సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం పెరుగుతోందా.. వాటిని కట్టడి చేయక తప్పని పరిస్థితి వచ్చిందా

సోషల్ మీడియా కంపెనీల ఆధిపత్యం పెరుగుతోందా.. వాటిని కట్టడి చేయక తప్పని పరిస్థితి వచ్చిందా
x
Donald Trump (File Photo)
Highlights

అమెరికా అధ్యక్షుడు ట్రంప్....ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి వివాదాస్పద వ్యాఖ్యలు ఆగ్రహపూరిత చర్యలే మొన్నటి వరకూ ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్....ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి వివాదాస్పద వ్యాఖ్యలు ఆగ్రహపూరిత చర్యలే మొన్నటి వరకూ ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను దుమ్మెత్తిపోశారు. తాజాగా ట్రంప్ కోపం సోషల్ మీడియా కంపెనీలపైకి మళ్లింది. ట్విట్టర్ పై వచ్చిన కోపం మిగిలిన సోషల్ మీడియా కంపెనీలకూ చేటు తెచ్చేదిగా మారింది. ఆ విశేషాలేంటో చూద్దాం.

ప్రతీ చిన్న విషయానికీ కోపగించుకోవడం ట్రంప్ అలవాటు. అంతేకాదు గోటితో పోయే దానిపై గొడ్డలి ప్రయోగించడం అంటే కూడా ఆయనకు ఇష్టం. ఆయన చేష్టలు ఎలా ఉన్నప్పటికీ అందుకు చెప్పే లాజిక్ మాత్రం ఆయన అభిమానులకు నచ్చుతుంది. అందుకే రెండో దఫా సైతం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఉరకలు వేస్తున్నారు. తాజాగా ఆయనకు కోపం తెచ్చిన సంఘటన కూడా ఒక విధంగా ఎన్నికలకు ముడిపడిందే. అదే సోషల్ మీడియా. ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో ఏం చేశారో ఇకపై ఏం చేయనున్నారో చూద్దాం.

ఓ నాలుగైదేళ్లుగా ఫ్యాక్ట్ చెకింగ్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తప్పుడు వార్తలు అధికమవుతున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ తప్పనిసరిగా మారింది. తప్పుడు వార్తలు సృష్టించి వాటికి తప్పుడు వీడియోలు, ఫోటోలు జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. ఆ సమస్య ఏర్పడిందే సోషల్ మీడియా నుంచి. తప్పుడు వార్తలు ప్రచారం కావడం అధికం కావడం సోషల్ మీడియా సంస్థలకు రకరకాల చట్టపరమైన సమస్యలు కూడా సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవి ఫ్యాక్ట్ చెకింగ్ పై ప్రధానంగా దృష్టి వహిస్తున్నాయి. తాజాగా ట్విటర్ తీసుకున్న ఓ చర్య మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపంతో ఊగిపోయేలా చేసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఓ రెండు ట్వీట్లు చేశారు. అందులో ఒకటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించింది. అమెరికాలో పలు ప్రాంతాల్లో ఓటర్లు మెయిల్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. డెమొక్రటిక్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రిపబ్లికన్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది. దీనిపై ఆ రెండు పార్టీల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు రాలేదు. తాజాగా ట్రంప్ మాత్రం ఈ విధంగా మెయిల్ లో ఓటుహక్కు వినియోగించుకోవడం వోటర్ ఫ్రాడ్ కు వీలు కల్పిస్తుంది అని ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ట్విట్టర్ ఫ్యాక్ట్ చెకింగ్ హెచ్చరికలు జోడించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సైతం ట్విటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్పిన మాటలకు విలువ లేదా ఆ మాటలు సందేహాస్పదంగా ఉన్నాయంటూ ట్యాగ్ తగిలిస్తారా అంటూ రంకెలేశారు. ఇలా ట్యాగ్ వేయడం అంటే తన అభిప్రాయాలను సెన్సార్ చేయడమే అని మండిపడ్డారు. ట్విటర్ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు. చివరకు అన్నంత పనీ చేశారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియా కంపెనీలకు ఉన్న చట్టపరమైన విస్తృత రక్షణల పరిమితం చేసే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేసేశారు.

నిజానికి ఈ విధమైన హెచ్చరికల జోడింపు మంచిదే కావచ్చు కానీ అవి అటు ట్వీట్ చేసిన వారిని ఇటు ట్వీట్ వీక్షకులకూ ఇబ్బందులు కలిగించేవే అనడంలో సందేహం లేదు. ట్వీట్ చేసిన వారి వైపు నుంచి చూస్తే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం, హక్కు, స్వేచ్ఛ నాకు లేవా అని అనిపిస్తుంది. వ్యక్తం చేసే ప్రతీ అభిప్రాయానికి కూడా బలమైన ఆధారాలు సేకరించి ఉంచుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. ఇక వీక్షకుల వైపు నుంచి చూస్తే ఈ విధమైన ఫ్యాక్ట్ చెకింగ్ వార్నింగ్ చూడగానే ఆ పోస్ట్ తప్పేమో అనే అభిప్రాయమే మొదట కలుగుతుంది. తప్పొప్పులను నిర్ధారించుకునేందుకు తమ సమయాన్ని వెచ్చించేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు చాలా తేలిగ్గా ఆ పోస్ట్ తప్పేమో అని భావించి ఆ పోస్ట్ చేసిన వారి నిజాయితీని శంకిస్తుంటారు. మరో వైపున సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే ప్రతీ పోస్ట్ నిజానిజాలను ధ్రువీకరించుకొని వాటిని సరైనవిగా ప్రకటించడం అనేది సోషల్ మీడియా కంపెనీలకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ట్రంప్ అసాధారణ నిర్ణయం సోషల్ మీడియా కంపెనీలను బాగా ప్రభావితం చేయనుంది.

సోషల్ మీడియా కంపెనీలు ఆయా సోషల్ పోస్టింగ్ లకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సెన్సార్ చేసేందుకు, ఆంక్షలు విధించేందుకు, ఎడిట్ చేసేందుకు, రూపు మార్చేందుకు, హైడ్ చేసేందుకు, ఆల్టర్ చేసేందుకు ప్రస్తుతం అపరిమిత అధికారాలను కలిగి ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు. ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సంస్థలకు సంబంధించి నూతన నిబంధనలను రూపొందించేందుకు ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీలు కల్పించనుంది. న్యాయ నిపుణుల అభిప్రాయాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. సోషల్ మీడియా సంస్థలపై ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూపించే ప్రభావం పెద్దగా ఉండదనే వారు అంటున్నారు. ట్రంప్ చర్య రాజకీయపరమైన హెచ్చరికగా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫెడరల్ చట్టాలను తాజా ఉత్తర్వు ఏమాత్రం మార్చబోదనే చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు బలమైన కారణాలే ఉన్నాయి. వివిధ దేశాల్లో ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దడంలో ఇవి కీలకపాత్ర వహిస్తున్నాయి. ఆ శక్తి దుర్వినియోగమైతే ఏంటి పరిస్థితి అనేది ఒక ప్రశ్న అయితే ప్రభుత్వ విధివిధానాలను ప్రభావితం చేసే రీతిలో అవి బలోపేతం కావడం మంచిదేనా అనేది మరో ప్రశ్న. దానికి తోడు యూజర్ల భావప్రకటన స్వేచ్ఛపై అవి విధిస్తున్న వివిధ రకాల పరిమితులు, ప్రమోషన్ విధానాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ట్రంప్ కు ట్విటర్ లో 80 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. తన విజయాల గురించి చాటి చెప్పుకునేందుకు, విమర్శకులను దుమ్మెత్తిపోసేందుకు ఆయన ట్విటర్ ను ఉపయోగించుకుంటారు. ట్విటర్ తనను హర్ట్ చేసిందని ఇక దాన్ని ఉపయోగించుకోకపోవచ్చుననీ ట్రంప్ అన్నారు. ఇతర సైట్స్ ను తాము ఉపయోగించుకుంటామని లేదంటే కొత్త వాటిని రూపొందించుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఒక ట్వీట్ కు ఫ్యాక్ట్ చెక్ వార్నింగ్ ను జోడించిన ట్విటర్ ఆయన చేసిన మరో ట్వీట్ ను హైడ్ చేసింది. మినియాపొలిస్ లో లూటీలకు పాల్పడే నిరసనకారులను కాల్చేస్తామని.....అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించుతామని ట్రంప్ ట్వీట్ చేశారు. లూటీలు ప్రారంభం కాగానే షూట్ చేయడం మొదలవుతుందని ఆ ట్వీట్ లో ట్రంప్ హెచ్చరించారు. ఈ ట్వీట్ ను ట్విటర్ తప్పుబట్టింది. హింసాకాండను కీర్తించడానికి సంబంధించిన నిబంధనలను ట్రంప్ ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ ట్వీట్ ను ట్విటర్ హైడ్ చేసింది. అమెరికాలోని వివిధ నగరాల్లో అశాంతి పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రంప్, ట్విటర్ ల మధ్య వివాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ట్వీట్ ను కూడా యూజర్లు చూడవచ్చు. కాకపోతే...అంతకంటే ముందుగా ఓ నోటీస్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్వీట్ తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తున్నామని ఆ నోటీస్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా ట్విటర్ పై ట్రంప్ మండిపడేలా చేశాయి.

ట్రంప్ ఉత్తర్వులు రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నవని ట్విటర్ అంటోంది. దశాబ్దాలుగా ఉన్న న్యాయపరమైన రక్షణలకు ముప్పు వాటిల్లిందని విమర్శించింది. భవిష్యత్ ఆన్ లైన్ స్పీచ్ కు, ఇంటర్నెట్ ఫ్రీడమ్ కు తాజా ఉత్తర్వు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. పోస్టింగ్స్ లో వాస్తవాలకు మసి పూయడంపై తాము యూజర్లను హెచ్చరించడాన్ని కొనసాగిస్తామని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ స్పష్టం చేశారు. వివాదంలో ఉన్న సమాచారంపై యూజర్లను అప్రమత్తం చేయడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. నిజానిజాలు వారే నిర్ధారించుకుంటారని చెప్పారు. తమ నుంచి మరింత పారదర్శకత ఉండాలని....మా చర్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని యూజర్లు అర్థం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఈ విధమైన ఫ్యాక్ట్ చెకింగ్ కొన్ని రోజులుగా అధికమైపోయింది. చైనా అధికారిక ప్రతినిధుల ట్వీట్లకు సైతం ట్విటర్ ఫ్యాక్ట్ చెకింగ్ ట్యాగ్ లను జోడించింది. ఇక అమెరికా విషయానికి వస్తే..... ప్రస్తుతం అమెరికాలో పలు చోట్ల హింసాకాండ చోటు చేసుకుంటోంది. అమెరికా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నల్లజాతి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వవర్గాలు చేసే ట్వీట్లు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఎవరికి వారు భావప్రకటన స్వేచ్ఛ తమకు ఉందని అంటున్నారు. రెండు వర్గాల మధ్యలో సోషల్ మీడియా సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు.

ఫేస్ బుక్ ఆవిర్భావంతో సమాజంలో సోషల్ మీడియా ఆధిపత్యం పెరిగిపోయింది. వివిధ దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేంతగా అవి వృద్ధి చెందాయి. భారత్ లోనూ ఇటీవలి ఎన్నికల్లో వివిధ పార్టీలు సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సోషల్ మీడియాలో పేరుకే భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అందులో కంటెంట్ మొదలుకొని ఆ పోస్టింగ్ ఎంతమందికి చేరాలనే విషయాన్ని నియంత్రించే శక్తి కూడా ఫేస్ బుక్ లాంటి కంపెనీలకే ఉంటుంది. దీంతో డబ్బు ఉన్నవారు తమ పోస్టింగ్స్ ఎంతో మందికి చేరేలా చేయగలుగుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేని వారి పోస్టింగ్స్ మాత్రం అందరినీ చేరుకోలేకపోతున్నాయి. ఇక ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల కంపెనీల బడ్జెట్ లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. కొన్ని దేశాల బడ్జెట్ ల కన్నా ఈ కంపెనీల బడ్జెట్లు అధికంగా ఉంటున్నాయి. ఆర్థికంగా బలోపేతమైన ఈ సంస్థలు ప్రభుత్వాల విధివిధానాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఈ తరహాలో బలపడడం అన్ని రకాలుగా చేటు తెచ్చే అంశమే. అలాంటప్పుడు మాతృసంస్థను దాని వైవిధ్యీకరణను బట్టి ముక్కచెక్కలు చేయడమే మంచిదనే వారూ ఉన్నారు. వాణిజ్య రంగంలో గుత్తాధిపత్యానికి సంబంధించి ఈ తరహా నిబంధనలు ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. ఏమైతేనేం.....సామాన్యుడి అభిప్రాయ వేదికలుగా వచ్చిన సోషల్ మీడియా సంస్థలు నేడు ప్రభుత్వాలనే ఎదిరించే స్థాయికి చేరుకున్నాయి. అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే.... ప్రజాభిప్రాయాలను రూపొందించడంలో వాటి శక్తి సామర్థ్యాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం మాత్రం ఉంది.

నేటి ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా తప్పనిసరి అవసరంగా మారింది. అదే సమయంలో సోషల్ మీడియాపై బాధ్యతలు కూడా పెరిగాయి. మరో వైపున ప్రభుత్వాల నుంచి చిక్కులు కూడా అధికమైపోయాయి. వీటన్నిటి మధ్య సమన్వయమే ఓ పెద్ద సమస్యగా మారింది. అన్నిటి కంటే ముఖ్యమైంది అభిప్రాయ వ్యక్తీకరణలో హద్దులను గుర్తించాలి. అలా గుర్తిస్తే ట్రంప్ లా ఆవేశపడాల్సిన అవసరం ఉండదు. మరో వైపున సోషల్ మీడియా సంస్థలు కూడా తమ సామాజిక బాధ్యతల్ని గుర్తించాలి. అప్పుడు మాత్రమే సోషల్ మీడియా నిజంగా ప్రజలను అనుసంధానం చేసే వ్యవస్థగా ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories