నిజాం ఆస్తులకు వారసులు మనమే..పాకిస్థాన్‌కు చెంప పెట్టులాంటి తీర్పు

నిజాం ఆస్తులకు వారసులు మనమే..పాకిస్థాన్‌కు చెంప పెట్టులాంటి తీర్పు
x
Highlights

లండన్ లో మూల్గుతున్న నిజాం ఆస్తులకు సంబంధించి ఇంగ్లాండ్ హైకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిజాం ఆస్తులకు అసలు వారసులు భారత్ మాత్రమేనని తేల్చి...

లండన్ లో మూల్గుతున్న నిజాం ఆస్తులకు సంబంధించి ఇంగ్లాండ్ హైకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిజాం ఆస్తులకు అసలు వారసులు భారత్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఆ ఆస్తులకు భారత్ హక్కుదారు కాదంటూ తెంపరితనంతో వాదించిన పాకిస్థాన్ నోరు మూసేసేలా ఇంగ్లాండ్ హైకోర్టు తీర్పు నిచ్చింది.

దశాబ్దాల క్రితం నాటి నిజాం ఆస్తుల కేసులో పాకిస్థాన్‌కు షాక్‌ తగిలింది. గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న వివాదానికి ఇంగ్లండ్ మరియు వేల్స్ హైకోర్టు చెక్ పెట్టింది. భారత్‌లో హైదరాబాద్‌ స్టేట్ విలీనానికి ముందు నిజాం నవాబు పాకిస్థాన్‌కు పంపిన నగదుకు సంబంధించి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. ఆయుధాల కొనుగోలు కోసం నిజాం ఆ నిధులను తమకు బదలాయించారన్న పాకిస్థాన్‌ వ్యాఖ్యలను యూకే హైకోర్టు తోసిపుచ్చింది. 1948లో ఏడవ నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ లండన్ బ్యాంకులో 1 మిలియన్ పౌండ్లు డిపాజిట్ చేశారు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి 35 మిలియన్లకు చేరింది. ఇక ఈ డబ్బులకు అసలైన వారసులం మేమేనంటూ భారత్‌కు చెందిన నిజాం వారసులు ముఖరంఝా, ముఫఖం ఝాలు ముందుకొచ్చారు. ఈ కేసు కొన్నేళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.

1948లో హైదరాబాద్ రాష్ట్ర సంస్థానంపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పుడు.. ఆయుధాల కోసం నిజాం వారసులు పాకిస్థాన్ కు కొంత సొమ్ము చెల్లించారు. అప్పట్లో ఆయుధాలను పంపినందుకుగాను ఏడవ నిజాం ఒక మిలియన్ బ్రిటన్ కరెన్సీని లండన్ లో అప్పటి పాకిస్థాన్ అంబాసిడర్ హబీబ్ ఇబ్రహీం రహీంతుల్లాకు పంపారు. ఆ సొమ్మును ఆయన దగ్గర భద్రంగా ఉంచమని చెప్పారు. ఆ సొమ్మును తన పేరున ట్రస్ట్ లో భద్రపరుస్తున్నట్లు పాకిస్థాన్ అంబాసిడర్ బదులిచ్చారు. ఆ సొమ్ము పై వడ్డీ అప్పటినుంచి పెరుగుతూ ప్రస్తుతం 35 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. లండన్ లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ లో ఈ సొమ్ము ఉంది. అయితే ఈ కేసుపై ఈ మధ్యనే కోర్టు తీర్పు వెలువడింది.

హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ఆపరేషన్ పోలో పేరిట జరిగిన యుద్ధం తర్వాత.. నిజాం 1965లో లండన్ లో ఉన్న నగదుకు హక్కుదారుగా భారత రాష్ట్రపతిని సూచిస్తూ లండన్ కోర్టుకు లేఖ కూడా ఇచ్చారు. అయితే, హైదరాబాద్ స్వాధీన పరచుకోవడమే అక్రమ చర్య అని, అందువల్ల ఈ సొమ్మును భారత్, లేదా బ్రిటన్ దేశాలకు తీసుకునే హక్కు లేదని పాకిస్థాన్ వాదించింది. లండన్‌లో భద్రపరిచిన సొమ్ము చెల్లింపు విషయంలో.. హైదరాబాద్ స్వాధీనమనేది అసలు విషయమే కాదని భారత్ వాదించింది. అప్పటినుంచీ ఈ వివాదం పలు మలుపులు తిరుగుతూ, వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు లండన్ కోర్టు మాత్రం, భారత్‌కే ఆ సొమ్ము చెందుతుందని తేల్చి చెప్పింది. ఏడవ నిజాం భారత్ తో యుద్ధానికి ఆయుధాలు కొనుగోలు చేసినా, నిజాం పంపిన సొమ్ములో కొంత సొమ్మును, పాకిస్థాన్ దగ్గర ఆయుధాల కొనుగోలుకు వాడినా, ఈ సొమ్ముతో పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. నిజాం వారసుడుగా బ్రిటన్ యువరాజు లేదా భారత్ మాత్రమే అర్హులని.. వీరిద్దరికి తప్ప, ఆ సొమ్ముపై మరెవరికీ హక్కు లేదని లండన్ కోర్టు తేల్చింది. దీంతో నిజాం ఆస్తుల కేసు విషయంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories