ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ఆమోదం

ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ఆమోదం
x
Highlights

ఆక్స్ ఫర్డ్– ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చేసింది. ఇప్పటికే ఫైజర్– బయోఎన్టెక్‌లు తయారు చేసిన బీఎన్...

ఆక్స్ ఫర్డ్– ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చేసింది. ఇప్పటికే ఫైజర్– బయోఎన్టెక్‌లు తయారు చేసిన బీఎన్ టీ162 బీ2కు అనుమతిచ్చిన బ్రిటన్ దేశ ప్రభుత్వం ప్రజలకు ఆ టీకాను ఇస్తోంది. అయినా, కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు ఆమోద ముద్ర వేసింది.

ఈ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి ఆరోగ్య సంరక్షణ, ఔషధ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులిచ్చిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు 5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేలా 10 కోట్ల డోసులకు బ్రిటన్ ఆర్డర్ పెట్టింది. కొత్త సంవత్సరంలో వీలైనంత త్వరగా జనానికి వ్యాక్సిన్ వేస్తామని ఆస్ట్రాజెనికా సీఈవో పాస్కల్ సోరియట్ చెప్పారు. వ్యాక్సిన్ కు అనుమతులిచ్చిన బ్రిటన్ ప్రభుత్వం, తయారీలో భాగస్వాములైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మహమ్మారి వ్యాపించిన మొదట్లోనే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ టీకా అభివృద్ధిని మొదలుపెట్టింది. డిసెంబర్ నాటికే తెస్తామని ప్రకటించింది. అనుకున్న టైంకు వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. యుకేలో ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతులు రావడంతో భారత్‌లో టీకా విడుదలకు మార్గం మరింత సుగమమైంది. భారత్‌లోనూ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్ట్రాజెనెకా వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఫైజర్‌తో పోలిస్తే ఆస్ట్రాజెనెకా టీకా ధర తక్కువగా ఉండటంతో పాటు భద్రపరచడం కూడా సులువుగా ఉండటంతో ఈ వ్యాక్సిన్‌ వినియోగంపై పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories