మరిన్ని దేశాల్లో లంకా దహనం ముప్పు..! ఆర్థిక మాంద్యం దిశగా అగ్రదేశాల అడుగులు..

These Countries in Danger Zone of Economic Crisis
x

మరిన్ని దేశాల్లో లంకా దహనం ముప్పు..! ఆర్థిక మాంద్యం దిశగా అగ్రదేశాల అడుగులు..

Highlights

Economic Crisis: ద్వీప దేశం శ్రీలంక ఆర్ధిక సంక్షభం జస్ట్ బిగినింగ్ మాత్రమేనా..?

Economic Crisis: ద్వీప దేశం శ్రీలంక ఆర్ధిక సంక్షభం జస్ట్ బిగినింగ్ మాత్రమేనా..? మరిన్ని దేశాలు పూర్తిగా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే వినిపిస్తోంది. ఒకటీ రెండూ కాదు పదుల సంఖ్యలో దేశాలు ఆర్ధిక పతనానికి అతి చేరువలో ఉన్నాయనేందుకు చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో అగ్రరాజ్యాలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకూ, ఆర్థిక పతనం దిశగా పయనిస్తున్న దేశాలేంటి..? ఆ మూడు కారణాలే అగ్ర రాజ్యాలను సైతం తలకిందులు చేసేశాయా..? త్వరలోనే ప్రపంచ మానవ సంక్షోభం తప్పదన్న చర్చల్లో నిజమెంత..?

ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చేసింది. చిన్న, పెద్దా తేడాలేదు అమెరికా నుంచి ఈజిప్ట్ వరకూ ప్రతి ఒక్క దేశం ఇప్పటి వరకూ ఎదురుకాని సంక్షోభానికి సిద్ధం కావాల్సిందే. శ్రీలంక తర్వాత ఒక్కోదేశం సంక్షోభ జాబితాలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక సంక్షోభ విపత్తుకు ద్వీప దేశం శ్రీలంక జస్ట్ బిగినింగ్ మాత్రమే. లంకలో కనిపిస్తున్న ఆర్ధిక కల్లోలం ఇప్పటికే మరిన్ని దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కంటికి కనిపించకుండానే కల్లోలం రేపేందుకు సిద్ధమవుతోంది. అది ఏ క్షణాన అగ్నిపర్వతంలా బద్దలవుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇంతకూ, ఆర్ధిక పతనానికి సిద్ధమైన ఆ దేశాలు ఏంటి..? అగ్ర దేశాలకు కూడా మాంద్యం ముప్పు తప్పదన్న అంచనాల్లో నిజమెంత..?

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి శ్రీలంక తొలి బాధిత దేశమే అయినా ఇప్పటికే ఇతర దేశాలు ఆ జాబితాలో చేరిపోయాయి. మరిన్ని దేశాలు పతనానికి సిద్ధంగా ఉన్నాయి. లెబనాన్, సూరినామ్, జాంబియా, దేశాలు కూడా ఇప్పటికే దివాళా తీయగా రష్యా మిత్ర దేశం బెలారస్ ఆర్థిక సంక్షోభపు అంచుల్లో కొట్టు మిట్టాడుతోంది. పాకిస్తాన్‌పై ఐఎంఎఫ్ అప్పుల భారం పెరిగి పోయింది. వాటిని సకాలంలో తిరిగి కట్టే స్థితిలో దాయాది లేదు. పాక్ దగ్గర మరో 5 వారాల ఎగుమతుల చెల్లింపులకు సరిపడా డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈనేపథ్యంలో పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా భారీగా పతనమైంది. పాకిస్థాన్ కొత్త ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు 40 శాతం దాకా వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. ఇక మన దేశంలోనూ రూపాయి విలువ బాగా పడిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా డాలరుతో రూపాయి మారకం విలువ 80కి పెరగడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈక్వేడార్, ఎల్ సాల్వేడార్, ఇథియోపియా, కెన్యా, ఈజిప్టు, ఘనా, నైజీరియా, ట్యునీషియా, ఉక్రెయిన్, అర్జెంటీనా ఈ దేశాలు ఏ క్షణమైనా ఆర్ధిక మాంద్యంలో మునిగిపోవడం ఖాయం. ఇవి మాత్రమే కాదు అగ్రదేశాలుగా పేరున్న అమెరికా, కెనడా, బ్రిటన్‌, జపాన్‌, ఐరోపా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.

ఇక ఆర్ధిక పతనం దిశగా అడుగులేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్‌దే మొదటి స్థానం. ఉక్రెయిన్ 20 బిలియన్ డాలర్ల రుణాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. వచ్చే సెప్టెంబర్‌లో 1.2 బిలియన్ డాలర్ల లోన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ రష్యా దండయాత్రతో ఇప్పటికే సాయం కోసం పొరుగు దేశాల వైపు చూస్తోంది. దీనికితోడు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కనీసం అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో త్వరలోనే ఆర్ధిక అణు విధ్వంసానికి ఉక్రెయిన్ వేదికకావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, ట్యునీషియా ఇప్పటికే అత్యంత ప్రమాదకరంగా ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఒకటి. ట్యునీషియాకు దాదాపు 10శాతం బడ్జెట్ లోటు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ రంగ వేతన ప్రమాణాల్లో ఒకటి. రుణాలమీదే డిపెండ్ అయిన మొదటి మూడు స్థానాల్లో ఉక్రెయిన్, ఎల్ సాల్వడార్, ట్యునీషియాలు ఉన్నాయి.

మరోవైపు 85 శాతానికి పెరిగిన జీడీపీతో ఘనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఘనా కరెన్సీ విలువ కూడా రీసెంట్‌గా భారీగా క్షీణించింది. ఇప్పటికే పన్ను ఆదాయంలో సగానికి పైగా రుణ చెల్లింపులకోసం ఘనా వెచ్చిస్తోంది. ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు 30 శాతానికి చేరువైంది. ఇక ఈజిప్ట్ 95శాతం అప్పుల్లో ఉంది. ఆర్థిక సంస్థ FIM పార్టనర్స్ ప్రకారం ఈజిప్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. దీని కరెన్సీ విలువ దారుణ పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. మరో దేశం కెన్యా తన ఆదాయంలో 30శాతం అప్పులపై వడ్డీకే సరిపోతుంది. ఇదే సమయంలో దాదాపు సగం ప్రభుత్వ బాండ్లు వాటి విలువను కోల్పోయాయి. 2024లో 2 బిలియన్ డాలర్ల బాండ్ చెల్లింపులు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ దేశంలో అప్పుల భారం ప్రధాన సమస్యగా ఉంది. మరో దేశం నైజీరియా కూడా తన ఆదాయంలో 30శాతం వడ్డీలు కడుతూ ఆర్ధిక పతనం దిశగా అడుగులేస్తోంది.

ఇప్పటికే శ్రీలంక తర్వాత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కూడా పూర్తిగా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ IMFతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, అది ఇంకా కొలిక్కి రాలేదు. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించడం, రుణ సమస్యలు వంటి అనేక ఇబ్బందులు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయి. పాకిస్థాన్ రూపాయి అనూహ్యంగా క్షీణించింది. తన సంపాదనలో దాదాపు 40శాతం వడ్డీ చెల్లింపుల కోసం వినియోగిస్తున్నట్లు దాయాది దేశం తెలిపింది. ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాతో పాటు బెలారస్ కూడా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ లిస్టులో అమెరికా సహా అగ్ర దేశాలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యంలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభం ప్రారంభం కానుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీ వృద్ధి అంచనాను 2.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటన ఆర్థిక సంక్షోభం వస్తుందనడానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు ఎందుకు పతనం దిశగా పయనిస్తున్నాయి..?

ప్రపంచ దేశాల ఆర్ధిక సంక్షోభానికి మొదటి కారణం కోవిడ్ అయితే రెండో కారణం డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడమే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత నెలకొంది. 2023లో తీవ్రమైన చమురు సంక్షోభం ముంచుకు రానుంది. దీంతో స్థానికంగా పరిశ్రమలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభానికి మూడో కారణం స్టాక్‌ మార్కెట్లు కుదేలు కావడం. ఇప్పటివరకు భారీగా ఉన్న ఆస్తుల విలువలు ఉన్నట్టుండి పడిపోయాయి. పలు కంపెనీల స్టాక్‌ విలువలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక్క మే నెల్లోనే మదుపర్లు 11 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోయారు. 11 ఏళ్ల తరువాత ఇంతటి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన హౌస్, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వాల అప్పులు మొత్తం 305 లక్షల కోట్ల డాలర్లు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రపంచ దేశాల అప్పులు 83 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేది. అది 2022 నాటికి 305 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ రుణాల చెల్లింపులో విఫలమైతే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే. ఒక్కమాటలో రానున్న రోజుల్లో ప్రపంచం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories