియత్నాం నివారణ చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. చైనాతో సరిహద్దు ఎక్కువగా ఉండటంతో కరోనాను ఎదుర్కోవడానికి ఫిబ్రవరి నుంచి త్రిముఖ వ్యూహం అనుసరించింది.

ఇతర దేశాలకన్నా ముందే వియత్నాంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం మొదలుపెట్టింది అక్కడి ప్రభుత్వం. ప్రయాణికుల కాంటాక్ట్‌ వివరాలను కూడా తెలుసుకుంది. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటిన వారిని వైద్య కేంద్రాలకి తరలించి పరీక్షలు చేశారు అక్కడి అధికారులు. ఎయిర్‌పోర్టులతో పాటు రెస్టారెంట్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేశారు. ఎక్కడైనా కరోనా కేసులు వస్తే కాలనీలతో పాటు అవసరమైన చోట్ల ఊళ్లనే కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి జనసంచారానికి అడ్డుకట్ట వేస్తున్నారు అధికారులు.

ఫిబ్రవరి రెండో వారం తరవాత విదేశాల నుంచి తిరిగివచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపడం మొదలుపెట్టారు. మార్చి నుంచే నగరాల్లో వియత్నాం ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. లాక్‌డౌన్‌ చేసిన నగరాల్లోకి బయటివారు ప్రవేశించాలంటే 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. పల్లెల్లో ఒక్క కేసు వచ్చినా బయటివారిని రానివ్వకుండా కంచెలు వేశారు. దేశ ప్రధాని సహా మంత్రులు, రాష్ట్రాల నాయకుల పేర్లతో ప్రజలకు ఫోన్లలో సంక్షిప్త సందేశాలు పంపి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.

టెస్ట్‌ కిట్ల కోసం చైనా మీదో, మరే దేశంపైనో ఆధారపడకుండా సొంతంగా మూడు రకాల కిట్లను తయారుచేసుకుంది వియత్నాం. 25 డాలర్ల విలువ చేసే ఈ కిట్లు గంటన్నరలో ఫలితాలిస్తాయి. కరోనాపై యుద్ధంలో ఈ టెస్టింగ్‌ కిట్లే కీలక పాత్ర వహించాయి. ఇలా వియత్నాం ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరోనాను అదుపులో ఉంచాయి. తొమ్మిది కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు 288 కేసులు మాత్రమే నమోదవటమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories